అసంఘటిత రంగం అల్లకల్లోలం

The unorganized sector is in turmoil– వాస్తవాలను దాచిపెడుతున్న కేంద్ర ప్రభుత్వం
– మోడీ పాలనలో 63 లక్షల సంస్థలు క్లోజ్‌
న్యూఢిల్లీ: మోడీ పాలన అసంఘటిత రంగానికి నరకాన్ని చూపిస్తున్నది. ఈ రంగంపై ఆధారపడే లక్షలాది మంది ప్రజలు తమ ఉద్యోగాలను కోల్పోయి దిక్కుతోచని పరిస్థితుల్లో పడుతున్నారు. అలాగే, లక్షలాది సంస్థలు సైతం మూతపడ్డాయి. మోడీ సర్కారు అనాలోచిత, అస్తవ్యవస్థ ఆర్థిక విధానాల కారణంగానే ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రెడిట్‌ మార్కెట్‌ రేటింగ్‌ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్‌ ఈనెల 9న విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం.. భారత్‌లో 2015-16 నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరాల మధ్య దేశంలో 63 లక్షల అసంఘటిత రంగ సంస్థలు మూతపడ్డాయి. ఫలితంగా 1.6 కోట్ల ఉద్యోగాలు పోయాయి. నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను(జీఎస్టీ), కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఎదురైన షాక్‌ల కారణంగా ఇలాంటి తిరోగమన పరిస్థితులు ఏర్పడ్డాయి. నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆఫీస్‌ చేసిన అన్‌ఇన్‌కార్పొరేటెడ్‌ సెక్టార్‌ ఎంటర్‌ప్రైజెస్‌ వార్షిక సర్వే ఫలితాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఇండియా రేటింగ్స్‌ నివేదిక 2022-23 ఫలితాలను ప్రభుత్వ సర్వే చివరి రౌండ్‌లో నిర్వహించిన 2015-16తో పోల్చింది. ఇది ఏడేండ్ల వ్యవధిలో ఉద్యోగాల క్షీణతను చెప్పింది. అనధికారిక రంగంలో లక్షలాది మంది భారతీయులను స్వయం ఉపాధి, గిగ్‌ సెక్టార్‌లో ఉద్యోగాల వైపు నెట్టివేసే అవకాశం ఉన్నదనీ, వారు వ్యవసాయం వైపు తిరిగి వెళ్ళవలసి వచ్చిందనీ, దీని కారణంగా వేతనాల విషయంలో నాణ్యత క్షీణిస్తున్నట్టు నిపుణులు చెప్పారు. 2021-22లో 5.97 కోట్లుగా ఉన్న అసంఘటిత రంగంలోని సంస్థల సంఖ్య 2022-23 నాటికి 5.88 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటుతో 6.50 కోట్లకు పెరిగిందని తాజా ప్రభుత్వ సర్వేలోని ఫ్యాక్ట్‌ షీట్‌ చూపిస్తుంది. అదే సమయంలో, ఈ సంస్థల్లో కార్మికుల సంఖ్య 7.84 శాతం చొప్పున 9.78 కోట్ల నుంచి 10.96 కోట్లకు పెరిగింది. అయితే, విశ్లేషకులు, నిపుణుల ప్రకారం.. 2022-23 సంఖ్యలను 2015-16తో పోల్చినప్పుడు ఈ ఏడేండ్ల కాలంలో ఎంటర్‌ప్రైజెస్‌ల సంఖ్య 2.68 శాతం పెరిగి 6.33 కోట్ల నుంచి 6.50 కోట్లకు చేరుకోగా, కార్మికుల సంఖ్య 11.13 కోట్ల నుంచి 1.5 శాతం తగ్గి 10.96 కోట్లకు పడిపోయింది.
ఈ ఉద్యోగ నష్టాల ఫలితం ఏమిటి?
పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే 2017-18 నుంచి 2022-23 మధ్య సమాచారం ప్రకారం.. జీతభత్యాల ఉద్యోగాలలో ఉపాధి పొందుతున్న భారతీయుల వాటాలో క్షీణత కనిపించింది. ఉద్యోగాలు కోల్పోవటంతో కార్మికులు వ్యవసాయం, గృహౌపకరణాల రూపంలో స్వయం ఉపాధికి వెళ్ళవలసి వచ్చిందని బెంగళూరులోని అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, స్టేట్‌ ఆఫ్‌ వర్కింగ్‌ ఇండియా సహ రచయితలలో ఒకరైన రోసా అబ్రహం అన్నారు.
”ఈ రెండు సందర్భాల్లోనూ, చాలా మందికి జీతం లభించకపోవచ్చు. అసంఘటిత రంగంలో ఉద్యోగాలు తగ్గటానికి మరో కారణం ఏమిటంటే.. కార్మికులను నియమించుకునే సంస్థల వాటా 2015-16లో 15.8 శాతం నుంచి 2022-23 నాటికి 15 శాతానికి తగ్గింది. గత ఏడేండ్లలో ఏర్పాటైన అనేక కొత్త సంస్థల్లో ఉద్యోగాలు కల్పించటం లేదని ఇది తెలియజేస్తున్నదని రోసా అబ్రహం అన్నారు. 2022-23లో తయారీ రంగంలో కార్మికుల సంఖ్య 3.06 కోట్లుగా ఉండగా.. ఇది 2015-16లో 3.6 కోట్ల కంటే తక్కువగా ఉన్నదని ఇండియా రేటింగ్స్‌ నివేదిక పేర్కొన్నది. ఇటీవలి సంవత్సరాలలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి గిగ్‌ వర్క్‌ చాలా సులభమైన ఎంపికగా మారిందని అబ్రహం అన్నారు.
ముఖ్యంగా నగరాల్లో నివసించే వారికి, ఇది గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి తిరిగి వెళ్లడానికి సమానమనీ, ఎందుకంటే డెలివరీ వ్యక్తిగా ఉద్యోగం పొందడం చాలా సులభం, అలాంటి ఉద్యోగాలకు ఎక్కువ నైపుణ్యం లేదా శిక్షణ అవసరం లేదని చెప్పారు. తయారీ రంగంలో ఉపాధి తగ్గిపోవడం చాలా ఆందోళన కలిగించే విషయమని ఆర్థిక నిపుణులు చెప్పారు. కేవలం బడాపారిశ్రామికవేత్తలు, కార్పొరేట్‌ సంస్థల ప్రయోజనాలే లక్ష్యంగా మోడీ సర్కారు వ్యవహరించటంతో అసంఘటిత రంగం నిర్లక్ష్యానికి గురై, కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో మోడీ సర్కారు ఈ రంగానికి మరింత ప్రాధాన్యతను ఇవ్వాల్సినవసరం ఉన్నదని వారు నొక్కి చెప్తున్నారు.

Spread the love