అమరవీరుల త్యాగం శిరస్మణీయం

– ఎంబీ నర్సారెడ్డి, సీపీఐ(ఎం)
జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు
భద్రాచలం నియోజకవర్గం బండారు చంద్రరావుతో నాకు వ్యక్తిగతంగా అంత పెద్ద పరిచయం లేకపోయినా వారు పార్టీ కోసం గిరిజనుల అభివృద్ధి కోసం చేసినటువంటి పోరాటం మరువలేనిది. టివిఆర్‌ చంద్రం కూనవరం మండలంలో మొట్టమొదటి శాఖ ఏర్పాటు చేసి అక్కడి నుండి పార్టీ అభివృద్ధి కోసం బీజాలు వేశారు. పార్టీ అవసరం కోసం భద్రాచలం మకాం మార్చి కొంతకాలం ఉమ్మడి ఖమ్మం జిల్లా బాధ్యతలు కూడా నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం ఆలిండియా బాధ్యతలు కూడా నిర్వహించారని ఆ విధంగా నియోజకవర్గం లో పార్టీ బలోపేతం అవడానికి ఎంతో కృషి చేశారన్నారు.
దుమ్ముగూడెం, చర్ల మండలాల ప్రజలకు వైఎస్‌ అంటే తెలియని వాళ్ళు ఉండరు. యలమంచి సీతారామయ్య నిరంతరం ఆ ప్రాంతాలలోని గిరిజనులతో మమేకమవుతూ వారితో పాటే వారు తీసుకునే ఆహార పదార్థాలను తీసుకుంటూ వారి అలవాట్లకు కనుగుణంగా వారితో కలిసిపోయి, వారిని అభివృద్ధి చేయటం కోసం కృషి చేసేవారు. నడిచి లేదా సైకిల్‌ పై వెళుతూ నిరంతరం ప్రజలల్లోనే ఉండేవారు. చింతూరు విఆర్‌ పురం ప్రాంతాల్లో భత్తుల భీష్మారావు అంటే తెలియని వారు లేరనే చెప్పాలి. భీష్మ రావు చాలా డేరింగ్‌ డాషింగ్‌ గా ధైర్య సాహసాలు ప్రదర్శించే వారు. ఆ ప్రాంతంలో గిరిజనులకు ఏ ఫారెస్ట్‌ సమస్య వచ్చిన లేదా ఇతర కూలీల సమస్య వచ్చిన తనే స్వయంగా వెళ్లి పరిష్కరించే వారు. ఒకవైపు బండారు చంద్రరావుకి, భీష్మారావుకి, శ్యామల వెంకట రెడ్డికి మావోయిస్టుల నుంచి ముంపు పొంచి ఉన్నదని తెలిసిన ఏ మాత్రం లెక్కచేయకుండా నిరంతరం ఏజెన్సీ ప్రాంతాల్లోని గూడాలకు వెళ్తూ వాళ్ళ సమస్యల పరిష్కరించడానికి కృషి చేసేవారు. చివరకు విఆర్‌ పురం మండలం జీడి గుప్ప దగ్గర నక్సలైట్లు దారిగాసి హత్య చేసే ముందు కూడా ఏమాత్రం భయపడకుండా వారికి ఎదురు తిరిగి ప్రాణాలర్పించారు.
