గీటురాళ్లు

 Sampadakiyam ఎన్నికల సమయంలో అవే తూకపు రాళ్ళు. ఎన్నో పార్టీలున్నట్టే వాటికి ఎన్నో జెండాల రంగులున్నట్టే పార్టీలను బట్టి తూచే పద్ధతులుంటాయి. వేసే కొలతలను బట్టి తూకపు రాళ్ళుంటాయి. ఇది భౌతిక శాస్త్రమూల సూత్రాలకే వ్యతిరేకమని కొందరు గొణిగినా, ఇది నిజం. ఒక్క భౌతిక శాస్త్రమేంటి? కొలిచేటపుడు నాయకుడితో ‘కెమిస్ట్రీ’ కూడా కుదరాలి కదా! ఎన్నికల విధేయ శాస్త్రం పార్టీలను బట్టి వేరు వేరుగా ఉంటుంది. కాంగ్రెస్‌ అయితే ‘గాంధీ’ కుటుంబ విధేయత ఒక గీటురాయి. అందుకే వనపర్తి సీటు చిన్నారెడ్డికిచ్చినందుకు మరోకాయన మొత్తుకుంటున్నాడు. బీఆర్‌ఎస్‌ అయితే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనక పోయినా పర్వాలేదు గాని కేసీఆర్‌ యెడల వల్లమాలిన భక్తి ప్రపత్తులు కలిగియుండాలి. మాజీ టీడీపీ నాయకులు ఒక వెలుగు వెలుగుతున్న స్థితి చూస్త్తున్నాం కదా! ఇక బీజేపీ అయితే తెలిసిందే కదా! మోడీని రాజమార్తాండ, రాజకంఠీరవ అన్న బిరుదులతో కైవారం చేయడమొక్కటే చాలదు, గుజరాత్‌ మారణకాండ, 2021లో గంగా నది ఒడ్డున తేలిన కోవిడ్‌ శవాల గురించి నోరెత్తకూడదు. బుల్డోజర్‌ అనే మాట జీవితంలో ఉచ్ఛరించని వారై ఉండాలి. మోడీని వీడియో తీసేటపుడు అడ్డొచ్చేవాడు అసలే అయి ఉండకూడదు
మరి, గురుత్వాకర్షణశక్తికి వ్యతిరేక డైరెక్షన్‌లో పయనిస్తున్న శకలాల మాటేమి టని కొందరికి సందేహం రావచ్చు. దాని వివరణ సర్వశ్రీ కుల్వకుంట్ల తారకరాముడు ఇచ్చేశారుగా! కేసీఆర్‌ని నిన్నటి దాకా బండ బూతులు తిట్టిన పొన్నాల లక్ష్మయ్య, నాగం జనార్దనరెడ్డి వంటి నేతలు గులాబీ కండువాలు ఎందుకు కప్పుకున్నారు? కేసీఆర్‌పై బీభత్సమైన పాటలతో వీరంగం వేసిన గాయక శిఖామణులు కొందరు తిరిగి గులాబీ దళపతి పంచనెందుకు చేరారు? అనే దానికి… మొన్నటి ‘చిట్‌చాట్‌’లో ”మేము బలపడటం ఒకెత్తు అయితే, శత్రువును బలహీన పరచడం మరో కీలక ఎత్తుగడ’ని ‘రణనీతి’ గురించి విలేకర్లకు ‘జ్ఞానోదయం’ అయ్యేలా తమ వ్యూహాన్ని డిఫెండు చేసుకున్నారు.
