– చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించిన అబిడ్స్ పోలీసులు
– పదేండ్ల లోపు అమ్మాయిలే అతని టార్గెట్
– రంగారెడ్డి జిల్లా ఇముల్ నర్వలో నిందితుడి అరెస్టు : సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
హైదరాబాద్‌లోని అబిడ్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం కలకలం రేపిన చిన్నారి కిడ్నాప్ కేసును స్థానిక పోలీసులు చేధించారు. కిడ్నాప్‌కు గురైన బాలిక రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇమ్ముల్ గ్రామంలో ప్రత్యక్షమైంది. కిడ్నాపర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని అబిడ్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన వివరాలను ఆదివారం సెంట్రల్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ మీడియాకు వెల్లడించారు. బేగంబజార్ ఛత్రి ప్రాంతానికి చెందిన ప్రియాంక అనే మహిళ తన సోదరుని కుమార్తె ప్రగతి(6) తో కలిసి శనివారం సాయంత్రం తన తల్లి ఉంటున్న గాంధీభవన్ దగ్గరలోని కట్టెల మండికి వచ్చింది. చిన్నారి బాలిక, ప్రియాంక సోదరి కుమారుడు వృతిక్‌తో(4)తో కలిసి ఇంటి సమీపంలోని ముత్యాలమ్మ ఆలయం వద్ద అడుకోడానికి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత హృతిక్ ఒక్కడే ఇంటికి వచ్చాడు. ప్రగతి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినా బాలిక కనిపించలేదు. దాంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు.. అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు.. బాలిక ఆడుకున్న ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అందులో బాలిక కిడ్నాప్‌కు గురైన దృశ్యాలు రికార్డయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులు 6 బృందాలుగా ఏర్పడి.. బాలిక కోసం గాలింపుచర్యలు చేపట్టారు.
బీహార్‌కు చెందిన మహమ్మద్ బిలాల్ అన్సారి(32) రోజు కూలీగా పనిచేస్తున్నారు. కాగా, అగంతకుడు చాక్‌లేట్ ఇస్తామని చెప్పి.. బాలికను ఆటోలో ఎక్కించుకొని అఫ్జల్‌గంజ్ వరకు వెళ్లాడు. అక్కడ నుంచి ఆర్టీసి బస్సులో జేపీ దర్గా, అక్కడి నుంచి కొత్తూరు మండలం ఇమ్ముల్ నారా గ్రామానికి తీసుకెళ్లాడు. అనంతరం బాలిక తండ్రికి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. కాగా, అక్కడ వారిని చూసిన స్థానిక యువకుడు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు. అప్రమత్తమైన ఆబిడ్స్ పోలీసులు.. కొత్తూరు పోలీసుల సహకారంతో ఆదివారం ఉదయం నిందితుడిని అరెస్టు చేసి, అబిడ్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం బాలికను వైద్య పరీక్షల నిమిత్తం భరోసా సెంటర్‌కు పంపించారు. కాగా, నిందితునిపై మరో 3 కిడ్నాప్ కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. గత నెల 17వ తేదీన కొత్తూరులో ఓ బాలికను కిడ్నాప్ చేసి తప్పించుకొని తిరుగుతున్నట్టు పోలీసులు తెలిపారు. కేసును చేధించిన అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్, ఇన్‌స్పెక్టర్ రాజగోపాల్ రెడ్డి, డీఐ నరసింహ, ఏడుకొండలు, ఎస్‌ఐలు గౌరేందర్, సుధాకర్, సుమన్‌ను సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్‌ను డీసీపీ అభినందించారు.