‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ వంటి విజయవంతమైన సినిమాల తర్వాత మోహనకష్ణ ఇంద్రగంటి, శివలెంక కష్ణప్రసాద్ కలయికలో రూపొం దుతున్న చిత్రం ‘సారంగ పాణి జాతకం’. ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటించారు. సోమవారంతో ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది.
నిర్మాత శివలెంక కష్ణప్రసాద్ మాట్లాడుతూ, ‘మనిషి భవిష్యత్తు అతని చేతి రేఖల్లో ఉంటుందా? లేదా అతను చేసే చేతల్లో ఉంటుందా? అనే ప్రశ్నకు జవాబు ఇచ్చే ఓ పరిపూర్ణ హాస్యరస చిత్రమిది. హైదరాబాద్, రామోజీ ఫిల్మ్ సిటీ, విశాఖ పరిసర ప్రాంతాల్లో 5 షెడ్యూళ్లలో సినిమాని పూర్తి చేశాం. ఈ నెల 12 నుంచి డబ్బింగ్ ప్రారంభిస్తాం. మా సంస్థలో జంధ్యాలతో పూర్తి స్థాయి హాస్య చిత్రం తీయాలనుకున్నాను. అది సాధ్యపడలేదు. అయితే ఆయన మా సంస్థలో తెరకెక్కిన ‘చిన్నోడు పెద్దోడు’, ‘ఆదిత్య 369′ చిత్రాలకు మాటలు రాశారు. ఆయనతో సినిమా చేయలేని లోటును ఇంద్రగంటి మోహనకృష్ణ తీర్చారు.
మా సంస్థలో రెండు విజయవంతమైన సినిమాలు తీసిన మోహనకష్ణ ఇంద్రగంటితో పూర్తిస్థాయి వినోదాత్మక సినిమా చేయడం ఆనందంగా ఉంది. మా సంస్థలో గుర్తుండిపోయే సినిమా అవుతుంది’ అని అన్నారు.