కనుచూపు మేరలో కానని పరిష్కారం

The solution is not in sight– గాజాలో 15మాసాల దాడుల్లో 46వేలమంది పాలస్తీనియన్లు మృతి
– లక్ష దాటిన క్షతగాత్రులు
గాజా: గాజాపై ఇజ్రాయిల్‌ దాడులు చేస్తూ ఇప్పటికి 15 మాసాలు ముగిసింది. 16వ నెల్లోకి అడుగు పెట్టినా ఇంకా ఎక్కడా ఈ దాడులకు ముగింపు అనేది కనిపించడం లేదు. ఈ దాడుల్లో ఇప్పటివరకు 46,006 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. గాయపడిన వారి సంఖ్య 1,09,378కి చేరింది. మృతి చెందిన వారిలో సగానికి పైగా మహిళలు, పిల్లలే వున్నారు. కాగా హమాస్‌ వద్ద ఇంకా వంద మంది వరకు బందీలు వున్నట్లు తెలుస్తోంది. సుదీర్ఘకాలంగా విచక్షణారహితంగా కొనసాగుతున్న దాడుల్లో గాజాలో మెజారిటీ ప్రాంతాలు భూస్థాపితమయ్యాయి. 23లక్షల మంది ప్రజల్లో దాదాపు 90శాతం మంది నిర్వాసితులయ్యారు. వీరిలో చాలామంది పదే పదే దాడులకు గురవుతూ పలు ప్రాంతాలకు వలసలు వెళ్ళాల్సి వస్తోంది. వందలు వేల సంఖ్యలో ప్రజలు తాత్కాలిక శిబిరాల్లో తల దాచుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పైగా ఆహారం, ఇతర నిత్యావసరాలు కూడా వారికి సరిగా అందని పరిస్థితి నెలకొంది. ఇదిలావుండగా కాల్పుల విరమణకు, బందీల విడుదలకు జరుగుతున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రానున్నట్లు కనిపిస్తోంది. అమెరికా, కతార్‌, ఈజిప్ట్‌ల మధ్యవర్తిత్వంతో జరుగుతున్న చర్చలు గత ఏడాది కాలంలో అనేక కారణాలతో పదే పదే స్తంభిస్తూ వచ్చాయి.
గత 24గంటల్లో గాజాలో 70మంది పాలస్తీనియన్లు మరణించగా, 104మంది గాయపడ్డారు. ఈ యుద్ధాన్ని ఇక ముగించాలంటూ 800మందిక పైగా ఇజ్రాయిలీ సైనికుల తల్లిదండ్రులు ప్రధాని నెతన్యాహును డిమాండ్‌ చేశారు. గాజా తమ పిల్లల సమాధిగా మారకూడదని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. కాగా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ కాల్పుల విరమణ, బందీల విడుదల పట్ల ఆశాభావం వ్యక్తం చేశారు. హమాస్‌ చెరలో వున్న బందీ యూసుఫ్‌ జియాద్నె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయిల్‌ మిలటరీ తెలిపింది. 15మాసాలుగా కొనసాగుతున్న దాడుల తర్వాత పరిస్థితులు అత్యంత భయంకరంగా వున్నాయని గాజా డాక్టర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన వారికి చికిత్సనందించడం దుర్లభమవుతోందని అన్నారు.

Spread the love