– ఆగ్రహంతో ఊగిపోయిన కేంద్ర మంత్రి షెకావత్
– సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తే తరిమేస్తామని హెచ్చరిక
జైపూర్ : సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వారిపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అవాకులు చవాకులు పేలారు. అలాంటి వారి నాలుక కోస్తానని, కళ్లు పీకేస్తానని బెదిరించారు. రాజస్థాన్లోని బర్మర్లో మంగళవారం నిర్వహించిన ఓ ర్యాలీలో కేంద్ర మంత్రి పెట్రేగిపోయారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన ప్రకటనపై ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. షెకావత్ ప్రసంగం సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. సనాతన ధర్మానికి ఎదురవుతున్న సవాళ్లను కలసికట్టుగా ప్రతిఘటించాలని ఆయన పిలుపునిచ్చారు. ‘సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడే వారి నాలుక కోసేయాలి. ఆ ధర్మానికి వ్యతిరేకంగా ఎవరైనా కళ్లు విప్పితే వాటిని పీకేయాలి’ అని ఆయన చెప్పుకొచ్చారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడే వారికి దేశాన్ని పాలించే అర్హత లేదని కూడా అన్నారు. అల్లాఉద్దీన్ ఖిల్జీ, ఔరంగజేబు వంటి పాలకులు సనాతన ధర్మాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించారని, అయితే మన పూర్వీకులు ఆ ప్రయత్నాలను అడ్డుకొని భారతీయ సంస్కృతిని పరిరక్షించారని షెకావత్ చెప్పారు. సనాతన ధర్మంపై దాడి చేసిన వారిని సహించబోమని, వారిని తరిమేస్తామని మహారాజా సూరజ్మాల్, వీర దుర్గాదాస్, మహారాణా ప్రతాప్ వంటి వారిపై ప్రతినబూని చాటిచెప్పాలని కోరారు.