రోళ్లు పగిలేలా ఎండలు

The sun is bursting– మంచిర్యాల జిల్లా భీమారంలో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత
– ఈ ఏడాది ఇదే అత్యధికం
– 6 జిల్లాల్లో 46 డిగ్రీలకు, 14 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైనే నమోదు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
భానుడు భగభగ మండిపోతున్నాడు. రోహిణి కార్తెలో ఎండలు రోళ్లు పగిలేలా కొడతాయనే నానుడిని నిజం చేస్తున్నాడు. రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 47 డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లా భీమారంలో అత్యధికంగా 47.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. ఈ ఏడాది ఇదే అత్యధికం. రాష్ట్రంలో 14 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, కొమ్రంభీమ్‌, ఖమ్మం జిల్లాల్లో పలుచోట్ల 46 డిగ్రీలకుపైనే టెంపరేచర్‌ ఉంది. నల్లగొండ, ములుగు, కరీంనగర్‌, జగిత్యాల, సూర్యాపేట, యాద్రాద్రి
భువనగిరి, జయశంకర్‌ భూపాలపల్లి, ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఎండ కొట్టింది. ఈ మేరకు ఆయా జిల్లాలు రెడ్‌ అలర్ట్‌ జాబితాలో చేరాయి. పలుచోట్ల వడగాల్పులు కూడా వీచాయి. ఉక్కపోత తీవ్రంగా ఉంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లోనూ పలుచోట్ల పగటిపూట ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటాయి. శుక్రవారం కూడా రాష్ట్రంలో పలు జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో వచ్చే రెండు రోజులు వాతావరణం పొడిగా ఉంటుందనీ, అక్కడక్కడా తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వాన పడే సూచనలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్‌ కె.నాగరత్న తెలిపారు. జూన్‌ 1, 2 తేదీల్లో జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, జిల్లాల్లో అక్కడక్కడా వర్షం కురిసే అవకాశముంది.
అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలు (టీఎస్‌డీపీఎస్‌ నివేదిక ప్రకారం) (డిగ్రీలలో) భీమారం(మంచిర్యాల) 47.2 గరిమెళ్లపాడు(భద్రాద్రి కొత్తగూడెం) 47.1
సుజాతానగర్‌(భద్రాద్రి కొత్తగూడెం) 46.8
కొత్తగూడెం(భద్రాద్రి కొత్తగూడెం) 46.8
కమాన్‌పూర్‌(పెద్దపల్లి) 46.7
కుంచవెల్లి(కొమ్రంభీమ్‌ అసిఫాబాద్‌) 46.6
పమ్మి(ఖమ్మం) 46.5
కాగజ్‌నగర్‌(కొమ్రంభీమ్‌ అసిఫాబాద్‌) 46.5
ఏడూళ్ల బయ్యారం(భద్రాద్రి కొత్తగూడెం) 46.4
ముత్తారం(పెద్దపల్లి) 46.4

Spread the love