పట్టం.. ప్రతిష్టాత్మకం

Title.. Prestigious– రేపు వరంగల్‌- ఖమ్మం- నల్లగొండ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ పోలింగ్‌
– ముగిసిన ఎన్నికల ప్రచారం
– 2021తో పోల్చితే తగ్గిన ఓటర్లు, అభ్యర్థులు
– అయినా సవాల్‌గా తీసుకున్న పార్టీలు
– సోమవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌
– 4,63,839 మంది ఓటర్లు.. 52 మంది అభ్యర్థులు.. 605 పీఎస్‌లు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి వరంగల్‌- ఖమ్మం- నల్లగొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం శాసనమండలి ఉప ఎన్నిక ప్రచార పర్వం ముగిసింది. ఈ ఎన్నికలను అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 2021 మార్చిలో ఈ స్థానానికి ఎన్నిక నిర్వహించగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి ద్వితీయ ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించారు. ఆయన 2023 నవంబర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే మూడేండ్ల పదవీకాలం పూర్తవగా.. మరో మూడేండ్ల కాలం ఉంది. నాడు రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉండగా, నేడు కాంగ్రెస్‌ పాలన ఉంది. ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గం 12 జిల్లాల్లో 34 అసెంబ్లీ స్థానాల్లో విస్తరించి ఉండటం, పైగా ఇదీ విద్యావంతులు.. అది కూడా పట్టభద్రులు మాత్రమే వేసే ఓటు కావడంతో ఈ ఎన్నిక ఫలితం ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అందువల్ల ఈ ఉప ఎన్నికను అధికారపార్టీతో పాటు విపక్షాలూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.13వ తేదీన పార్లమెంట్‌ ఎన్నికలు ముగిసిందే తడువు మంత్రులు, మాజీ మంత్రులు, కేంద్ర మంత్రులు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలోకి దిగారు. హోరాహోరీ ప్రచారం నిర్వహించారు. మొత్తమ్మీద ఈ ఎన్నిక ప్రచారం శనివారంతో ముగిసింది. సోమవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో 144 సెక్షన్‌ అమల్లోకి వచ్చింది.
ఇండియా కూటమి అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న..
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, సీపీఐ(ఎం), సీపీఐతో కూడిన ఇండియా కూటమి అభ్యర్థిగా చింతపండు నవీన్‌కుమార్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్నను బరిలో దింపాయి. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మల్లన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ముచ్చెమటలు పట్టించారు. మల్లన్నతో పాటు అప్పటి తెలంగాణ జనసమితి అభ్యర్థి ప్రొఫెసర్‌ కోదండరామ్‌ గట్టి పోటీనిచ్చారు. ఫలితంగా నాలుగు రోజుల పాటు కౌంటింగ్‌ సాగింది. చివరకు ద్వితీయ ప్రాధాన్యత ఓట్లతో రాజేశ్వర్‌రెడ్డి బయటపడ్డారు. గత ఎన్నికల్లో వామపక్షాల అభ్యర్థిగా జయసారథిరెడ్డి పోటీ చేశారు. నాడు కాంగ్రెస్‌ అభ్యర్థి రామునాయక్‌ ఐదో స్థానంలో ఉండగా.. ఆరో స్థానంలో జయసారథిరెడ్డి నిలిచారు. ఇప్పుడు కమ్యూనిస్టులు, టీజేఎస్‌ మద్దతు కూడా కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడం కలిసి వచ్చే అంశం. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి నాల్గో స్థానంలో నిలిచిన గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ప్రస్తుతమూ బరిలో ఉన్నారు. బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేస్తున్న ఏనుగుల రాకేశ్‌రెడ్డికి ఇదే మొదటి ఎన్నిక.
హోరాహోరీ ప్రచారం
దాదాపు 20 రోజుల పాటు ఈ ఉప ఎన్నిక ప్రచారం కొనసాగగా.. 12 రోజులు మాత్రం ముమ్మరంగా సభలు, సమావేశాలు నిర్వహించారు. కాంగ్రెస్‌ తరఫున మంత్రులు మల్లు భట్టివిక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ ప్రచార బాధ్యతలు నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ నుంచి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పార్లమెంట్‌ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ ఐపీఎస్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌ క్యాంపెయినర్లుగా వ్యవహరించారు. బీజేపీ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, బండి సంజరు, డీకే అరుణ, ఈటల రాజేందర్‌, లక్ష్మణ్‌, పొంగులేటి సుధాకర్‌రెడ్డి పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి తరఫున ప్రచారం చేసిన మంత్రులు బీజేపీ, బీఆర్‌ఎస్‌ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రధానంగా ప్రస్తావించారు. బీజేపీ మతతత్వ విధానాలను ఎండగట్టారు. మద్దతిచ్చిన పార్టీలూ ప్రచారం నిర్వహించి కూటమి అభ్యర్థిని గెలిపించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాయి. నాడు కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్‌ఎస్‌ తనను ఎంతగా ఇబ్బంది పెట్టాయో.. తనపై ఎన్ని అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేశాయో అభ్యర్థి మల్లన్న ప్రజల ముందు ఉంచారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ మాత్రం మల్లన్నను ఓ బ్లాక్‌మెయిలర్‌గా చిత్రీకరించి లబ్దిపొందాలనే ప్రయత్నాన్ని తీవ్రంగా చేశాయి.
పోలింగ్‌ శాతం పెంపుదల డౌటే..!
వరుసగా ఎన్నికలు వస్తుండటంతో ఓటర్లు ఒకింత ఇబ్బంది పడుతున్నారు. పైగా పట్టభద్రుల ఓట్లు.. అవి కూడా బ్యాలెట్‌ ఎన్నికలు కావడం, ప్రాధాన్యత క్రమం ప్రకారం కావడంతో ఓటింగ్‌ జాప్యం జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పట్టభద్రులు ఏ మేరకు కదిలి వచ్చి పోలింగ్‌లో పాల్గొంటారనేది అనుమానంగానే ఉంది. ఇదే స్థానానికి 2021లో జరిగిన ఎన్నికల్లో 5,05,565 మంది ఓటర్లుండగా 3,74,117 (73.86%) మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. 2015లో 49.61% మందే ఓటు వేశారు. 2021లో 5.05 లక్షల మంది ఓటర్లకు 703 పోలింగ్‌ స్టేషన్‌లు ఏర్పాటు చేయగా, ఈసారి 4.63 లక్షల మందికి 605 కేంద్రాలను నెలకొల్పారు. 27వ తేదీన ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకుంటారో చూడాలి. జూన్‌ 5న ఈ ఎన్నికల కౌంటింగ్‌ మొదలవుతుంది.

Spread the love