మునిలా మౌనమెందుకు నేస్తం, ఏదైనా మాట్లాడు అని మన మిత్రులను పలకరిస్తుంటాము. కొందరు చాలా మౌనంగానే ఉంటారు. మితభాషులుగా కనిపిస్తారు. కానీ లోపల ఎన్నెన్నో ఆలోచనలు తిరుగుతుంటాయి. మౌనం అనే మాట నేడు దేశంలో ఆవేశాన్ని తెప్పిస్తోంది. ఎందుకంటే మౌనం అనేది మునులకు, యోగులకు, తాపసులకు మాత్రమే అవసరమైనది. పాటించేది. గుడిలో అర్చకులు, బడిలో గురువులు, రైల్వేస్టేషన్‌లో ఎనౌన్సర్‌లు, శాసనసభలో ప్రజా ప్రతినిధులు, చట్టసభలలో నాయకులు మౌనంగా ఉంటామంటే కుదరదు. అంతే కాదు, ఆ ఉద్యోగాలకు అనర్హులవుతారు కూడా. మాట్లాడకుండా మౌనంగా ఉంటే, మేము జ్ఞానులమని అనుకుంటే కుదరనే కుదరదు. సూర్యుడు ఉదయించడం, కోడి పొద్దుటే కూత పెట్టటం, కుక్కలు మొరగటం సహజమైన ప్రకృతి నియమాలు అవి అలా జరగటం లేదంటే వికృతి ఏదో జరుగుతున్నట్లు. నియమమేదో తప్పినట్లు. నీటిని నిలువునా పాతేసినట్లుగా భావించాలి. అదే రకమైన నియమ రహిత, నీతి రహిత, ధర్మ రహిత ఆచరణను మనదేశనాయకుడిలో ‘మౌనం’ పేర చూస్తున్నాము. గత మూడు నెలలుగా దేశంలోని ఒక రాష్ట్రం కాలిపోతోంటే, మానవ హననం జరుగుతోంటే, పాలకుడు, రక్షకుడు మౌనం వహించడమా! ఇది మునుల మౌనానికే అవమానకరమైనది. పాలకుడుగా అనర్హుడవ్వాలి కదా!
మౌనం గురించి ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే మంచి సాధనగానే వివరిస్తారు. మౌనం అంటే ఐహికమైన ఏ విషయాన్నీ పట్టించుకోకూడదు. అదుపు తప్పి మాట్లాడటం, అతిగా మాట్లాడటం తగ్గించుకోవటానికి మౌనం సాధన చేస్తుంటారు. మౌనంగా ఉండటమంటే లౌకిక ప్రపంచంలో కొంపలు అంటుకుపోతున్నా బెల్లం కొట్టిన రాయిలా మాట్లాడకుండా దేనికీ సమాధానం చెప్పకుండా ఉండటం కాదనీ శాస్త్రాలు వివరిస్తున్నాయి. తపస్సు చేసే ముని మౌనం పాటిస్తేనే ధ్యానం చేయగలడు. రాజ్యాన్ని పాలించేవాడు మాట్లాడకపోతే అధికారాన్ని కోల్పోతాడు. మౌనం వహిస్తున్న నేత ఎప్పటికీ మౌనాన్ని పాటిస్తున్నాడా! అంటే అదీ కాదు. తన గొప్పలు చెప్పుకోవడానికి అనర్ఘళంగా మాట్లాడుతూ తప్పులను కప్పిపుచ్చుకోవడమెలాగో తెలియక మౌనం వహించడాన్ని జ్ఞానుల మౌనంగా భావించలేము కదా! ఏమి చెప్పాలో తెలియనివారు, సహేతుక సమాధానాలు చెప్పలేనివారు మాత్రమే మౌనంగా ఉంటారు. నేరస్థుడు మౌనం వహిస్తే, నేరం అంగీకరించిన భావమే వస్తుంది. మౌనం సమస్యను సంక్లిష్టపరుస్తుంది. ఏడుస్తున్న పసివాన్ని చూసి మౌనంగా ఉండగలమా! కళ్ళెదుట రక్తం చిందుతుంటే గొంతు మూగపోతుందా! ఇవి ముని మౌనాలు కాదు. వ్యూహాత్మక మౌనాలు. కపట మౌనాలు. నేరపూరిత మౌనాలు!
మౌనంగానే ఉంటే ఈ వానరం నరునిగా మారదు. మాట మనిషి లక్షణం. మాట్లాడుకోవడం నాగరిక మానవులకు అవసరం. సకల జీవరాశులలో మనిషికే దక్కిన వరం మాట్లాడటం. మాటల కలబోతలోంచి మహాజ్ఞానం పుట్టుకు వచ్చింది. అలాంటి మాటకు దూరంగా ఉండి, మౌనంగా ఉండి సాధించేది ఏమీ ఉండదు. అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నప్పుడు గొంతెత్తక పోవడం నేరంగానే భావించాల్సి వస్తుంది. ఆనాడు కౌరవ సభలో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంటే ధృతరాష్టుడుతో సహా భీష్మ ద్రోణాది మహామహులందరూ ఒక్కమాట మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. అందుకనే కురుక్షేత్ర యుద్ధం జరిగి కౌరవుల అన్యాయం నశించింది. రావణుడు అక్రమంగా సీతను మాయావేషంతో అపహరించుకుపోతుంటే వనంలోని ఏ మునీ వారించలేకపోయారు. అందుకే రామ రావణయుద్ధం జరిగి చెడును ఓడించటం జరిగింది. పురాణాల్లో, యితిహాసాల్లోనయినా అన్యాయాలు చేసినప్పుడు యుద్ధాలే జరిగాయి. న్యాయం, ధర్మం గెలిచింది. ఇప్పుడు కూడా మణిపూర్‌లో ఆదివాసీలను వివస్థ్రలను చేసి, అత్యాచారాలు, హత్యలు యధేచ్ఛగా కొనసాగుతుంటే పరిపాలకుడయినవాడు మౌనం వహించడం ఎంత దుర్మార్గం! ఎంతటి అమానుషం! ”మౌనం గొప్పది కాదు! మౌనం సమస్యలకు భాష్యం కాదు, మౌన వాఖ్య ప్రకటితం, అప్రకటిత హింసనాపదు. కళ్లముందే కీచకులు చెలరేగితే, ఆశలన్నీ అగ్నికి ఆహుతువుతుంటే మరణ మృదంగాన్ని హింస వినిపిస్తుంటే, నిప్పులు ప్రవహించాల్సిన దేహంలో, నీరు పుడుతోందా? ఈ మౌనం గతి మార్చే ధ్యానం కాదు” అన్యాయాలను చేయిస్తున్న ఘోరం! అంటాడు కవి.
మౌనం పాటించిన ‘మన్ కీ బాతీయుడు’ ఎట్టకేలకు మౌనం వీడాడు. దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగిన చందాన మనవాడు మౌనం వీడాడు. కేవలం మాట్లాడించడానికి మహాపోరాటం చేయాల్సి వచ్చింది. అంతా చేస్తే ఏం మాట్లాడిండు. రక్తం చిందిన ఘటనకు కన్నీరు రాలేదు. అనాగరిక దుర్మార్గంపై కండ్లూ ఎర్రబడలేదు. అధికార దర్పమూ, వ్యంగ్యపు చలోక్తులు, అహంకారోక్తులు! ప్రజలు గమనిస్తున్నారు. మౌనం వహించేవారి వ్యూహాలనూ పసికడుతున్నారు. ఈ ద్వేషపూరిత మౌనాలపై గొంతులెత్తాల్సిన సమయమిది!