ఆధునిక బానిసత్వంలో అభాగ్యులు

‘వాక్‌ ఫ్రీ’ నివేదిక వెల్లడి
లండన్‌ : ఇటీవలి సంవత్సరాలలో ఆధునిక బానిసత్వంలో మగ్గుతున్న ప్రజల సంఖ్య పెరుగుతోందని ఓ అధ్యయన నివేదిక తెలిపింది. మానవ హక్కుల సంస్థ ‘వాక్‌ ఫ్రీ’ బుధవారం నాడు లండన్‌లో ‘ప్రపంచ బానిసత్వ సూచిక’ను విడుదల చేసింది. దీని ప్రకారం 2021లో ప్రపంచంలోని ఐదు కోట్ల మంది అభాగ్యులు ఆధునిక బానిసత్వ సంకెళ్లలో బందీలయ్యారు. ఐదేండ్ల కిందట నాటి అంచనాలతో పోలిస్తే ఈ సంఖ్య కోటికి పైగా పెరిగింది. సాయుధ ఘర్షణలు, పర్యావరణ అసమతుల్యత, కోవిడ్‌ ప్రభావాలతో పాటు పలు అంశాలు ఈ పెరుగుదలకు కారణాలయ్యాయి.
బలవంతంగా పనిలో దింపడం, అప్పులు తీర్చడానికి విధిలేని పరిస్థితుల్లో పనికి పోవడం, నిర్బంధ వివాహాలు, మానవ అక్రమ రవాణా…ఇవన్నీ ఆధునిక బానిసత్వానికి ఉదాహరణలేనని నివేదిక తెలిపింది. ఈ తరహా బానిసత్వం మనకు ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలోనూ కన్పిస్తుంది. ప్రతి రోజూ ప్రజలను ఏదో ఒక రూపంలో బానిసలుగా మారుస్తున్నారు. ఈ బతుకు నుంచి వారు బయటపడలేకపోతున్నారు. వారు తయారు చేసే ఉత్పత్తులను మనం కొనుగోలు చేస్తున్నాం. లేదా వారి సేవలు పొందుతున్నాం. అయితే దాని వెనుక ఉన్న మానవ శ్రమను మనం గుర్తించలేకపోతున్నాం. ఈ నివేదిక ప్రకారం బలవంతంగా పనిలో చేరుతున్న వారి సంఖ్య 2.76 కోట్లు కాగా బలవంతపు వివాహాలతో బానిస బతుకులు బతుకుతున్న వారు 2.2 కోట్ల మంది. ప్రపంచంలోని ప్రతి 150 మందిలోనూ ఒకరు బానిసత్వంలో మగ్గిపోతున్నారు. ఆధునిక బానిసత్వ బాధితుల సంఖ్య ఎరిట్రియా, మారిటేనియా దేశాలలో ఎక్కువగా ఉంది. మొదటి పది స్థానాలలో సౌదీ అరేబియా, టర్కీ, యూఏఈ, కువైట్‌ కూడా ఉన్నాయి. ఈ దేశాల మధ్య కొన్ని రాజకీయ, సామాజిక, ఆర్థిక పరమైన సామీప్యతలు ఉన్నాయి. అక్కడ పౌర స్వేచ్చ, మానవ హక్కులకు రక్షణ తక్కువగా ఉంటుంది. ఆధునిక బానిసత్వ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాలలో ఘర్షణలు, రాజకీయ అస్థిరత, నియంతృత్వ పోకడలు కన్పిస్తాయి. శరణార్థులు, వలస కార్మికుల సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. వీరికి ఆయా దేశాల పౌరులకు ఉండే న్యాయపరమైన రక్షణ ఉండదు. కాబట్టి వీరు దోపిడీకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనేక దేశాలలో ప్రభుత్వాలే తమ పౌరులను వివిధ రంగాలలో బలవంతంగా పనిలో దింపుతుంటాయి. జీ-20 దేశాలలో కూడా అనేకమంది ప్రజలు దోపిడీకి గురవుతున్నారు. ఈ నివేదిక ప్రకారం భారత్‌లో 1.1 కోట్ల మంది కట్టు బానిసలుగా మారి బతుకు బండిని లాగిస్తున్నారు.

Spread the love