నాటి ఉద్యమ స్ఫూర్తియే… నిజమైన చేనేత దినోత్సవం

నాటి ఉద్యమ స్ఫూర్తియే... నిజమైన చేనేత దినోత్సవంనాటి బ్రిటీష్‌ పాలకులపై మిల్లు వస్త్రాలకు వ్యతిరేకంగా గ్రామీణ ఉపాధి రంగమైన చేనేతను కాపాడుకోవాలని ఆగస్టు 7న ఒక మహత్తర ఉద్యమ ప్రస్థానం ప్రారంభమైన రోజు. నేడు స్వతంత్ర భారతదేశ పాలకులు అనుసరిస్తున్న చేనేత వ్యతిరేక విధానాలపై నాటి ఉద్యమ స్ఫూర్తిని తలుచుకొని ఉద్యమించాల్సిన అవసరం చేనేత కార్మికులపై, అభిమానులపై ఉన్నది. ఆ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించడమే నిజమైన చేనేత దినోత్సవం.
బ్రిటిష్‌ సామ్రాజ్యవాదుల రాకతో భారత ఆర్థిక వ్యవస్థ, అందునా టెక్స్‌టైల్‌ రంగం ధ్వంసమైంది. బ్రిటన్‌లో బట్టల పరిశ్రమ పెద్ద ఎత్తున పురోగమించేం దుకు ఇది దోహదపడింది. మన దేశం నుండి లక్షల బేళ్ల పత్తి ఇంగ్లాండ్‌కు దిగుమతి చేసుకున్నారు. అక్కడి మిల్లుల్లో తానుల కొద్దీ బట్ట తయారు చేసి భారతదేశంపై డంప్‌ చేశారు. ఈ సందర్భంగా బ్రిటన్‌ పాలకులు అవలంబించిన ద్వంద్వ విధానం వల్ల, అంటే మన దేశం నుండి ఇంగ్లాండులోకి దిగుమతయ్యే బట్టపై విపరీతమైన సుంకాలు విధించడం, ఇంగ్లాండ్‌ నుండి భారతదేశంలోకొచ్చే బట్ట తక్కువ సుంకాల్లో రావడంతో మన చేనేత రంగం కూసాలు విరిగిపోయాయి. ఈస్టిండియా కంపెనీ కాలం నుండి సాగిన ఈ దోపిడీ మన చేనేత రంగాన్ని ధ్వంసం చేసింది.
ఈ విపత్కర పరిణామాల వలన నేత రంగం నుండి వైదొలిగే వారి సంఖ్య అనివార్యంగా పెరిగింది. పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు తగ్గిపోయారు.1919 జాతీయ కాంగ్రెస్‌ సభలు చేనేతపై ఒక తీర్మానం చేశాయి. నూలు కరువును పోగొట్టి మార్కెట్‌ సౌకర్యం కల్పించి చేనేత సంక్షోభాన్ని నివారిం చాలని తీర్మాన ప్రధాన ఉద్దేశం. మహాత్మాగాంధీ పిలుపునిచ్చిన విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమంలో చేనేత కార్మికులు పెద్దఎత్తున కదిలారు. స్వాతంత్రోద్యమంలో చేనేత ఉద్యమం అంతర్భాగమైన ఫలితంగా బ్రిటిష్‌ ప్రభుత్వం మొదటిసారిగా 1920లో చేనేతపై రాయల్‌ కమిషన్‌ వేసింది. ప్రయివేటు పెట్టుబడిదారుల నుండి చేనేతను రక్షించి అభివద్ధి చేయాలంటే సహకార వ్యవస్థ అవసరమనే అభిప్రాయానికి కమిషన్‌ రాక తప్పలేదు.1934లో ప్రభుత్వం తొలిగా రాష్ట్రానికి రూ.5 లక్షల చొప్పున సబ్సిడీని అందించింది. 1940లో చేనేత మహాసభ సిఫార్సుల మేరకు నిజ నిర్ధారణ కమిటీ వచ్చింది. కోట్లాదిమంది ప్రజల జీవనోపాధి దష్ట్యా చేనేత రంగాన్ని సజీవంగా ఉంచాలని ఈ కమిటీ ప్రథమంగా ప్రభుత్వానికి సూచించింది.
