కేరళ ప్రజల సమైక్యతా తీరు భేష్‌

కేరళ ప్రజల సమైక్యతా తీరు భేష్‌– ప్రశంసించిన సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో
న్యూఢిల్లీ : కేరళలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు ఎదురయ్యే సవాళ్ళను అధిగమించేందుకు ప్రజలంతా ఒకే తాటిపై నిలిచి పోరాడటాన్ని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో ప్రశంసించింది.ఒకవైపు బాధితులకు సహాయ సహకారాలు అందిస్తూనే మరోవైపు ప్రజల పునరావాసం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న ప్రభుత్వాన్ని,ప్రజలను పొలిట్‌బ్యూరో అభినందించిం ది.కేరళ ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర హౌం మంత్రి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని పొలిట్‌ బ్యూరో తీవ్రంగా నిరసించింది. మంత్రి చెబుతున్న వన్నీ తప్పుడు మాటలు, అసత్యాలేనని తేల్చింది. ప్రత్యేక బ్యాంక్‌ ఖాతాతో పార్టీ ఏర్పాటు చేసిన వాయనాడ్‌ రిలీఫ్‌ ఫండ్‌కు ఉదారంగా విరాళాలివ్వా ల్సిందిగా ప్రజలకు పొలిట్‌బ్యూరో విజ్ఞప్తి చేసింది.
ఎస్‌సీ ఉప వర్గీకరణపై సుప్రీం తీర్పు
స్పష్టమైన మార్గదర్శక సూత్రాల ప్రాతిపదికన షెడ్యూల్డ్‌ కులాల ఉపవర్గీకరణపై ఏడుగురు సభ్యుల సుప్రీం కోర్టు ధర్మాసనం (6-1) ఇచ్చిన తీర్పును పొలిట్‌బ్యూరో స్వాగతించింది. అదే సమయంలో, ఎస్‌సీ, ఎస్‌టీల రిజర్వేషన్‌ పరిధిలోనే క్రీమీ లేయర్‌ను ప్రవేశపెట్టేందుకు పార్టీకి గల స్థిరమైన వ్యతిరేకతను పొలిట్‌బ్యూరో పునరుద్ఘాటించింది. తీర్పులో భాగంగా కాకపోయినా, ఏడుగురు న్యాయమూర్తుల్లో నలుగురు క్రీమీ లేయర్‌ను ప్రవేశపెట్టేందుకు విడివిడిగానైనా అనుకూలంగానే అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
మతోన్మాద పోకడలను దూకుడుగా అనుసరించడంపై
మోడీకి, బీజేపీకి భారత ప్రజలు ఈసారి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. దాంతో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. వాస్తవం ఇలా వున్నా, అంతా సర్వ సాధారణంగా వుంది అన్నట్లుగా మోడీ వ్యవహరిస్తున్నారు. బీజేపీ మెజారిటీ వున్న రాష్ట్రాల అసెంబ్లీల్లో మైనారిటీలను దారుణంగా లక్ష్యం చేసుకుంటూ కొత్త చట్టాలను రూపొందిస్తున్నారు. ఆ రకంగా మతోన్మాద పోకడలకు మరింత పదును పెడుతున్నారు. కన్వర్‌ యాత్రా మార్గంలో దుకాణాదారులు, వీధి వ్యాపారులు తప్పనిసరిగా తమ పేర్లు వున్న ఫలకాలను ప్రదర్శించాలని ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాలు ప్రకటించా యి. మైనారిటీలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా మతోన్మాద ధోరణులు పెచ్చరిల్లేలా చేయడం ఈ ఆదేశాల లక్ష్యంగా వుంది. అయితే ఈ ఉత్తర్వుల అమలుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కులాంతర, మతాంతర వివాహాలను లక్ష్యంగా చేసుకుంటూ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం చట్టవిరుద్ధమైన మతమార్పిడి (సవరణ) బిల్లు, 2024ను తీసుకువచ్చింది. ఇలాంటి వివాహాలు చేసుకున్నవారికి శిక్షను పదేండ్ల నుంచి యావజ్జీవం వరకు పెంచింది. అస్సాంలో, ముస్లిం లు, హిందువుల మధ్య ‘భూ జిహాద్‌’గా పేర్కొంటున్న భూమి క్రయవిక్రయాలను నివారించేందుకు చట్టాన్ని తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి అనుమతితోనే ఇటువంటి లావాదేవీలు జరగగలవు! యూపీ తరహాలోనే లవ్‌ జిహాద్‌గా పేర్కొనే మతాంతర వివాహాలకు యావజ్జీవ శిక్షను ప్రవేశపెట్టే యోచన చేస్తున్నారు. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం మహారాష్ట్ర ప్రత్యేక ప్రజా భద్రతా బిల్లును ప్రవేశపెట్టింది. పట్టణ ప్రాంత నక్సలిజాన్ని అణచివేసే పేరుతో అన్ని రకాల అసమ్మతులను నేరపూరితం చేయాలని ఈ బిల్లు కోరుతోంది. ఇది ఉపా కన్నా మరింత నిరంకుశమైనది.
24వ పార్టీ మహాసభ
తమిళనాడులోని మదురైలో వచ్చే ఏడాది ఏప్రిల్‌ 2 నుంచి 6 వరకు సీపీఐ(ఎం) 24వ పార్టీ మహాసభలను నిర్వహించేందుకు పొలిట్‌బ్యూరో ఆమోదం తెలియచేసింది.

Spread the love