నల్లజాతి గర్భిణి కాల్చివేత

– అమెరికా పోలీసుల దురహంకారం
వాషింగ్టన్‌: నల్లజాతి వారిపై తెల్ల పోలీసుల దురహంకార చర్యలకు తాజాగా మరో వ్యక్తి బలయ్యారు. దొంగతనానికి పాల్పడ్డారని అనుమానించిన కేసులో గర్భవతి అయిన 21ఏళ్ల నల్లజాతి మహిళను ఓహియో పోలీసులు కాల్చి చంపారు. గత నెల 24న ఈ ఘటన జరిగింది. తకియా యంగ్‌గా బాధితురాలిని గుర్తించారు. కారులో నుండి బయటకు వచ్చేందుకు ఆ యువతి తిరస్కరించడంతో ఒక పోలీసు అధికారి ఆమెపై కాల్పులు జరిపినట్లు ఓహియో పోలీసులు విడుదల చేసిన వీడియోలో కనిపిస్తోంది. ఆమె చౌర్యానికి పాల్పడిందని ఆ పోలీసు అధికారి అనుమానించాడని, ఇంటరాగేషన్‌ కోసం కారు నుంచి ఆమెను బయటకు రావాల్సిందిగా కోరాడని కొన్ని మీడియా వార్తలు పేర్కొన్నాయి. నల్ల సీడాన్‌ కారులో కూర్చున్న ఆ యువతిని బయటకు రావాల్సిందిగా పోలీసు అధికారి పదే పదే పట్టుబట్టడం బ్లెండన్‌ టౌన్‌షిప్‌ పోలీసు విభాగం విడుదల చేసిన వీడియోలో కనిపిస్తోంది. ఆమె బయటకు రావడానికి తిరస్కరించింది. దాంతో వారిమధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ‘నువ్వు దొంగతనం చేశావు, ఇక్కడ నుంచి వెళ్లలేవు’ అని ఆ పోలీసు అధికారి పేర్కొనగా, నేను దొంగతనం చేయలేదంటూ ఆ యువతి తిరస్కరించింది. ఈలోగా పోలీసు అధికారుల్లో ఒకరు కారును ఆపి, తన తుపాకిని తీసి ఆమెను బయటకు రావాల్సిందిగా బెదిరించాడు. ఆ యువతి కారు స్టార్ట్‌ చేయడానికి ప్రయత్నించగానే వెంటనే ఆ అధికారి కాల్పులు జరిపాడు. ఆ వెంటనే కారు ముందుకు దూసుకెళ్లి కిరాణా దుకాణం గోడను కొట్టుకుని ఆగిపోయింది. నవంబరులో ఆమె బిడ్డకు జన్మనివ్వనుంది. అధికారాన్ని దుర్వినియోగం చేసి తకియాయంగ్‌ను చంపేశారంటూ ఆమె కుటుంబ సభ్యులు విమర్శించారు. మొత్తం వీడియోను చూస్తే పోలీసు అధికారుల మితిమీరిన వ్యవహార శైలి కనిపిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Spread the love