ఆస్తి కొనుగోలు కేసులో మాజీ శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సా కుమారుడు అరెస్టు

నవతెంగాణ – కొలంబో : ఆస్తి కొనుగోలు కేసులో అవినీతి ఆరోపణలపై మాజీ శ్రీలంక అధ్యక్షుడు మహిందా రాజపక్సా కుమారుడు యోషితా రాజపక్సాను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. 2015కి ముందు తన తండ్రి మహిందా రాజపక్సా అధ్యక్షునిగా ఉన్న సమయంలో యోషితా రాజపక్సా ఆస్తుల కొనుగోలు విషయంలో అక్రమంగా ప్రవర్తించారనే ఆరోపణలపై నేడు ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. బెలియట్టాలో తన నివాసంలో ఉన్న మాజీ నేవీ అధికారి యోషిత రాజపక్సాని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, మహిందా రాజపక్సా ముగ్గురు కుమారుల్లో రెండవ కుమారుడు యోషిత రాజపక్సా. కటరామగామలోని హాలిడే హోమ్‌లో మహిందా రాజపక్సా సోదరుడు గొటబాయ రాజపక్సాని కూడా ఇదే కేసులో పోలీసులు గతవారం విచారించారు. గత నెలలో దిసనాయకె ప్రభుత్వం తన భద్రతను తగ్గించిందని, గతంలో మాదిరిగా భద్రతను పునరుద్ధరించడానికి జోక్యం చేసుకోవాలని కోరుతూ మహింద రాజపక్సే శుక్రవారం (జనవరి 24) సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో మహిందా కుమారుడు యోషితను పోలీసులు అరెస్టు చేశారు. శ్రీలంకలో అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకె నేతృత్వంలో గత ఏడాది నవంబర్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మాజీ అధ్యక్ష కుటుంబాన్ని అక్రమ ఆస్తుల కేసులో పోలీసులు విచారిస్తూనే ఉన్నారు. గతంలో మరొక ఆస్తి కేసులో మహింద రాజపక్సే పెద్ద కుమారుడు నమల్‌ రాజక్సాను, మహింద రాజపక్సే ఉద్యోగిని పోలీసులు విచారించారు.

Spread the love