ప్రాణం తీసిన ముగ్గు…

ముగ్గు విషయంలో జరిగిన గొడవకు  నిండు ప్రాణం బలి
ముగ్గు విషయంలో జరిగిన గొడవకు నిండు ప్రాణం బలి

నవతెలంగాణ హైదరాబాద్: ఇంటి ముందు వేసిన ముగ్గు విషయంలో జరిగిన చిన్న గొడవ చినికి చినికి గాలివానైనట్టు… చివరికి ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన పాతబస్తీలోని ఛత్రినాక పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివాజీ నగర్ ప్రాంతంలో మాణిక్ ప్రభు తల్లి తన ఇంటి ముందు ముగ్గు వేసి ఇంట్లోకి వెళ్లింది. కాసేపటి తర్వాత.. పక్కనే నివాసం ఉంటున్న దుర్గేష్ ఇంటి నుంచి నీరు రావడంతో ఆ ముగ్గు కొట్టుకుపోయింది. దీంతో మాణిక్‌ ప్రభు పక్కింటివారితో గొడవకు దిగాడు. ఈ క్రమంలో రెండు కుటుంబాల వారు పిడిగుద్దులు గుద్దుకుంటూ దాడి చేసుకున్నారు. ఘర్షణలో తీవ్రంగా గాయపడిన మాణిక్‌ ప్రభు(35) ఒక్కసారిగా స్ఫృహ కోల్పోయాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా అతడు చనిపోయాడు. ఈ మేరకు ఛత్రినాక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love