టీఎస్పీఎస్సీ బోర్డును వెంటనే రద్దు చేయాలి

The TSPSC board should be dissolved immediately– కొత్త బోర్డు నియామకం చేసి గ్రూప్‌ 1 పరీక్షలు నిర్వహించాలి
– ఓయూలో విద్యార్థులు, నిరుద్యోగుల ర్యాలీ
నవతెలంగాణ-ఓయూ
టీఎస్పీఎస్సీ బోర్డును వెంటనే రద్దు చేయాలని ఓయూ విద్యార్థులు, నిరుద్యోగులు డిమాండ్‌ చేశారు. గ్రూప్‌ – 1 ప్రిలిమ్స్‌ మళ్లీ రద్దు కావడం పట్ల శనివారం హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు, నిరుద్యోగులు, గ్రూప్స్‌ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. యూనివర్సిటీ లైబ్రరీ నుంచి వర్సిటీ మెయిన్‌ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ బైటాయించి టీఎస్‌పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు నిరుద్యోగులు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ టీఎస్‌పీఎస్సీ చైర్మెన్‌ జనార్దన్‌ రెడ్డితో కలిసి మార్కెట్‌లో చేపలను అమ్మినట్టు ప్రతి పేపర్‌నూ అమ్ముతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం మీద, టీఎస్‌పీఎస్సీ బోర్డు మీద తమకు నమ్మకం లేదన్నారు. ఎన్నో ఆశలతో తమ తల్లిదండ్రులు, కూలి పనిచేసి డబ్బులు పంపిస్తుంటే, ఏండ్ల తరబడి ఉద్యోగాల కోసం ఉస్మానియా యూనివర్సిటీ, అశోక్‌ నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతాల్లో ఉంటూ చదువుకుంటున్నామని చెప్పారు. ఉద్యోగాలు సంపాదించాలనుకున్న తమకు అవినీతి పాలకుల వల్ల తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, టీఎస్పీఎస్సీ బోర్డు కుమ్మక్కై పేపర్లను అమ్ముకుంటూ తమ జీవితాలను నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెండ్లీలు చేసుకోకుండా గడ్డాలు పెంచుకొని, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఎంతోమంది అభ్యర్థుల ఉసురు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి తగులుతుందని హెచ్చరించారు. రాజ్యాంగబద్ధమైన టీఎస్‌పీఎస్సీ బోర్డును అవినీతిమయం చేసి, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న బోర్డు చైర్మెన్‌ను తక్షణమే బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. బోర్డును రద్దు చేసి, నూతన టీఎస్‌పీఎస్సీ ఏర్పాటు చేశాక తిరిగి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రానున్న ఎన్నికల్లో ప్రతి విద్యార్థి , నిరుద్యోగి గ్రామ గ్రామాన తిరిగి కేసీఆర్‌ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి నేతలు క్రాంతి, నరసింహన, రవితేజ, నగేష్‌, వెంకట్‌ నాయక్‌, మేడే శ్రీను, గణేష్‌, శాంతి కుమార్‌, విద్యార్థులు నిరుద్యోగులు పాల్గొన్నారు.

Spread the love