నాలుగు రోజుల తర్వాత కలిసిన కొడుకు…

– భావోద్వేగంలో తల్లిదండ్రులు
భువనేశ్వర్‌ : ఒడిశా బాలాసోర్‌లో జూన్‌ 2వ తేదీన జరిగిన రైలు ప్రమాదం ఎంతోమంది ప్రయాణీకుల కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. అయితే వందల కుటుంబాల్లో విషాదాన్ని నింపిన ఈ ప్రమాదం… ఓ నేపాల్‌ తల్లిదండ్రులకు సంతోషాన్ని మిగిల్చింది. తమ కుమారుడు మృతి చెందాడేమోనని ఆవేదనకు గురైన ఆ తల్లిదండ్రులకు.. ప్రమాదం జరిగిన నాలుగు రోజుల తర్వాత తమ కుమారుడు తిరిగి ఆరోగ్యంగా తమ చెంతకు చేరాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. నేపాల్‌కి చెందిన రామానంద్‌ పాశ్వాన్‌ (15) అనే టీనేజ్‌ అబ్బాయి తన బంధువులు ముగ్గురితో కలిసి కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నాడు. జూన్‌2న జరిగిన ఘోర రైలు ప్రమాదంలో రామానంద్‌ తీవ్రంగా గాయలపాలై స్పహ కోల్పోయాడు. తనతోపాట ప్రయాణిస్తున్న ముగ్గురు బంధువులు ఈ ప్రమాదంలో మతి చెందారు. ఇక ఈ ఘోర రైలు ప్రమాదం గురించి తెలుసుకున్న రామానంద్‌ తల్లిదండ్రులు ఒడిశాకు చేరుకున్నారు. ఈ ప్రమాదంలో కుమారుడితో ప్రయాణించిన తమ బంధువులు మృతదేహాలను రామానంద్‌ తండ్రి హరి పాశ్వాన్‌ గుర్తించాడు. అయితే తమ కుమారుడు బతికే ఉన్నాడని తెలుసుకున్న కుమారుడి తల్లిదండ్రులు సంతోషపడ్డారు. అయితే తన కుమారుడు ఎక్కడున్నాడో తెలియక ఆ తల్లిదండ్రులు ఆవేదనకు గురయ్యారు. తమ కుమారుని ఆచూకీ కోసం.. స్థానిక మీడియా ఛానెల్‌కు ఓ ప్రకటన ఇచ్చారు. దీంతో రామానంద్‌ స్పృహలోకొచ్చిన తర్వాత టీవీలో తన తల్లిదండ్రుల్ని చూసి వారిని గుర్తించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా, ‘నేపాల్‌కు చెందిన 15 ఏళ్ల రామానంద్‌ పాశ్వాన్‌ తన తల్లిదండ్రులకు తిరిగి కలుసుకోవడం మాకొక భావోద్వేగ క్షణం. అతను నిజంగా నేపాల్‌కి చెందినవాడే. అతను చెప్పిన సమాచారం సరైనదే. దీంతో మా హెల్ప్‌ డెస్క్‌ రామానంద్‌ తల్లిదండ్రులను సంప్రదించి రామానంద్‌ని వారి వద్దకు చేర్చింది’ అని ఎస్‌సిబి మెడికల్‌ కాలేజీ ట్వీట్‌ చేసింది. ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. రైలు ప్రమాదంలో విడిపోయిన నూతన జంటను ఎస్‌సిబి మెడికల్‌ కాలేజీ ఒకచోటకు చేర్చినట్లు ఆసుపత్రివర్గాలు వెల్లడించాయి.

Spread the love