పాటల తోనూ విప్లవాన్ని తీసుకురావచ్చని నిరూపించిన ప్రజా గాయకుడు గద్దర్. కవిగా, విప్లవకారుడిగా, గాయకుడిగా..
ప్రజా సమస్యలపై పాట రూపంలో కోట్ల మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఉద్యమకెరటం,
ప్రజా యుద్ధనౌక గద్దర్. సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై, అక్రమాలపై, సామాజిక సమస్యలపై ఆయన పాడిన పాటలు జనం మధ్య, వేదికలపైనే కాకుండా వెండితెరపై కూడా మారుమోగాయి.
‘మా భూమి’ (1979) సినిమా కోసం తొలిసారి గద్దర్ పాట పాడటమే కాకుండా నటించారు కూడా. ప్రజా సమస్యలపై తెరకెక్కిన చిత్రమిది. సాయిచంద్, రామిరెడ్డి, తెలంగాణ శకుంతల ముఖ్య పాత్రధారులుగా ప్రముఖ దర్శకుడు గౌతమ్ ఘోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ‘బండెనక బండి కట్టి..’ పాటలో గద్దర్ నటించారు. గతంలో ఏ ప్రజా ఉద్యమం జరిగినా ఈ పాట లేకుండా అది పూర్తయ్యేది కాదు. పలు కార్యక్రమాల్లోనూ అనేక వేదికలపై ఈ పాట వినిపించేది.
అలాగే ‘రంగుల కల’ చిత్రంలోనూ గద్దర్ కనిపిస్తారు. ఆ తర్వాత ఆర్.నారాయణమూర్తి నటించిన ‘ఓరేరు రిక్షా’ సినిమా కోసం గద్దర్ రాసిన ‘మల్లెతీగకు పందిరి వోలే.. నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా..’ పాట ఎవర్‌గ్రీన్ సాంగ్‌గా నిలిచింది. అన్నా చెల్లెళ్ళ అనుబంధం తెలిపే పాటల్లో అదొక కలికి తురాయి. ఒకప్పుడు రాఖీ పండగ వచ్చిందంటే రేడియో, టీవీల్లో ఈ పాట లేకుండా గడిచేది కాదంటే అతిశయోక్తి కాదు. ఈ పాటకు ఉత్తమ రచయితగా గద్దర్‌కు, ఉత్తమ సంగీత దర్శకుడిగా వందేమాతరం శ్రీనివాస్‌కు నంది అవార్డులు లభించాయి. అయితే ఈ అవార్డులను వీరు తిరస్కరించారు.
2011లో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో జగపతిబాబు కథా నాయకుడిగా రూపొందిన ‘జై బోలో తెలంగాణ’లో గద్దర్ రాసిన ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా..’ పాట ఉద్యమానికి కొత్త ఊపిరిలూదింది. ఈ పాటతో గద్దర్ మరోసారి సిల్వర్‌స్క్రీన్‌పై మెరిసి, మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చారు. ఈ పాటకు కూడా ఆయనకు ఉత్తమ గాయకుడిగా నంది అవార్డు వరించింది.
అలాగే ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ సినిమాలో రాసిన ‘మేలుకో రైతన్న..’ పాట రైతులను ఉత్తేజపరిచింది.
గద్దర్ నటించిన చివరి చిత్రం
‘ఉక్కు సత్యాగ్రహం’
సత్యారెడ్డి కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. విశాఖ స్టీల్ ఫ్లాంట్ నేపథ్యంలో రూపొందు తున్న ఈ చిత్రంలో గద్దర్ కీలక పాత్ర పోషించడమే కాకుండా పాటలు కూడా రాశారు.
ప్రజా..ప్రయోజన గాయకుడు
పల్లెపాట మీద ప్రేమ పెంచుకుని, జనం పాటను గుండెకు హత్తుకుని, పోరుపాటను ఎగిరే జెండాకు అద్దిన, ప్రజల గుండె గొంతుక ప్రజా యుద్ధనౌక గద్దర్ మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అలాగే హైదరబాద్‌లోని ఎల్‌బి స్టేడియంలో ఉన్న గద్దర్ భౌతిక కాయానికి పవన్‌కళ్యాణ్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు ఘన నివాళి అర్పించారు.
వారి గళం అజరామరం. ఏ పాట పాడినా.. దానికో ప్రజా ప్రయోజనం ఉండేలా గొంతు ఎత్తి పోరాడిన ప్రజా గాయకుడు, ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దరన్నకి లాల్ సలాం. సరళంగా ఉంటూనే అత్యంత ప్రభావవంతమైన తన మాటల పాటలతో దశాబ్దాల పాటు ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చిన గద్దరన్న ఇక లేరు అనే వార్త తీవ్ర విషాదాన్ని కలుగజేసింది. ప్రజా సాహిత్యంలో, ప్రజా ఉద్యమాలలో ఆయన లేని లోటు ఎప్పటికీ పూడనిది. పాటల్లోనూ, పోరాటంలోనూ గద్దరన్న గొంతు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. – చిరంజీవి
తన ఆటపాటలతో ప్రజా ఉద్యమాలు నడిపించిన విప్లవకారుడు. ఆయనొక విప్లవశక్తి. ప్రజా ఉద్యమ పాటలంటే తెలుగు రాష్ట్రాల్లోనూ, దేశవ్యాప్తంగా మన గద్దర్ గుర్తుకు వస్తారు. ప్రజా ఉద్యమాల్లో గద్దర్ లేని లోటును ఎవ్వరూ తీర్చలేరు. – బాలకృష్ణ
ప్రజాగాయకుడు గద్దర్ మరణించారంటే నమ్మశక్యం కావడం లేదు. అస్వస్థతతో బాధపడుతున్న ఆయనను చూడటానికి కొద్ది రోజుల క్రితమే ఆసుపత్రికి వెళ్ళాను. తమ్ముడా.. అంటూ అప్యాయంగా పలకరించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు, జాతీయ, అంతర్జాతీయ విషయాల గురించి మాట్లాడుకున్నాం. ‘మాభూమి’ చిత్రంలో ఆయన గానం చేసిన ‘బండెనక బండి..’ అనే చైతన్య గీతం అజరామం. – పవన్‌కళ్యాణ్
నేను స్టూడెంట్‌గా ఉన్నప్పటి నుంచి మా ఇద్దరి మధ్య పరిచయం ఉంది. నా సినిమాలకు సంబంధించి ఫీడ్ బ్యాక్ ఇచ్చేవారు. ‘జై బోలో తెలంగాణ’ చిత్రంలో ఓ కీలక సన్నివేశం కోసం ఆయనే పాట రాసి, పాడి, నటించి సినిమాకు, తెలంగాణ ఉద్యమానికి, ప్రేక్షకులకు ఉద్యమం పట్ల ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చారు. ఆయన స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని చరిత్ర ఎన్నటికీ మరవదు. – దర్శకుడు ఎన్.శంకర్