– మహారాష్ట్రలో ఎడతెరిపి లేని వర్షంతో
– 35 అడుగుల స్టాచ్యూ నేలమట్టం
– నాణ్యతా లోపమే కారణం : ప్రతిపక్షాల మండిపాటు
ముంబయి : మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ 35 అడుగుల విగ్రహం కుప్పకూలింది. రెండు రోజులుగా మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు నాణ్యతాలోపం వల్లే కూలినట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మహారాష్ట్ర రాష్ట్రంలోని సింధు దుర్గ్ జిల్లా రాజ్‌కోట్ కోటలో గతేడాది నేవీ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ 35 అడుగుల శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే.. రాష్ట్రంలో గత రెండూ మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతోపాటు ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలోనే భారీ విగ్రహం కుప్పకూలింది. దీంతో పోలీసు సిబ్బంది, జిల్లా అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మరోపక్క ఈ ఘటనకు సరైన కారణాలు తెలుసుకునేందుకు నిపుణుల బందం రంగంలోకి దిగింది.
నాణ్యతా లోపం వల్లే : ప్రతిపక్షాలు
శివాజీ విగ్రహం కుప్పకూలిన ఘటనపై ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. నాణ్యతా లోపం వల్లే కూలిపోయిందంటూ ఆరోపించాయి. ”రాష్ట్ర ప్రభుత్వం విగ్రహావిష్కరణ కార్యక్రమంపై తప్ప.. నాణ్యతపై దష్టి పెట్టలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈ నష్టం వాటిల్లింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త టెండర్లు వేసి.. దాని ప్రకారం కమీషన్లు ఇస్తోంది” అని ఎన్సీపీ (ఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి జయంత్ పాటిల్ ఆరోపించారు. మరోవైపు ఈ ఘటనపై శివసేన (యూబీటీ) కూడా స్పందించింది. ప్రభుత్వం దీనికి బాధ్యత తీసుకోకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించింది. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేసింది. దీనిపై మహారాష్ట్ర మంత్రి దీపక్ కేసర్కర్ స్పందించారు.