– తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు
– వనపర్తి ఆర్డీఓ కార్యాలయం వరకు పాదయాత్ర , అధికారులకు వినతి
నవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
ఎన్నో ఏండ్లుగా సాగులో ఉన్న గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం వనపర్తి జిల్లా ఘనపురం మండలం కర్నే తండా నుంచి జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం వరకు సుమారు 22 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు. కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఘనపూర్ మండలం మామినిమాడ శివారులోని ఎనికి తండా, మేడి బావితండా, ముందరి తండా, కర్నే తండా, ఆముదంబండ తండా, చిన్నపీరు తండా, నిత్య తండా, భీముని తండా గిరిజనులు తరతరాల నుంచి సాగు చేసుకుంటున్నారని చెప్పారు. వారికి పట్టాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాజశేఖర్ బహదూర్ వనపర్తి సంస్థాన్ ఆఫీసుల పేరిట 460 ఎకరాల భూమి ఉండటం సీలింగ్ చట్టానికి వ్యతిరేకమని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలోని సీలింగ్ యాక్ట్ ప్రకారం ఒక కుటుంబానికి 53 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండకూడదనే నిబంధన ఉన్నప్పటికీ.. ఆయన పేరుపై 460 ఎకరాలు ఉన్నా అధికారులు చర్యలు తీసుకోలేదన్నారు. ఆ భూముల్లో లంబాడ తండా గిరిజనులు తరతరాల నుంచి సాగు చేసుకుంటున్నా వారికి పట్టాలు ఇవ్వకపోవడం రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమేనని విమర్శించారు. సర్వేనెంబర్ 369 నుంచి 414లోని 463 ఎకరాల భూముల్లో 153 కుటుంబాలు సాగు చేసుకుంటున్నాయని వివరించారు. ప్రస్తుత ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మెగారెడ్డి తక్షణమే స్పందించి సాగు చేసుకుంటున్న గిరిజన లంబాడ కుటుంబాలకు పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 26వ తేదీలోపు గిరిజన కుటుంబాలకు పట్టాలు పంపిణీ చేసి రైతుభరోసా వర్తింపజేయాలని కోరారు.మహబూబ్‌నగగర్ ఉమ్మడి జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నా అధికారుల తీరులో మార్పు కనబడటం లేదన్నారు. ఈ అంశంపై త్వరలో ముఖ్యమంత్రిని కలవనున్నట్టు చెప్పారు. గిరిజనులకు పట్టాలు ఇవ్వకపోవడం వల్ల రైతుబంధు, రైతుబీమా, ఇతర సంక్షేమ పథకాలు అందలేదని తెలిపారు. రాబోయే రోజుల్లో రాజకీయాలకతీతంగా అన్ని పార్టీలనూ ఒక వేదికపైకి తీసుకొచ్చి రైతుల పక్షాన న్యాయమైన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
భూమి పట్టాలు సాధించేవరకు పెద్దఎత్తున పోరాటం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రాజు, ప్రధాన కార్యదర్శి మేకల ఆంజనేయులు, ఉపాధ్యక్షులు అజరు, గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాల్య నాయక్, తెలంగాణ వ్యవసాయ కార్మిక రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షులు పద్మ కృష్ణనాయక్, ఐద్వా జిల్లా కార్యదర్శి లక్ష్మి, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మహబూబ్ పాషా, గిరిజన సంఘం జిల్లా నాయకులు సకృనాయక్, జిల్లా కార్యదర్శి మహేష్, ఉపాధ్యక్షులు కురుమయ్య, బొబ్బిలి నిక్సన్, రైతులు పాల్గొన్నారు.