ఒక పార్టీ విధానం నచ్చక… కనీసం నాయకుడి పని తీరు నచ్చక గతంలో పార్టీలు మారేవారు. ఇపుడు అచ్చంగా తనకు సీటివ్వకపోతే ఎగిరి ఇంకో చెట్టుపై వాలుతున్నారు. గతంలో బీసీ వాదాన్ని బలంగా వినిపించిన వ్యక్తి ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసి, నలభై వేల ఓట్ల తేడాతో ఓడి, 2018 ఎన్నికల్లో యాభై వేల ఓట్లతో ఓడి, ఇపుడు సీటివ్వకపోయే సరికి ప్రత్యర్థి పార్టీలో చేరడం చూస్తే వలువ లూడున్న విలువల్ని చూసి ఆయన నియోజక వర్గ ప్రజలు సిగ్గుపడ్తున్నారు. కొందరు దళిత నాయకులు సైతం తమ స్వార్థం కోసం మనువాద మహావృక్షంపై వాలడం తమ భవిష్యత్‌నే కాదు తమ అనుయాయుల ప్రయోజనాలను కూడా దెబ్బ తీసిన వారవడం లేదా?! 1967లో హర్యానా లో ప్రారంభమైన ‘ఆయారామ్‌ గయారమ్‌’ సంస్కృతి నేడు మన తెలంగాణలో ఆరు పువ్వులు పన్నెండు కాయలుగా వర్థిల్లుతోంది.
నేటి ఎన్నికల్లో గీటురాళ్లు ‘పైసాయే పరమాత్మ’! ప్రజా సేవకు డేనా? ప్రజల్లో ఉంటాడా? ప్రజలకోసం త్యాగం చేస్తాడా? వంటివి పరిశీ లించే స్థితి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీల్లో లేదు. మునుగోడు గోడు మన కండ్ల ముందే ఉంది కదా!
దీనికి భిన్నమైన వారు కమ్యూనిస్టులు. అభ్యర్థులుగా ఎంపికయ్యేవారు ఏ పాటి ప్రజాసేవకులు, ఉద్యమాల్లోవారి పాత్రేమిటి? అనేది కీలకం. వారి ఆస్తుల గురించి కాదు, వారిపై ప్రజా ఉద్యమాల్లో కేసులెన్ని ఉన్నాయో, ఎన్నేళ్లు జైళ్లకెళ్లారు? వారు అభ్యర్థులైతే ప్రజా ఉద్య మాలకు జరిగే ఉపయోగమేంటి అనేది కీలకం. వారి నడవడికేంటనేవే గీటురాళ్లు. అటువంటి ఉత్తమోత్తముల గురించి ఈ పత్రిక రోజూ పాఠకుల దృష్టికి తెస్తోంది. ”బాంబుల వర్షం కురిసినా, బారు ఫిరంగులు మోగినా ఎత్తిన జెండా దించ’ని వారే కమ్యూనిస్టు అభ్యర్థులు.
సరళీకృత ఆర్థిక విధానాలు ముదిరి పాకానపడ్తున్నాయి. కార్మికుల, కర్షకుల జీవితాలు దుర్భరమౌతున్నాయి. వ్యవసాయ కూలీలు సాధించుకున్న ఉపాధి హామీ చట్టం ఛిద్రమవుతుండగా జీవచ్ఛవాలుగా బతుకులీడుస్తున్నారు. వృత్తులు ధ్వంసమై వృత్తి దారులు పట్టణ అసంఘటిత కార్మికులుగా చాలీచాలని జీతాల్తో జీవిస్తున్నారు. మరో వైపు శతకోటీశ్వరులు శత సహస్ర కోటీశ్వ రులుగా రూపు దాలుస్తున్నారు. దీన్నే ‘కే’ ఆకారపు అభివృద్ధిగా ఇటీవలి ఇపిడబ్ల్యూ సంపాదకీయం పేర్కొన్నది. (ఇంగ్లీషు కె రాస్తే ఒక కోణం పైకి పెరిగి మరొకటి కిందికి దిగడం) ఈ ప్రజలు నిరంతరం పోరాటాల్లోకొస్తున్నారు. వారికి అండగా నిలవడం, వారి తరు ఫున పోరు జెండాలెత్తడం, పోరు బాట పట్టడం కమ్యూనిస్టుల విధి. వారు ఎక్కడ నుండి పోటీలో వున్నా గెలిపించుకోవడం ప్రజల కర్తవ్యం.

Spread the love