రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలా రాష్ట్ర సర్కార్‌

– 111జీవో రద్దు హైదరాబాద్‌కు ముప్పు: కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలా మారిందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. 30 వేల ఎకరాలను అమ్మటానికి కేసీఆర్‌ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణకు కేంద్రం చేసిన సాయంపై చర్చకు సిద్ధమా? అని సీఎం కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు. పొద్దునలేస్తే కేంద్రాన్ని విమర్శించే అలవాటు మానుకోవాలని హితవు పలికారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. దళిత సీఎం, మూడెకరాల భూమి, డబుల్‌ బెడ్రూం ఇండ్లు, ఇలా వందల హామీలను కేసీఆర్‌ విస్మరించారని విమర్శించారు. దళితున్ని సీఎం చేయనందుకు కేసీఆర్‌ మెడ నరుక్కోవాలన్నారు. రానున్న ఎన్నికల్లో దేశవ్యాప్తంగా డబ్బులు పంచడం కోసమే 111 జీవో రద్దు చేశారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ నేతలకు 111 జోవో పరిధిలో వందలాది ఎకరాలున్నాయన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు కలసి మాట్లాడుకుని కార్యాలయాలకు భూములు తీసుకున్నారని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబానికి భూ దాహం, అప్పుల దాహం తీరటం లేదని విమర్శించారు.
నిటిఅయోగ్‌ సమావేశానికి సీఎం కేసీఆర్‌ హాజరుకావపోవటం తెలంగాణకు తీవ్ర నష్టం అన్నారు. 111 జీవో రద్దుతో ఎప్పటికైనా హైదారాబాద్‌కు ముప్పు తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర అప్పులపై కేసీఆర్‌ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 135 ఏండ్ల చరిత్ర కలిగిన వరంగల్‌ జైలు భూములు తాకట్టు పెట్టారని వార్తలొస్తున్నాయనీ, నీ తెలంగాణ.. నా తెలంగాణ కాదు.. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమని కేసీఆర్‌ గుర్తుంచుకోవాలని అన్నారు. ఇంట్లో కూర్చుంటే గుణాత్మకమైన మార్పు ఎలా వస్తుందని ప్రశ్నించారు. కేంద్రాన్ని, ప్రధానిని ఆడిపోసుకోవటం తప్ప కేసీఆర్‌ చేసిందేమీ లేదని విమర్శించారు. మహారాష్ట్రలో తలకమాసిన వాళ్లు మాత్రమే బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారనీ, వారి వల్ల ఒరిగేదేమీ ఉండదని చెప్పారు. రైతులకు తెలంగాణ ప్రభుత్వం 50 వేల కోట్లు బకాయిలు చెల్లించాలనీ, కేసీఆర్‌ హాయాంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని విమర్శించారు.

Spread the love