– అక్రమ రవాణాను అడ్డుకునేవారే లేరా..
– అక్రమార్కుల చేతిలో అధికారులు కీలు బొమ్మలా..?!
– అలసత్వం వహించడంలో ఆంతర్యమేమిటో..?
– ల్యాబర్తి గ్రామంలో ఇష్టారాజ్యంగా అక్రమార్కులు
నవతెలంగాణ-పర్వతగిరి
వర్ధన్నపేట మండలం ల్యాబర్తి గ్రామంలో మళ్లీ ఇసుక తవ్వకాల జోరు మొదలైంది. తవ్వినోళ్లకు తవ్వినంత అన్న చందంగా అక్రమార్కుల ఇష్టారాజ్యం కొనసాగుతుంది. స్థానిక అధికారులకు ముడుపులు ముడితే చాలు, ఆ చుట్టుపక్కలకు వెళ్లే పరిస్థితి ఉండదని గ్రామస్థులు బాహాటంగా ఆరోపిస్తున్నారు. గ్రామంలో నలుగురు వ్యక్తులు ఒకరి తర్వాత మరొకరు తవ్వకాలు చేస్తూ ఒప్పందం ప్రకారం వ్యవసాయ భూములను తవ్వుతూ.. ఇసుక మాఫియాను కొనసాగిస్తున్నారన్నారని చెబుతున్నారు. ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ జోరుగా తవ్వకాలు జరుపుతున్నారు. పత్రికల్లో పలుమార్లు వరుస కథనాలు వచ్చినా అధికారుల్లో, తవ్వకాలు జరుపుతున్న అక్రమార్కుల్లో ఎలాంటి మార్పు లేకపోవడం విశేషం. నిరంతరం కొనసాగుతున్న ఇసుక మాఫియాను అడ్డుకోవాలంటే గత యుగంలో మాదిరిగా మరో దేవుడు పట్టాల్సిందేనని అన్న చందంగా వర్ధన్నపేట ఇసుక మాఫియా తయారైందని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ల్యాబర్తి గ్రామంలో ఒక్క రోజుకు 100 ట్రాక్టర్లు లోడ్ చేసి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే అడ్డుకోవాల్సిన అధికారుల్లోనే కొంతమంది అక్రమార్కులకు వంతపాడుతున్నారని స్థానిక ప్రజలు బాహాటంగానే చెబుత ున్నారు. తవ్వకాల వద్దకు అధికారులు వెళ్లితే ఎవరూ దొరక పోయినప్పటికీ సమగ్ర విచారణ చేపట్టైనా సరే అక్రమార్కులను అరెస్టు చేసి కేసులు మోపి పోలీస్ స్టేషన్లో కస్టడీలో ఉంచాలని స్థానికులు కోరుతున్నారు. అలా చేసినప్పుడు మాత్రమే ఈ దందాకు అడ్డుకట్ట పడుతుని ప్రజలు కోరుతున్నారు.
ఈసారి కఠిన చర్యలు తీసుకుంటాం : ఎస్సై ప్రవీణ్‌కుమార్(పర్వతగిరి)
ఇసుక దందాపై ఎస్సై ప్రవీణ్ కుమార్‌ను నవ తెలంగాణ వివరణ కోరగా ఇదివరకు సంబంధిత వ్యక్తులపై, ట్రాక్టర్‌ల పై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇప్పుడు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు.