బీహార్‌ గాన కోకిల

The singing cuckoo of Biharశారదా సిన్హా… ఉత్తర భారత సంగీత ప్రియుల గుండెల్లో గూడు కట్టుకున్న గాయిని. జానపదాలు ఆమె గొంతులో నాట్యమాడతాయి. ఛత్‌ పూజ పాటలకు ఆమె పెట్టింది పేరు. పలు బాలివుడ్‌ గీతాలకూ తన గాత్రాన్ని అందించి వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఎన్నో అద్భుతమైన పాటలతో భారతీయ సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. జానపద గాయినిగా, బీహార్‌ గాన కోకిలగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఇటీవల క్యాన్సర్‌తో కన్నుమూశారు. అటువంటి గొప్ప గాయని సంగీత ప్రయాణం మీకోసం…
శారదా బీహార్‌లోని సుపాల్‌ జిల్లాలోని రఘోపూర్‌ అనే మారుమూల గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులకు కలిగిన తొమ్మిది మంది సంతానంలో ఈమె ఒక్కతే ఆడపిల్ల. దాంతో తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. శారదకు చిన్నతనం నుండి సంగీతమంటే ఎంతో ఆసక్తి. ఆమె ఇష్టాన్ని గమనించిన ఇంట్లో వాళ్లు ఆ వైపుగా ఆమెను ప్రోత్సహించారు. తల్లిదండ్రుల సహకారంతో మగధ్‌ మహిళా కళాశాల, ప్రయాగ్‌ సంగీత్‌ సమితి నుంచి సంగీత పాఠాలు నేరుకున్నారు. తర్వాత లలిత్‌ నారాయణ్‌ మిథిలా యూనివర్సిటీ నుంచి సంగీతంలో పీహెచ్‌డీ చేశారు.
పెండ్లి తర్వాత
శారదకు చిన్న వయసులోనే పెండ్లి చేశారు. అయినా సంగీతంలో పై చదువులు చదవడానికి, ఆ రంగంలో నైపుణ్యాలు నేర్చుకోవడానికి భర్త ఆమెకు ఎంతో చేదోడుగా నిలిచారు. బిహార్‌లోని సిహామా అనే గ్రామానికి చెందిన బ్రజ్కిశోర్‌ సిన్హాను 1970లో ఆమె వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. శారదా గాయినిగా ఎదగడానికి భర్త ప్రోత్సహించినా అత్తగారు మాత్రం మొదట్లో ససేమిరా అన్నారు. అస్సలు అంగీకరించలేదు. పెండ్లి తర్వాత ఆడపిల్లలు ఇలా బయటకు వెళ్ళి పాటలు పాడటం ఏంటని ఆమె బలమైన అభిప్రాయం. అయితే బ్రజ్జిశోర్‌ తన తల్లిని ఒప్పించి భార్య కెరీర్‌కు ఎలాంటి ఆటంకాలు లేకుండా చేశారు. అలా భర్త అడుగడుగున్నా ప్రోత్సహించడం వల్లనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని ఆమె అనేక ఇంటర్వ్యూల్లో పంచుకున్నారు.
బాలివుడ్‌లో తనదైన ముద్ర
బీహార్‌, ఝార్ఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా జరుపుకునే ఛత్‌ పూజ పండగ నేపథ్యంలో శారద ఎన్నో పాటలు పాడారు. అలాగే భక్తి గీతాలు, భజన పాటలు ఆలపించేవారు. భోజ్‌పురి, మైథిలీ భాషల్లోనూ వందలాది జానపద గీతాల్ని పాడారు ఆమె. కొన్ని బాలీవుడ్‌ పాటలు సైతం పాడారు. బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘మైనే ప్యార్‌ కియా’ సినిమాలోని ‘కహే తో సే సజ్నా’ అనే పాట పాడారు. ఇది హిట్‌గా నిలిచింది. తర్వాత ‘హమ్‌ ఆప్కే హై కౌన్‌, గ్యాంగ్స్‌ ఆఫ్‌ వాసేపూర్‌ అనే సినిమాల్లోనూ పాటలు పాడారు. బాలీవుడ్‌లో తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే మహరాణి వెబ్‌సీరిస్‌ కోసం ఆమె పాడిన నిర్మోహియా అనే పాట ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఈ సీరిస్‌ ప్రేక్షకుల్లో ఆదరణ పొందడానికి ఈ పాటే కారణం అనడంలో అతిశయోక్తిలేదు.
క్యాన్సర్‌తో కన్నుమూశారు
2017 నుంచి ఒక రకమైన బ్లడ్‌ క్యాన్సర్తో బాధపడిన ఆమె ఆరోగ్యం ఇటీవలే క్షీణించింది. ఇక ఈ ఏడాది సెప్టెంబర్‌లో భర్తను కోల్పోయిన శారద ఆపై కోలుకోలేకపోయారు. దీంతో గత కొన్ని రోజులు ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందారు. కానీ పరిస్థితి విషమించడంతో నవంబర్‌ 5వ తేదీన తుది శ్వాస విడిచారు. భారతీయ సినీ సంగీత ప్రియుల్ని శోకసంద్రంలో ముంచి కన్నుమూశారు. ఆమె మృతికి పలువురు ప్రముఖులు, అభిమానులు ఎందరో సంతాపం తెలుపుతూ ట్విట్లు చేశారు.
పురస్కారాలు…
భక్తి గీతాలు, భజనలు, జానపదాలు, మెలొడీస్‌, రొమాంటిక్‌.. ఇలా విభిన్న సంగీత పాటలు పాడుతూ భారతీయ సినీ సంగీత ప్రియుల్ని ఓలలాడించారు శారద. బిహార్‌ గానకోకిలగా గుర్తింపు తెచ్చుకున్నారు. వాయిస్‌ ఆఫ్‌ ఛత్‌ పూజ అన్న బిరుదు కూడా అందుకున్నారు. సంగీత రంగంలో తాను చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆమెకు 1991లో పద్మశ్రీ, 2018లో పద్మ భూషణ్‌ పురస్కారాలతో ఆమెను గౌరవించింది. 2000లో సంగీత నాటక అకాడమీ పురస్కారం కూడా అందుకున్నారు.

Spread the love