నాయకత్వానికి పరీక్ష.. ఆశావహుల మధ్య పెరుగుతున్న పోటీ

నవతెలంగాణ-సిరిసిల్ల రూరల్‌
ఆశావహుల మధ్య పోటీ పెరుగుతున్న క్రమంలో వేములవాడ నియోజకవర్గం నుండి పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి పరీక్షగా మారింది. 2009లో వేములవాడ నియోజకవర్గానికి జరిగిన తొలి ఎన్నికలో అప్పటి తెలుగుదేశం పార్టీ నాయకుడు చెన్నమనేని రమేష్‌ మహాకూటమి అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. ఆ తరువాత 2010లో జరిగిన ఉప ఎన్నిక, 2014, 2018 లలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసి వరుస విజయాలు నమోదు చేసుకున్నారు. 2009లో చెన్నమనేని రమేష్‌ తన స్వంత బాబాయి, అప్పటి మాజీ కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చెన్నమనేని విద్యాసాగర్‌ రావు ను మూడవ స్థానానికి పరిమితం చేసిన విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో ఆది శ్రీనివాస్‌ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భంలో మినహా ఏ ఎన్నికలోనూ బిజెపికి పెద్దగా ఓట్లు లభించలేదు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో బీజేపీ బలపడిందని భావిస్తున్న తరుణంలో, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజరును అనూహ్యంగా పదవి నుంచి తొలగించడంతో బిజెపి కార్యకర్తలలో నైరాశ్యం ఏర్పడింది. రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్‌ కొంతమేరకు తగ్గినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, వచ్చే ఎన్నికలలో వేములవాడ నుండి బీజేపీ తరఫున పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది.
ప్రతాప రామకష్ణ, బిజెపి జిల్లా అధ్యక్షుడు :
గత నలభై సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఆ పార్టీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తున్న ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకష్ణ మరోసారి అసెంబ్లీకి పోటీ చేయాలని ఆసక్తితో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరుతూ రాష్ట్ర నాయకత్వానికి దరఖాస్తు కూడా చేసుకున్నారు. 2018 ఎన్నికలలో చేదు అనుభవం ఎదుర్కొన్న ఆయన గతంతో పోలిస్తే నియోజకవర్గంలో ఇప్పుడు పార్టీ పట్టు పెరగడంతో పాటు ఈసారి ఎన్నికలలో అనేక సానుకూల అంశాలు తనకు కలిసి వస్తాయని ఆశాభావంతో ఉన్నారు.
తుల ఉమ, కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ మాజీ చైర్‌ పర్సన్‌ :రానున్న అసెంబ్లీ ఎన్నికలకు వేములవాడ నియోజకవర్గం నుండి తానే బలమైన అభ్యర్థిని అంటున్న కరీంనగర్‌ మాజీ జడ్పీ ఛైర్‌ పర్సన్‌ తుల ఉమ తనకే అవకాశం కల్పించాలని పట్టుబడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో కీలక పదవులు నిర్వహించి, ఆ తరువాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తో పాటు బీజేపీలో చేరిన ఆమె తనకు ఎట్టి పరిస్థితులలోనూ వేములవాడ టికెట్‌ కేటాయించాలని గట్టిగా కోరుతున్నారు.
డాక్టర్‌ చెన్నమనేని వికాస్‌ రావు,
ప్రతిమ ఫౌండేషన్‌ నిర్వాహకుడు :
వేములవాడ నుండి అసెంబ్లీకి పోటీ చేయాలని లక్ష్యంతో అత్యంత ఆర్భాటంగా బీజేపీలో చేరిన చెన్నమనేని వికాస్‌ రావు తనకు టికెట్‌ ఖాయమని గట్టి విశ్వాసంతో ఉన్నారు. మాజీ కేంద్రమంత్రి, మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగర్‌ రావు తనయుడైన డాక్టర్‌ వికాస్‌ రావు ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే లక్ష్యంతో గత కొంతకాలంగా నియోజకవర్గంలో దష్టి సారించి ప్రతిమ ఫౌండేషన్‌ పేరిట కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు.
ఎర్రం మహేష్‌, గోలి మోహన్‌:
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుగా కొనసాగుతున్న మరో నాయకుడు ఎర్రం మహేష్‌ సైతం వేములవాడ నుండి టికెట్‌ ఆశిస్తున్నారు. బీసీ ఓటర్లలో తనకు ఆదరణ ఉందని, తనకు టికెట్‌ ఇస్తే విజయం ఖాయమని చెప్పుకుంటూ ఆయన గత కొద్ది రోజులుగా ప్రజలలోకి వెళ్తున్నారు.వేములవాడ నుండి టికెట్‌ ఆశిస్తున్న ఆశావాహుల సంఖ్య ఇప్పటికే నాలుగుకు చేరగా, తాజాగా ఎన్నారై గోలి మోహన్‌ కమలదళంలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డ ఆయన వేములవాడ నియోజకవర్గంలోని బీసీలు, ముఖ్యంగా మున్నూరు కాపు ఓటర్లు తన వెంటే ఉన్నారని చెబుతూ బీజేపీ తరఫున పోటీ చేసే లక్ష్యంతో ఆ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీలో తన చేరిక ఇంకా ఖరారు కాకపోయినప్పటికీ వేములవాడ నుండి బీజేపీ అభ్యర్థిగా తనకే అవకాశం వస్తుందని ఆయన విశ్వాసంతో ఉన్నారు. బిజెపి తరఫున పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నప్పటికీ, పార్టీని బలోపేతం చేసేందుకు ఎవరు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారనే అంశంలో ఇప్పటికీ సరైన స్పష్టత లేకపోవడమే అభ్యర్థి ఎంపికలో పార్టీ నాయకత్వానికి ఎదురవుతున్న ఆటంకం. ఈ తరుణంలో ఓటర్ల మద్దతును కూడగట్టి, నియోజకవర్గంలో తమ బలాన్ని నిరూపించుకోవడమెలా అన్నదే ఆ పార్టీ ముందున్న అసలైన సమస్య.

Spread the love