న్యూఢిల్లీ : కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ రెండో స్థానంలోని జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు ఇటీవల ఆదేశాలు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ వనమా దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారించింది. వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత పార్టీ మారినందున రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ను పరిగణనలోకి తీసుకోవాలని జలగం వెంకట్రావు తరపు సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు కోరారు. దీనిపై హైకోర్టులో వాదనలు జరగలేదు కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. వనమా విచారణకు హాజరుకాకపోవడం, ఆయా ఎన్నికల్లో సమర్పించిన ప్రమాణపత్రాల వివరాలు, ఒక భార్య ఉన్నారా? లేదా ఇద్దరు భార్యలు ఉన్నారా? తదితర అంశాలన్నీ పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొంది. మరో రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నందున వనమా వెంకటేశ్వరరావుపై అనర్హతను కొనసాగించాలని దామా శేషాద్రి నాయుడు కోరారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించిన ధర్మాసనం ప్రతివాదులు జలగం వెంకటరావు, తదితరులకు నోటీసులు జారీ చేసింది. అదనపు ఆధారాలు సమర్పించడానికి పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది హరీన్ రావెల్‌కు అనుమతించింది. ప్రతివాదులు రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలన్న ధర్మాసనం రిజాయిండర్‌కు మరో రెండు వారాలు గడువు ఇచ్చింది.