రేపు భూవనగిరి జిల్లా సీపీఐ(ఎం) మూడవ మహాసభలు ప్రారంభం..

– 15వ తేదీన సీపీఐ(ఎం) జన జాతర బహిరంగ సభ..
– 16 ,17 తేదీలలో విధానపరమైన చర్చలు..
– తీర్మానాలు, భవిష్యత్తు ప్రణాళిక..
– జిల్లా నూతన కమిటీ ఎన్నికలు..
నవతెలంగాణ – భువనగిరి
సీపీఐ(ఎం) జిల్లా మూడవ మహాసభలు 15,16,17 తేదీలలో చౌటుప్పల్ డివిజన్ కేంద్రంలో ఉత్సాహ భరిత వాతావరణంలో ప్రారంభం కానున్నాయి. చౌటుప్పల్ కేంద్రంలో జాతీయ రహదారి తో పాటు పలు వార్డులలో ఎర్రజెండా తోరణాలు ఫ్లెక్సీలు, జిల్లా వ్యాప్తంగా వాల్ రైటింగ్, పోస్టర్లు వేశారు. మహాసభలు విజయవంతం చేయాలని ఇంటింటికి సీపీఐ(ఎం) శ్రేణులు వెళ్లి ప్రచారం నిర్వహించారు. జిల్లా  ప్రజా సమస్యల  పరిష్కారం కోసం నిర్వహించిన పోరాటంలో సీపీఐ(ఎం) అగ్రభాగాన ఉండడమే కాకుండా ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. జిల్లాలో సీపీఐ(ఎం) , వామపక్ష పార్టీలు తప్ప ఏ పార్టీ జిల్లాలోని ప్రజల సమస్య పరిష్కరించడంలో ఘోరంగా విఫలమయ్యాయి.
15న జన జాతర బహిరంగ సభ..
ఈ మహాసభల సందర్భంగా జన జాతర బహిరంగ సభ ఆదివారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో కోలాటం, డప్పు, వాయిద్యాలు, విచిత్ర వేషధారణలు, యువతి, యువకుల నృత్యాల నడుమ, రెడ్ వాలంటరీ కవత్తుతో ఎర్రజెండాలు చేతబట్టి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.
మూడు గంటలకు భారీ బహిరంగ సభ..
సీపీఐ(ఎం) బహిరంగ సభ 3 గంటలకు  చౌటుప్పల్ బస్టాండ్ సమీపంలోని ఖాళీ ప్రదేశంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. సీపీఐ(ఎం) జన జాతర బహిరంగ సభకు సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి హాజరుకానున్నారు. వీరితోపాటు ప్రజానాట్యమండలి కళాకారులు, సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు శ్రేణులతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రజలు, విద్యార్థులు, యువజనులు మేధావులు, ఉద్యోగ, కార్మిక రంగాలు హాజరుకానున్నారు. 16,17 తేదీలలో విధాన పరచర్చలు 16 17 తేదీల్లో రోడ్డ అంజయ్య నగర్ లో సీపీఐ(ఎం) ఎంపిక కాబడ్డ 350 మంది ప్రతినిధులు జిల్లా వ్యాప్తంగా హాజరుకానున్నారు. జిల్లాలో నెలకొన్న పలు సమస్యలపై ప్రతినిధులు చర్చలు జరిపి తీర్మానాలు చేయనున్నారు రాబోయే కాలంలో ప్రజా ఉద్యమాల కార్యాచరణ రూపొందిస్తారు. అనంతరం జిల్లా కార్యదర్శి, కార్యదర్శివర్గ సభ్యులను జిల్లా కమిటీ సభ్యులను నూతనంగా ఎన్నుకుంటారు.
విజయవంతం చేయాలి: సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎం డి జహంగీర్..
ఈనెల 15 ,16,17 తేదీలలో నిర్వహించే సీపీఐ(ఎం) జిల్లా మూడో మహాసభలను ప్రజలు కార్మికులు ఉద్యోగులు మేధావులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 15వ తేదీన బహిరంగ సభ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నిర్వహించినట్లు తెలిపారు. సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని కోరారు.

Spread the love