సెన్సార్‌ తీరు మారాలి

భారతదేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేందుకు విఫల యత్నాలు చేస్తూ, అనునిత్యం హేయమైన కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా దురహంకారానికి వ్యతిరేకంగా తెరకెక్కిన చిత్రం ‘భారతీయన్స్‌’. ఈ చిత్రానికి సెన్సార్‌ పరంగా కలుగుతున్న అసౌకర్యం పట్ల చిత్ర నిర్మాత డా.శంకర్‌ నాయుడు అడుసుమిల్లి విస్మయం వ్యక్తం చేశారు. మాతదేశంపై తనకు గల అవ్యాజ్యమైన అభిమానం, మమకారంతో, లాభాపేక్ష లేకుండా ఎన్నో వ్యయ ప్రయాసలతో నిర్మించిన బహు భాషా చిత్రానికి సెన్సార్‌ సర్టిఫికెట్‌ జారీ చేయడంలో జరుగుతున్న జాప్యాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మాజీ ఉప రాష్ట్రపతి ఎమ్‌.వెంకయ్య నాయుడు, ‘కశ్మీర్‌ ఫైల్స్‌’ దర్శకుడు వివేక్‌ అగ్నిహౌత్రి వంటి ప్రముఖులతోపాటు మాజీ సైనికాధికారుల ప్రశంసలు పొందిన ఈ చిత్రంలోని చైనా పేరును, గల్వాన్‌ వ్యాలీ పేరును తొలగించాలని సెన్సార్‌ బోర్డ్‌ చేసిన సూచనతో తాను విభేదిస్తున్నానని, ఈ విషయంలో తాను ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడబోనని శంకర్‌ నాయుడు అన్నారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుందని ఆయన తెలిపారు.
నీరోజ్‌ పుచ్చా, సోనమ్‌ టెండప్‌, సుభా రంజన్‌, హీరోలుగా, సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్‌ నాంగ్యాల్‌ హీరోయిన్లుగా నటించిన చిత్రమిది.భారత్‌ అమెరికన్‌ క్రియేషన్స్‌ పతాకంపై ప్రవాస భారతీయుడు డాక్టర్‌ శంకర్‌ నాయుడు అడుసుమిల్లి భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. రచయిత దీన్‌ రాజ్‌ (‘ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా’ ఫేమ్‌) ఈ దేశభక్తి చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు ఫైట్స్‌: జూడో రాము, ఎడిటర్‌: శివ సర్వాణి, సినిమాటోగ్రఫీ: జయపాల్‌ రెడ్డి నిమ్మల, మ్యూజిక్‌:సత్య కశ్యప్‌, కపిల్‌ కుమార్‌.

Spread the love