రగిలిపోతున్న సంఘ్ పరివార్‌

రగిలిపోతున్న సంఘ్ పరివార్‌– మోడీ-షా ద్వయంపై ఆగ్రహం
– ఓటమికి వారే కారణమని మండిపాటు
– ఏకపక్ష నిర్ణయాలతో కొంప ముంచారని ధ్వజం
– సంప్రదింపులకు స్వస్తి చెప్పారని ఆరోపణ
న్యూఢిల్లీ : సంరగిలిపోతున్న సంఘ్ పరివార్‌ పరివార్‌ లోలోన రగిలిపోతోందా ? ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఘ్ చాలక్‌ మోహన్‌ భగవత్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అందరి మనసుల్లో ఇదే ప్రశ్న తలెత్తుతోంది. ఎన్నికల ప్రచార సరళిని భగవత్‌ తప్పుపట్టారు. అది హుందాతనం కోల్పోయిందంటూ అసహనం వ్యక్తం చేశారు. మణిపూర్‌ ఘర్షణలను నివారించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించే భగవత్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్లు కన్పిస్తోంది.
మోడీ తన ఎన్నికల ప్రచారంలో ముస్లింలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. సంఫ్‌ు పరివార్‌ సైద్ధాంతిక భావజాలం నుండి ఆయన పూర్తిగా పక్కకు జరిగారన్న అభిప్రాయం వ్యక్తమైంది. ముస్లింలను చొరబాటుదారులని, అధిక సంతతి కలిగిన వారని మోడీ ఎత్తిపొడవడం బీజేపీకి రాజకీయంగా నష్టాన్నే కలిగించింది. పనిలో పనిగా ఆయన కాంగ్రెస్‌పై కూడా పలు అసత్య ఆరోపణలు చేశారు. మోడీ తన ఎన్నికల ప్రచారంలో విద్వేష ప్రసంగాలు చేసినప్పటికీ ఆర్‌ఎస్‌ఎస్‌ పెదవి విప్పలేదు. మోడీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యక్తమైన వ్యతిరేకతను ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారకులు పసిగట్టే ఉంటారని, అందుకే వారు అంత క్రియాశీలకంగా వ్యవహరించలేదని పరిశీలకులు తెలిపారు.
భగవత్‌ చురకలు
అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత విమర్శకులు తమ గళాలకు పదును పెట్టారు. బీజేపీకి లోక్‌సభలో కనీసం స్పష్టమైన మెజారిటీ కూడా దక్కకపోవడం తో భగవత్‌ వంటి ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖులు సైతం తమ అసంతృప్తిని, అసహనాన్ని బాహాటంగానే వ్యక్తపరిచారు. ఎన్నికల ప్రచారంలో గౌరవంగా వ్యవహరించలేదని, సంయమనాన్ని ప్రదర్శించలేదని భగవత్‌ వ్యాఖ్యానించారు. భగవత్‌ వ్యాఖ్యలు కేవలం మోడీనో, బీజేపీ కేంద్ర నాయకత్వాన్నో మాత్రమే ఉద్దేశించి చేసినవి కావని ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు ఆ తర్వాత వివరణలు ఇచ్చుకున్నారు. ప్రతిపక్షాలను విరోధులుగా ఆర్‌ఎస్‌ఎస్‌ చూడడం లేదని కూడా భగవత్‌ చెప్పారు. ప్రజాస్వామ్య రాజకీయ సంస్కృతికి ఆర్‌ఎస్‌ఎస్‌ ఈ విధంగా మద్దతు తెలపడం చాలా అరుదు. అహంకారం లేని నాయకుడే నిజమైన ప్రజా సేవకుడంటూ భగవత్‌ చేసిన వ్యాఖ్య ఎవరికి తగలాలో వారికే తగిలింది. తాను ప్రధానమంత్రిని కాదని, ప్రధాన సేవకుడినని మోడీ తనకు తానే చెప్పుకుంటారు. దీనిని దృష్టిలో పెట్టుకొనే భగవత్‌ ఆ వ్యాఖ్యలు చేశారని అర్థమవుతోంది.
