నవతెలంగాణ – ఉత్తరప్రదేశ్
ఒక సాధువు వింతగా ప్రవర్తించాడు. ఐదేండ్ల బాలుడ్ని పైకి ఎత్తి పలుమార్లు నేలకేసి కొట్టి చంపాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లాలో ఈ దారుణ సంఘటన జరిగింది. మధ్యప్రదేశ్‌లోని భిండ్ జిల్లాకు చెందిన 52 ఏండ్ల ఓం ప్రకాష్ సప్తకోసి యాత్ర చేపట్టాడు. ఉత్తరప్రదేశ్ మథుర జిల్లాలోని గోవర్ధన్ ప్రాంతానికి చేరుకున్న అతడు శనివారం ఉన్నట్టుండి వింతగా ప్రవర్తించాడు. అక్కడ చిన్న షాపు నిర్వహిస్తున్న వ్యక్తి కుమారుడు రోడ్డుపై ఉన్నాడు. ఓం ప్రకాష్ పరుగెత్తి ఆ బాలుడి వద్దకు వెళ్లాడు. బాలుడ్ని తన భుజానికి ఎత్తుకున్నాడు. ఆ తర్వాత ఆ చిన్నారి కాళ్లు పట్టుకుని నేలకేసి పలుమార్లు బలంగా కొట్టాడు. దీంతో తలకు తీవ్ర గాయం కావడంతో ఆ బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ సంఘటన చూసి స్థానికులు భయాందోళన చెందారు. వేంటనే తేరుకున్న కొందరు ఓంప్రకాష్ వద్దకు పరుగున వెళ్లారు. బాలుడ్ని రక్షించేందుకు ప్రయత్నించారు. బాలుడు మరణించడం చూసి కోపంతో రగిలిపోయి ఓంప్రకాష్‌ను పట్టుకుని కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత స్థానికులు ఆ మార్గాన్ని మూసివేసి కొంతసేపు నిరసన తెలిపారు. కాగా, పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.