చేనేత సంక్షోభం…ఆకలియాత్రలు
స్వాతంత్రానంతరం 1949లో చేనేత అభివద్ధికై హ్యాండ్‌లూమ్‌ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌ను ఏర్పాటు చేశారు. ఈ బోర్డు ద్వారా 1953లో మిల్లు బట్టలపై సెస్సు వసూలు చేసి తద్వారా చేనేత అభివద్ధికి చర్యలు చేపట్టారు. కాంగ్రెస్‌ పాలకులు పైకి ఎన్ని మాటలు చెప్పినా ఆచరణలో వస్త్ర మిల్లుల యాజమాన్యాలకు కొమ్ముకాశారు. అందుకే పదేండ్లలోపే 1954లో చేనేత పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. చేనేత కార్మికుల ఆకలికేకలు వినిపించాయి. గంజి కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన దుస్థితి వచ్చింది. ఈ సంక్షోభ కాలంలో చేనేత కార్మికులు ఆకలి యాత్రలను నిర్వహించారు. చేనేత రక్షణకై కదిలిన పెద్ద ఉద్యమం అది. రాజాజీతో చర్చించారు. చేనేతను కేవలం వస్త్ర ఉత్పత్తి దష్టితోనే చూడకూడదు, ఉపాధిని కల్పించే రంగంగా చూడాలని పేర్కొంటూ మొట్టమొదటిసారిగా ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్రంలో ఆయన చేనేత రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు. అప్పుడు కానుంగో కమిటీ పేరుతో టెక్స్‌టైల్‌ ఎంక్వైరీ కమిటీని వేశారు. పెట్టుబడిదారుల ఒత్తిడితో ఈ కమిటీ మరో ఇరవైయేండ్లలో చేనేత మగ్గాలన్నీ మిల్లులుగా మార్చాలని చెప్పింది. అంటే మిల్లుల ప్రవేశంతో చేనేతను సమాధి చేయాలనే యోచన ఇది. 1974లో శివరామన్‌ అధ్యక్షతన ఏర్పడిన హైపవర్‌ కమిటీ చేనేత అభివద్ధికై జౌళి విధాన మార్పులకు సూచనలు చేసింది. నూటికి 80 మంది చేనేత కార్మికులు ప్రయివేటు రంగంలో ఎలాంటి భద్రత లేకుండా జీవిస్తున్నారని పేర్కొంటూ వారిని రక్షించేందుకు సహకార వ్యవస్థను ఆధారంగా చేసుకోవాలని చెప్పారు. ఐదో ప్రణాళిక అంతానికల్లా అరవై శాతం మందిని సహకార రంగంలోకి తీసుకురావాలని సూచించింది. అలాగే చేనేతకు అవసరమైన ముడిసరుకు, చిలప నూలును సహకార మిల్లుల్లో విధిగా ఉత్పత్తి చేయాలని చెప్పింది.
చేనేతను మింగిన పవర్‌లూమ్‌ పాలిస్టర్‌
1978లో జనతా ప్రభుత్వం సమగ్ర జౌళి విధానం తీసుకువచ్చింది. చేనేతను ప్రాధాన్యత గల రంగంగా గుర్తిస్తూనే చేనేత, మిల్లు రంగాలను రెండింటినీ ఆధునీకరించాలని చెప్పింది. సహజమైన నూలుతో పాటు కత్రిమ ధారాన్ని చేనేతకు అందించాలని పేర్కొంది. 1985వ సంవత్సరంలో నూతన జౌళి విధానాన్ని రాజీవ్‌ గాంధీ తీసుకువచ్చారు. ఈ జౌళి విధానం పైకి ఎన్ని తీయటి మాటలు చెప్పినా లోపల చేదు వాస్తవాలు ఉన్నాయి. ఉపాధి ప్రాధాన్యతను తొలగించి ఉత్పత్తికి ఉత్పాదకతకు పెద్దపీట వేయడం, నూలు, కృత్రిమ దారాల వస్త్ర నిష్పత్తిని 70-25 శాతం నుండి, 50-50 శాతానికి మార్చడం, పత్తి, పత్తి నూలు ఎగుమతిని అనుమతించడం, కత్రిమ నూలు (పాలిస్టర్‌ ఫైబర్‌) దిగుమతులకు భారీగా సుంకాలను తగ్గించి యథేచ్ఛగా అనుమతించడం, ఆధునీకరణ పేరుతో వందల కోట్ల రూపాయల రాయితీలు ధీరుబారు అంబానీకి (రిలయన్స్‌) కట్టబెట్టారు. లైసెన్స్‌తో పనిలేకుండా మిల్లులు విచ్చలవిడివ్యాప్తికై 1985 జౌళి విధానం ఉపయోగపడింది. ఈ పరిణామాల వల్ల పదేండ్లలోనే నూలు ధరలు రూ.53 నుండి రూ.225లకు పెరిగాయి. పాలిస్టర్‌ ధరలు రూ.350ల నుండి రూ.53లకు తగ్గాయి. నూలు ఎగుమతుల వలన చేనేత నూలు కొరత ఏర్పడింది. పవర్‌లూమ్‌ పాలిస్టర్‌ బట్టల పోటీకి చేనేత నిలబడలేకపోయింది. చేనేతను ఈ ప్రమాదమే మింగింది. 