‘హిందూత్వ’కు తగ్గిన ఆదరణ- లౌకికస్ఫూర్తే ప్రేరణ

కర్నాటకలో కాంగ్రెస్‌ భారీ విజయాన్ని ప్రభావితం చేయడానికి కారణం, బీజేపీ ఎందుకు పతనమైందనే చర్చ నేడు దేశవ్యాప్తంగా నడుస్తోంది. కర్నాటక ఫలితాలతో మిగతా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ప్రణాళికలు సిద్ధం చేయడానికి హస్తం పార్టీ శరవేగంగా ముందుకు సాగుతోంది. కాంగ్రెస్‌ జాతీయ స్థాయి రాజకీయ సైద్ధాంతిక కూటమిని నిర్మించడం ద్వారా బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదుర్కొనే శక్తికి రంగం సిద్ధం చేస్తోంది. కర్నాటక ఎన్నికల ఫలితాల్లో వైఫల్యాలు ఎదుర్కొన్న బీజేపీకి ప్రధానంగా హిందుత్వ ప్రచారణకు తగ్గిన ఆదరణ. అది ఇప్పుడు కర్నాటకలోనే కాదు, దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది. తెలంగాణ, తమిళనాడు, కేరళ ఏ రాష్ట్రమైనా కేవలం మతపరమైన మార్గాల్లో ఓటర్లను ప్రభావితం చేసే ఉదేశ్యంతో నడిచే ప్రచారం ఇక చెల్లదని కర్నాటక ఫలితాలు తేల్చిచెప్పాయి. అంతే కాకుండా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదరణ కూడా పరిమితమైంది. రాజకీయ సమీకరణలు, పార్టీ సత్ఫలితాలు కోసం మత రాజకీయాల కథనం ఏ మాత్రం పని చేయవని అర్థమవుతున్నది. కర్నాటక రాష్ట్ర ఎన్నికల్లో ఎన్నికల ఫలితాల్లో అంశాల వారిగా పరిశీలించినట్టయితే మొదటగా కాంగ్రెస్‌ ఎన్నికల నిర్వహణ వికేంద్రీకరణ, స్థానిక నాయకులకు అధికారం ఇవ్వడం కీలక పరిణామం. దీనికితోడు లౌకికవాదం బాగా పనిచేసింది. భారత్‌ జోడో యాత్ర సందర్బంగా రాహుల్‌ గాంధీ పాదయాత్రలో అట్టడుగు స్థాయి కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు నుండి పెద్ద వారి వరకు, క్యాడర్‌ మొత్తం సంఘీభావం ప్రకటించింది. ఒకే భావాన్ని కలిసికట్టుగా పంచుకోవడానికి కొత్త ఉత్సాహాన్ని ప్రేరేపించడానికి సహాయపడింది. ఒక సమానమైన మంచి అనుభూతి పార్టీ కేడర్‌ మొత్తం పంచుకోవడం రాష్ట్ర స్థాయి ఎన్నికల విజయానికి పధాన కారణంగా చెప్పుకోవచ్చు. సిద్ధరామయ్య, డి.కె. శివకుమార్‌ల కూడుకున్న దృఢ మయిన పార్టీ అంతర్గత ఎన్నికల యంత్రాంగం ఒక ఎత్తయితే, ధరల పెరుగుదల, నిరుద్యోగం, అవినీతి వంటి సామాజిక-ఆర్థిక కారణాల పాత్ర బీజేపీకి వ్యతిరేకంగా నిరసన ఓటును సమీకరించింది.
వివాదాస్పద అంశాలతోనే బీజేపీ ఓటమి
బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసిన కొన్ని అంశాలను తీసుకున్నట్టయితే మొదటిది లింగాయత్‌ల బలమైన వ్యక్తి బిఎస్‌ యడ్యూరప్ప పట్ల పార్టీ వ్యవహరించిన తీరు. లింగాయత్‌ల మద్దతును దెబ్బతీసింది. 2021లో బీజేపీ బసవరాజ్‌ బొమ్మైని సీఎంగా నియమించినప్పుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చిన సమయం దాదాపు 1990లో పాటిల్‌ వ్యవహారం కాంగ్రెస్‌కు జరిగినటువంటిదే. రాజీనామా అందజేసే సమయంలో యడ్యూ రప్ప కన్నీళ్లు పెట్టుకోవడంతో లింగాయత్‌ల మద్దతు పూర్తిగా దెబ్బతిన్నది. హిందుత్వ ధోరణిని అనుసరించకుండా కాంగ్రెస్‌ ప్రచార వ్యూహం అభివృద్ధి ప్రణాళికలపై దృష్టి సారించడం కలిసొచ్చింది. చాలా కాలంగా బీజేపీ ప్రచారం అంతా టిప్పు సుల్తాన్‌ వివాదం, హలాల్‌, హిజాబ్‌కు సంబంధించిన సమస్యలపై కేంద్రీకృతమై ఉంది. ఎన్నికల దగ్గర పడ్డ సమయంలో మాత్రమే అభివృద్ధి గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. బీజేపీ పరాజయానికి చివరి కారణం ముఖ్యమంత్రి బొమ్మైకి ఆదరణ లేకపోవడమే. ఉత్తర భారత రాష్ట్రాలలో మోడీకి ఉన్న ప్రజాదరణపై వరుసగా ఎన్నికలను గెలిచినప్పటికీ కర్నాటక విషయంలో ఆ ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయింది. పాత మైసూరు ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్న వొక్కలిగ సామాజికవర్గం ఓట్లపై జేడీఎస్‌ చాల కాలంగా ఆధిక్యత కనబరుస్తోంది. అయితే జేడీఎస్‌ నాయకులు ఎంత ప్రయత్నించినప్పటికీ అక్కడ ప్రభావితం చేయలేకపోయారు. జేడీఎస్‌ పరస్పరం బీజేపీ, కాంగ్రెస్‌ ఇరువైపులా అవకాశాన్ని బట్టి మారడం ఆ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసింది. అయితే కర్నాటక ఎన్నికలు కాంగ్రెస్‌ శ్రేణులకు, లౌకికవాదం కోరుకునే ప్రజాతంత్ర శక్తులకు ఈ విజయం అమూల్యమైనది. ఆహ్వానించదగినది.
– సంపత్‌కృష్ణ దన్నంనేని
 9849097835

Spread the love