కన్నీళ్లు

 – వరద బీభత్సానికి 17 మంది మృతి 9 మంది గల్లంతు
– వర్షం తగ్గినా.. వీడని వరద ముప్పు
– పెను విషాదాన్ని, నష్టాన్ని మిగిల్చిన వర్షాలు
– ఇంకా నీటిలోనే పలు గ్రామాలు, పట్టణాలు
– నిరాశ్రయులైన వేలాది మంది
– 52 అడుగులకు చేరిన గోదావరి
– ఇసుక మేటలతో నిండిన పంట పొలాలు
– అధికారులు, ప్రజాప్రతినిధుల పరిశీలన
– కేంద్రబృందం కడెం ప్రాజెక్టు పరిశీలన
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు
పెనువిషాదాన్ని మిగిల్చాయి..
ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. వేలాది మంది పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిలో పలువురి ఆచూకీ తెలియటం లేదు. వారి కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ప్రత్యేక బృందాలు, పోలీసులు, అధికారులు గాలిస్తున్నారు. వరదలతో ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో 17 మంది మృతిచెందినట్టు అధికారిక సమాచారం. ములుగు జిల్లాలో 8 మంది, హనుమకొండ, ఉమ్మడి ఖమ్మంలో ముగ్గురు చొప్పున, మహబూబాబాద్‌లో ఇద్దరు, భూపాలపల్లి జిల్లాలో ఒకరు చనిపోయారని అధికారులు తెలిపారు. 9 మంది గల్లంతయ్యారు. అయితే, శుక్రవారం వర్షం తగ్గినా.. వరద ముప్పు మాత్రం ఇంకా తొలగిపోలేదు.. అనేక గ్రామాలు, పట్టణాలు నీటిలోనే ఉన్నాయి. చెరువులు, వాగులు, ప్రాజెక్టుల నుంచి ప్రవాహం కొనసాగుతోంది. ఇండ్లు మునిగి సర్వం కోల్పోయి నిరాశ్రయులైన ప్రజలు కన్నీటిపర్యంతమ వుతున్నారు. రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. మొరంచపల్లి వాసుల కన్నీటి రోదన తీర్చేవారే లేకపోయారు. నిజామాబాద్‌ జిల్లాలో పంట పొలాల్లో పెద్దఎత్తున ఇసుక మేటలు వేసింది. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక నేతలు, కార్యకర్తలు వరద ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
హైదరాబాద్‌ జంట జలాశయాలకు వరద
హైదరాబాద్‌ జంట జలాశయాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. జలమండలి అధికారులు 8 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. హిమాయత్‌సాగర్‌ నుంచి 2,750 క్యూసెక్కుల వరద నీటిని దిగువనున్న మూసీలోకి వదులుతున్నారు. ఉస్మాన్‌సాగర్‌ (గండిపేట్‌) రిజర్వాయర్‌ మొత్తం సామర్థ్యం 1790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1788.10 అడుగులు ఉంది. ఉస్మాన్‌సాగర్‌ నుంచి నీటిని వదులుతుండటంతో ముసారంబాగ్‌ బ్రిడ్జి వద్ద మూసీ వరద ఉధృంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తీరని ‘మోరంచపల్లి’ రోదన..
 మేమెట్లా బతికేదని కన్నీరు మున్నీరు
 సర్వం కోల్పోయి దీనావస్థలో గ్రామస్థులు
నవతెలంగాణ- విలేకరులు
మంచిర్యాల జిల్లాలో గోదావరిపై నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో మంచిర్యాల పట్టణం జలదిగ్భంధనంలో చిక్కుకుంది. పలు కాలనీలు నీట మునిగాయి. 48గేట్లు తెరవడంతో జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు జలమయయ్యాయి. నదీ సమీపంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రం నీట మునిగింది. మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు రాంనగర్‌, ఎన్టీఆర్‌కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఎమ్మెల్యేను నిలదీశారు. కుమురంభీం జిల్లా ఆసిఫాబాద్‌ మండలంలోని తుంపల్లి మొరంవాగులో జారిపడిన పడిన బాలుడు కౌశిక్‌(11)ను రక్షించే క్రమంలో నీటిలో దిగిన గారె మోహన్‌(40) కూడా గల్లంతయ్యారు. వారిద్దరి కోసం గ్రామస్తులు గాలిస్తున్నారు. సూర్యాపేట జిల్లా నాగారం మండలంలోని పస్తాల గ్రామం జలదిగ్బంధమైంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం రాత్రి ఏడు గంటలకు 52 అడుగులకు చేరుకుంది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రవాహం పెరగటంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 13,61,708 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్ట్‌ 20 గేట్లను పైకి ఎత్తి 22714 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పాల్వంచ మండంలోని కిన్నెరసాని ప్రాజెక్ట్‌ గేట్లను మూసేశారు. దుమ్ముగూడెంలో పునరావస కేంద్రాలను సీపీఐ(ఎం) మండల నాయకులు పరిశీలించారు. టేకులపల్లిలో ప్రెగల్లపాడు, తూర్పుగూడెం బ్రిడ్జిపై నుంచి రాకపోకలు బంద్‌ చేశారు. బూర్గంపాడులో పునరావాస కేంద్రాలను విప్‌, ఎమ్మెల్యే రేగా కాంతారావు పరిశీలించారు. సారపాక -రెడ్డిగూడెం వద్ద రాకపోకలు బంద్‌ చేశారు. కొత్తగూడెం మున్సిపల్‌ పరిధిలోని తెలంగాణ మోడల్‌ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని కలెక్టర్‌ ప్రియాంక అల తనిఖీ చేశారు.
కడెం ప్రాజెక్టును పరిశీలించిన కేంద్ర బృందం
కడెం ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర డ్యాం సేఫ్టీ బృందం సభ్యులు పరిశీలించారు. గత సంవత్సరం జులై మాసంలో భారీ వరదలు వచ్చి ప్రాజెక్టు గేట్ల కౌంటర్‌ వేట్లు దెబ్బతిన్నాయి. ఏడాది గడిచినా మరమ్మతులు పూర్తి కాకపోవడంతో దాదాపు అదే స్థాయిలో ఇప్పుడు వరద వచ్చి ప్రాజెక్టు గేట్లపై నుంచి నీరు ప్రవహించింది. ప్రాజెక్టు 18 గేట్లలో 16 మాత్రమే తెరుచుకోగా.. మిగతా గేట్లు లేవలేని పరిస్థితిలో ఉన్నాయి. ఆ 16 గేట్లలోనూ 11 మాత్రమే ఎలక్ట్రికల్‌ మోటార్ల ద్వారా తెరుచుకున్నాయి. మిగతా ఐదు గేట్లను అధికారులు స్థానిక యువకుల సహాయంతో ఎత్తారు. గురువారం రాత్రి వరకు ప్రాజెక్టు ప్రమాదకర పరిస్థితికి చేరుకుంది. ఈ క్రమంలో సీడబ్ల్యూసీ మాజీ చైర్మెన్‌, డ్యాం సేఫ్టీ నిపుణులు ఏబీ పాండ్య ఆధ్వర్యంలో 24 మందితో కూడిన బృందం ప్రాజెక్టు స్థితిగతులను పరిశీలించింది. అనంతరం ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నారు.

Spread the love