పోరాట‌ల‌తోనే స‌బ్ ప్లాన్‌ చట్టం

అమలులో ప్రభుత్వం వైఫల్యం– చట్టాలను, పథకాలను నిర్వీర్యానికి ప్రయత్నం
– అమలులో ప్రభుత్వం వైఫల్యం

– నిరంతరం పోరాడుతున్న కేవీపీఎస్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర జనాభాలో 15.45 శాతం ఎస్సీలున్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వీరు అట్టడుగున ఉన్నారు. వీరి అభివృద్ధి కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో నాలుగు శాతం నిధులను మాత్రమే కేటాయించేది. ఆ నిధులను కూడా దళితుల అభ్యున్నతికి ఖర్చు పెట్టేది కాదు. దీంతో వారి అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉండేది. ఈ నేపథ్యంలో సీపీఐ(ఎం), కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంతో పాటు మేధావులు, ఇతర 102 సంఘాలు ఐక్య వేదికగా ఏర్పడి సబ్‌ప్లాన్‌ చట్టం కోసం నిర్విరామ పోరాటాలు చేశాయి. బీవీ రాఘవులు, జాన్‌వెస్లీ తదితరులు నిరవధిక దీక్షలకు పూనుకున్నారు. పోరాటాల ఉధృతికి తలవంచిన ప్రభుత్వం..సబ్‌ప్లాన్‌ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం ద్వారా బడ్జెట్‌లో షెడ్యూల్‌ కులాలకు ప్రత్యేక నిధులు కేటాయించి వారి అభివృద్ధి కోసం ఖర్చు చేసే వ్యవస్థ ఉమ్మడి రాష్ట్రంలోనే ఏర్పాటయింది.ఎస్సీ అభివృద్ధి నిధికి కేటాయించిన నిదులు సుమారు 54 శాఖల ద్వారా ఖర్చు చేసే యంత్రాంగం ఉండేది. ఈ ఏడాది ఖర్చు చేయని నిధులను మరుసటి సంవత్సరం ఖర్చు చేసే విధంగా క్యారీ ఫారవడ్‌ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా నాడు ప్రభుత్వం ప్రకటించింది. పోరాటం ఫలితంగా సాధించిన గొప్ప విజయమిది. అయితే కేసీఆర్‌ ప్రభుత్వం దళితుల అభివృద్ధి గురించి గొప్పలకు పోతున్నది. వారికోసం కేటాయించిన నిధులను మాత్రం ఖర్చు చేయకుండా చట్ట విరుద్దంగా దారి మళ్లిస్తున్నది.
2014నుంచి 2022-23 (సెప్టెంబర్‌ 30 వరకు) మధ్యకాలంలో ఎస్సీల అభివృద్ధి నిధి కింద రూ. 1,41,160.37 కోట్లు కేటాయి ంచగా రూ.77,978.27కోట్లు అంటే 55శాతం మాత్రమే ఖర్చు చేసింది. సుమారు రూ.63,182.10 కోట్లు దారి మళ్లాయి.
పెరుగుతున్న దాడులు..
గత తొమ్మిదేండ్ల కాలంలో రాష్ట్రంలో దళితులపై దాడులు దౌర్జన్యాలు పెరిగాయి. 86 కుల దురహంకార హత్యలు జరిగాయంటే పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంబోజ్‌ నరేశ్‌, పెరుమాండ్ల ప్రణరు, మంథని మధుకర్‌ ఇలా అనేక మంది కుల దరహంకారంతో అతి ధారుణంగా హత్యగావించబడ్డారు. ఈ హత్యలకు వ్యతిరేకంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నికరంగా పోరాడింది. ఐక్య పోరాటాల్లో ముందు పిఠీన నిలబడింది. పోరాటాల ఫలితంగానే దోషులపై చట్టబద్ద చర్యలు తీసుకున్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ దోషులను కాపాడేందుకు ప్రయత్నించాయి.
వీడీసీల పేరుతో నిజామాబాద్‌ జిల్లాలో దళితులను గ్రామ బహిష్కరణకు గురిచేస్తే దానికి వ్యతిరేకంగా కేవీపీఎస్‌ పోరాటాలు నిర్వహించింది. సంబంధిత వ్యక్తులపై చట్టబద్ద చర్యలు తీసుకునేలా వత్తిడి చేసింది.
మూలకు పడ్డ మూడెకరాల భూమి..
కేవీపీఎస్‌, వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తంగావ నిర్వహించిన పోరాటాల ఫలితంగా భూమి లేని ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి నినాదాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల ప్రణాళికలో చేర్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 6,242 కుటుంబాలకు 15,571 ఎకరాలు పంపిణీచేసి సర్కార్‌ చేతులెత్తేసింది.
దళితబంధులో అవినీతి..
దళిత బంధుపథకం ఎమ్మెల్యేలకు వరంలా మారింది. దీంతో లబ్దిదారులు తీవ్రంగా నష్ట పోతున్నారు. ఈ విషయమై 282 మండలాల్లో ధర్నాలు, ఆందోళనలు జరిగాయి. దీంతో అవినీతిని అరికట్టేందుకు ఆన్‌లైన్‌ విధానంలోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించినప్పటికీ రాజకీయ జోక్యం తొలగిపోలేదు .దీనిపై కేవీపీఎస్‌ నికరంగా పోరాడుతుంది.

Spread the love