1976లో ప్రారంభమైన జనత వస్త్ర పథకాన్ని ఈ జౌళి విధానంలో ఉద్ధరిస్తామని చెప్పి 1996వ సంవత్స రానికల్లా రద్దు చేశారు. 22 రకాల చేనేత రిజర్వేషన్‌ చట్టంపై మిల్లు యాజమానులు స్టేను తీసుకొస్తే ఆ స్టేను తొలగించుకోవడానికి ఎనిమిదేళ్లు పట్టింది. ఆ తర్వాత మీరాసేత్‌ కమిటీ 22 రకాలను 11 రకాలకు కుదించింది. 1989 వరకు ఉన్న రిబేట్‌ పథకానికి తూట్లు పొడిచారు. 1998లో నూతన జౌళి విధానం పున: సమీక్ష పేరుతో బీజేపీి ప్రభుత్వం ఎస్సార్‌ సత్యం కమిటీని ఏర్పాటు చేయగా, చేనేత పరిశ్రమకు గొడ్డలి పెట్టు లాంటి సిఫార్సులను ఈ కమిటీ చేసింది. చేనేతకు కావలసిన చిలపల నూలును మిల్లులు తయారు చేయొద్దని, చేనేత రిజర్వేషన్‌ చట్టం అవసరం లేదని, దానికి అర్ధం లేదని, చేనేతకు సంక్షేమ పథకాలు అక్కర్లేదని, చేనేత వత్తిని మానుకోవాలంటూ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సత్యం కమిటీ దారుణమైన సిఫార్సులను చేసింది.
చేనేతను ధ్వంసం చేసేలా బీజేపీ విధానాలు
స్వాతంత్య్రోద్యమ సమయంలో 1905ఆగస్టు 7న కలకత్తాలో మొదలైన స్వదేశీ ఉద్యమంలో భాగంగా విదేశీ వస్త్ర బహిష్కరణ స్వదేశీ వస్త్ర నినాదంతో పెద్దఎత్తున ఉద్యమం జరిగింది. ఆ రోజును గుర్తు చేసుకుంటూ జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటున్నాము. కానీ నాటి బ్రిటిష్‌ పాలకులు అనుసరించిన చేనేత వ్యతిరేక విధానాలతో పాటు స్వతంత్ర భారతదేశ పరిపాలనలో చేనేతను ధ్వంసం చేసేలా రూపొందిన విధానాలను నేడు బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్నది. చేనేత రంగానికి కేటాయించిన పదకొండు రకాల రిజర్వేషన్‌ చట్టాన్ని అమలు చేయకుండా చేనేత రిజర్వేషన్‌ చట్టంలోని ఉత్పత్తులకు మిల్లుల్లో అవకాశాలను కల్పిస్తున్నది. నేడు పోచంపల్లి టై అండ్‌ డై ఇక్కత్‌ చీరలు, కరీంనగర్‌ చెద్దర్లు, వరంగల్‌ దర్రీస్‌, సిద్దిపేట గొల్లభామ చీరలు, గద్వాల కాటన్‌ చీరలు, ధర్మవరం, కంచి, బెనారస్‌, మంగళగిరి, వెంకటగిరి మొదలగు వస్త్రాలు మిల్లులపై తయారవుతున్న వాటిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడం చూస్తే చేనేతను ధ్వంసం చేసే ఆలోచనలే కనబడుతున్నాయి. చేనేత కార్మికులు పోరాడి సాధించుకున్న జాతీయ చేనేత బోర్డును రద్దు చేయడం, మహాత్మా గాంధీ బునకర్‌ బీమా యోజన, ఐసిఐసిఐ లాంబార్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌, చేనేత కార్మికుల హౌస్‌ కం వర్క్‌షెడ్‌ లాంటి పథకాలను బీజేపీి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేయడంతో పాటు, చేనేత ముడిసరుకులైన యారన్‌పై ఐదుశాతం, రంగులు, రసాయనాలపై 5-12శాతం జీఎస్టీని విధించి చేనేత కార్మికులకు ముడి సరుకులు అందుబాటులోకి లేకుండా చేసింది. అదే విధంగా చేనేత వస్త్రాలపై 5శాతం జీఎస్టీని విధించి చేనేత వస్త్ర వినియోగదారులకు, చేనేత వస్త్రాలు అందుబాటులో లేకుండా దూరం చేసి చేనేత వస్త్ర మార్కెట్‌ను దెబ్బ తీసింది. చేనేత పరిశ్రమ, కార్మికుల ఉపాధి సంక్షేమం,అభివద్ధి కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా మిల్లు రంగాలకే పెద్దఎత్తున నిధులను కేటాయించి చేనేత విధ్వంస విధానాలను రూపొందించి అమలు చేస్తున్నది.
కూరపాటి రమేష్‌
9490098048

Spread the love