ఆ తర్వాత కాలంలో బండారు చంద్ర రావు, భీష్మారావు నక్సలైట్లతో హత్యగావించిన తరువాత నాయకత్వ లోపం గ్రహించి మారుమూల మల్లంపేట గ్రామంలో నివసిస్తున్నటువంటి శ్యామల వెంకట రెడ్డి తను బాధ్యతలు తీసుకొని డివిజన్‌ కేంద్రమైన భద్రాచలంలో ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశారు. క్రమంలో గతంలో నక్సలైట్స్‌ నుంచి రెండుసార్లు దాడి జరిగినప్పుడు తప్పించుకొని ప్రాణాలు కాపాడుకున్నప్పటికీ వారి నుంచి ముప్పు ఉన్నదని తెలిసి కూడా ఏమాత్రం భయపడకుండా గ్రామాలు తిరుగుతూ ప్రజా సమస్యలపై పోరాటాలు చేశారు. ఆ క్రమంలో నెల్లిపాక కేంద్రంగా కూలి పోరాటాలు జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతాంగం వెంకట్‌ రెడ్డి మీద దాడి చేసి చంపాలని ప్రయత్నించిన ఏమాత్రం భయపడకుండా వారిని ఎదిరించి వ్యవసాయ కూలీలకు కూలి రేట్లు పెంచేదాకా వెనక్కి తగ్గలేదు. అదేవిధంగా భద్రాచలంలో ఒక ఉన్నత స్థాయి పోలీస్‌ అధికారి సామాన్యమైనటువంటి వ్యక్తిని కొట్టి హింసించినప్పుడు ఆయన ఆఫీస్‌ ఎదురుగానే ధర్నా చేసి అధికారులను ఛాలెంజ్‌ చేసినటువంటి వ్యక్తి శ్యామల వెంకట రెడ్డి. అదే కాకుండా కోయ భాష, గోత్తె భాష, హిందీ భాషలు నేర్చుకొని, వారి భాషలోనే వారు చెప్పేవి అర్థం చేసుకొని, కార్యకర్తలకు ఒక మొక్కవోని ధైర్యంగా ఉండేవారు. చివరకు నక్సలైట్లు చేతిలోనే అదే సొంత గ్రామం మల్లంపేటలో1996లో హత్యగావించబడ్డారు. వెంకటాపురం ప్రాంతంలో జ్ఞానం సారయ్య తను ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా కుటుంబ పోషణ ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఏ మాత్రం లెక్కచేయకుండా పార్టీ అభివృద్ధి కోసం చనిపోయేవరకు కృషి చేశారన్నారు.
సింఫుల్‌ సిటీకి మారు పేరు కుంజా బుజ్జి
చర్ల ప్రాంతంలో బీఎస్‌ రామయ్య తన ఉద్యోగాన్ని వదులుకొని కూడా పార్టీ కోసం కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న సరే లెక్కచేయకుండా చివరి వరకు పార్టీ అభివృద్ధి కోసం పని చేశారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన కుంజా బుజ్జి అతి సామాన్య జీవితం గడుపుతూ నిరంతరం ప్రజల్లో ఉంటూ తనకు ప్రభుత్వం ఇచ్చే వేతనాన్ని కూడా పార్టీకి ఇస్తూ తన కుటుంబ అవసరాలకు కావలసిన వరకే తీసుకొని ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ ఒక గడ్డి ఇంట్లో ఉంటూ సింపుల్‌ సిటీకే మారుపేరుగా నడిచి లేదా మోటార్‌ సైకిల్‌ పై తిరుగుతూ పార్టీ వాహనంపై ప్రజల దగ్గరికి వెళుతూ నిరంతరం ప్రజా, కార్మికులు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజల సమస్యలపై అసెంబ్లీలో కొట్లాడేవారు. చివరి వరకూ అతి సామాన్య జీవితాన్ని గడిపారు.
అసెంబ్లీలో ఒకే ఒక ఎర్రజెండా ఎమ్మెల్యే సున్నం రాజయ్య
సున్నం రాజయ్య మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకున్న 15 ఎకరాల పొలాన్ని కూడా స్థానిక అవసరాలైనటువంటి స్కూలు, హాస్టల్‌ నిర్మాణానికి దానం చేశారు. గిరిజన విద్యార్థులు చదువుకుంటే బాగుపడతారనే సదుద్దేశంతో గిరిజన ప్రాంతంలోకి స్కూల్స్‌ వస్తే అందరూ చదువుకుంటారనే ఆలోచనతో ఆ విధంగా కషి చేశారు. అసెంబ్లీలో ఒకే ఒక ఎర్రజెండా ఎమ్మెల్యేగా ఉన్నా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు, కార్మికులకు, ఉద్యోగులకు ఏకైక ప్రతినిధిగా పని చేశారు. చివరి వరకు నీతి నిజాయితీలకు విలువనిస్తూ నిరంతరం ప్రజల్లో ఉన్నారు. అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేసిన ఈ అమరవీరులను ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

Spread the love