వీరు సైతం…
భగవత్‌ వ్యాఖ్యలను అలా ఉంచితే ఇంద్రేష్‌ కుమార్‌ వంటి ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు మరింత తీవ్ర పదజాలంతో ప్రకటనలు చేశారు. గర్విష్టి పార్టీని శ్రీరాముడు నిలువరించాడని ఇంద్రేష్‌ దెప్పి పొడిచారు. మితిమీరిన విశ్వాసంతో వ్యవహరించిన బీజేపీ కార్యకర్తలకు ఈ ఫలితాలు నిజంగానే కళ్లెం వేశాయని సంఫ్‌ు సిద్ధాంతకర్త రతన్‌ షర్దా ‘ఆర్గనైజర్‌’ పత్రికకు రాసిన వ్యాసంలో అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో సహకరించాల్సిందిగా బీజేపీ నాయకత్వం ఆర్‌ఎస్‌ఎస్‌ స్వయంసేవకులను కోరలేదని ఆయన విమర్శించారు. భారత్‌ మరోసారి సంకీర్ణ రాజకీయాల ఊబిలోకి జారుకున్నదని ఆర్‌ఎస్‌ఎస్‌ నేత రాంమాధవ్‌ తెలిపారు. అట్టడుగు వర్గాల సమస్యలను పట్టించుకోకపోయినా ధనబలంతో గెలుస్తామని భావించిన వారందరికీ ఎన్నికల ఫలితాలు ఓ సందేశాన్ని అందించాయని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెప్పారు. అభ్యర్థుల ఎంపిక తీరుపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల విమర్శలన్నీ బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని…ముఖ్యంగా మోడీ-షా ద్వయాన్ని లక్ష్యంగా చేసుకుని చేసినవేనని స్పష్టమవుతోంది. పార్టీలో విధాన నిర్ణయాలన్నింటినీ వీరిద్దరే తీసుకునే వారు. తమను సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ పలువురు నేతలు లోలోన తీవ్రమైన అసంతృప్తికి గురయ్యారు.
సుధీంద్ర కులకర్ణి ఏమన్నారంటే…
భగవత్‌ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాలని ఒకప్పుడు సంఫ్‌ు పరివార్‌లో క్రియాశీలక పాత్ర పోషించిన సుధీంద్ర కులకర్ణి అన్నారు. గత పది సంవత్సరాల కాలంలో ప్రధానిని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ విమర్శించడం ఇదే మొదటిసారని ఆయన గుర్తు చేశారు. మోడీ ప్రచారం యావత్తూ అబద్ధాలతో సాగిందని, ఎక్కడా హుందాతనం కన్పించలేదని భగవత్‌ అభిప్రాయపడ్డారని తెలిపారు. మోడీ ప్రభుత్వ ఏకపక్ష పనితీరుపై పరివార్‌ చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నదని చెప్పారు. మోడీ-షా ద్వయం ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల అభిప్రాయాలకు ఎన్నడూ ప్రాధాన్యత ఇవ్వలేదని విమర్శించారు. వారు ఆర్‌ఎస్‌ఎస్‌తో చర్చలు జరపలేదని, సంస్థను గౌరవించలేదని మండిపడ్డారు. ఆర్‌ఎస్‌ఎస్‌పై బీజేపీ ఇంకెంత మాత్రం ఆధారపడబోదని నడ్డా చేసిన ప్రకటనపై కులకర్ణి నిప్పులు చెరిగారు. నడ్డా ప్రకటనలో ఆగ్రహించిన ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారని, అమేథీలో అయితే బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేశారని చెప్పారు. కొన్ని సంవత్సరాల క్రితం ముస్లిం పెద్దలతో భగవత్‌ సంప్రదింపులు మొదలు పెట్టారని, కానీ ప్రభుత్వం ఆయనకు మద్దతు తెలపలేదని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఫ్‌ుచాలక్‌తో అభిప్రాయబేధాలు ఉన్నప్పటికీ వాజ్‌పేయి, అద్వానీ వంటి నేతలు ఆయనను ఎల్లప్పుడూ గౌరవించేవారని కులకర్ణి గుర్తు చేశారు.
వారిది రెండు నాల్కల ధోరణి
ఆర్‌ఎస్‌ఎస్‌ రెండు నాల్కల ధోరణిని ప్రదర్శిస్తోందని సీనియర్‌ పాత్రికేయుడు ధీరేంద్ర కే ఝా అభిప్రాయపడ్డారు. బీజేపీకి స్పష్టమైన మెజారిటీ లభించకపోవడంతో ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు ఇప్పుడు దాని వైఫల్యాలను ఎత్తిచూపుతున్నారని ఆయన తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మణిపూర్‌ ఘర్షణలకు ఆజ్యం పోశారని, ఇప్పుడేమో ఆ ఘర్షణలపై భగవత్‌ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని, ఇది రెండు నాల్కల ధోరణి తప్పించి మరోటి కాదని విమర్శించారు. సాంస్కృతిక సంస్థగా వ్యవహరిస్తానని హామీ ఇచ్చిన మీదటే ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధాన్ని ఎత్తివేశారని అంటూ ఇప్పుడేమో అది రాజకీయ సంస్థ మాదిరిగా పనిచేస్తోందని ఆరోపించారు.

Spread the love