ఉపా చట్టం తెలంగాణలో చెల్లదని ప్రకటించాలి!

నియంతృత్వ ప్రభుత్వాలకు కుట్ర సిద్దాంతాలంటే బాగా చాలా ఇష్టమని చెబుతుంటారు. ఎందుకంటే నిరసనను నేరమయమైనదిగా చూపించవచ్చు, తమ నేర స్వభావాన్ని సమర్ధించుకోవచ్చు. ప్రభుత్వాలను నడిపించే పెద్దల ప్రయోజనాలకు ప్రజా ప్రయోజనాలకు మధ్యన అవివార్యంగా తలెత్తే సంఘర్షణను అందరి దృష్టి నుండి తప్పించవచ్చు. చిన్న, చితక, పుల్ల, పరక అన్నింటినీ కట్టి ఒక మూలన పడేయవచ్చు, పైగా ఇదేమంత పెద్ద కష్టమైన విషయం కూడా కాదు. రాజ్యరక్షణలో నిమగమైన రక్షక భటులు కాస్త ‘అతి’గా రక్షణ కోసం పూనుకుంటే చాలు. కుట్రకేసులు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు.
ములుగు జిల్లా, పస్ర సర్కిల్‌లో తాడ్వాయి పోలీసు స్టేషన్‌లో నమోదయిన యఫ్‌ఐఆర్‌లో 152మంది మీద నమోదైన ఈ కుట్రకేసు ఇక నుంచీ ‘తాడ్వాయి కేసు’గా పిలవబడుతుందను కుంటాను. ఈ కేసును ఎత్తివేయాల్సిందిగా కోరుతూ ఏర్పాటైన ఫోరమ్‌ ఎగినెస్ట్‌ రిప్రెషన్‌లో మాట్లాడుతూ, పద్మజాషా ఇలా అన్నారు. బ్రిటిష్‌వారు ఆనాటి స్వాతంత్రయోధులపై చాలా కుట్ర కేసులు పెట్టేవారు. కానీ, వాటిల్లో ఎంతో, కొంత పాక్షిక నిజం అన్నా ఉండేది. ఇప్పటి పాలకులు పెడుతున్న కేసులలో కనీసం అది కూడా కన్పించటం లేదు నిజమే. ముజఫర్‌పూర్‌ కేసులో ఖుదీరాం బోస్‌, ఢిల్లీ కుట్రకేసులో రాస్‌బిహరీబోస్‌, పెషావర్‌ కుట్ర (1922) కేసులో ముజాహిర్లు కాన్పూర్‌ – బోల్షవిక్‌ (1924) కేసులో యం.ఎన్‌.రారు, డాంగే, అహ్మద్‌, ఇలా కొందరి కైనా ప్రమేయం ఉండింది.
కానీ ఇప్పటి కుట్రకేసులో ఇరికించ బడుతున్న నిందితుల నుంచి ఆమాత్రం ప్రమాదం కూడా పొంచి ఉఉందేమోనన్న అపోహ కూడా ప్రభుత్వాలకు ఉంటున్నదని అనుకోలేం. ఎందుకంటే ఏ క్రిమినల్‌ కుట్ర కేసులోనైనా ముందు నేరారోపణకు గురవుతున్న వారి మధ్య నేరానికి సంబంధించి ఒక పూర్వ అవగాహన, ఒప్పందం ఉండి తీరాలి. కేవలం ఉంటేనే సరిపోదు. అందుకు సంబంధించిన విధ్వంసకర పరిణామాలు జరిగి ఉండాలి లేదా జరుగుతూ ఉండాలి. నేటి తాడ్వాయి కేసులో ఆరోపణ ఏమిటంటే – ప్రభుత్వ అధికారులపై దాడులు చేయబూనటం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయటం, ఆదివాసీ, గిరిజన తెగల ప్రజలను నిషేదిత పార్టీలో సభ్యులుగా చేరమని బత్తిడి చేయటం, ప్రజలనుంచి బలవంతంగా చందాలు వసూలు చేయబూనటం – చిట్ట చివరగా, ప్రజా ప్రభుత్వాన్ని తుపాకులతో పడగొట్టాలనుకోవడం.
గమ్మత్తు ఏమిటంటే 1969లో పెట్టిన పార్వతీపురం కుట్ర కేసులో, నాగిరెడ్డి కుట్ర కేసులో, 1974లోని సికింద్రాబాద్‌ కుట్ర కేసులో, 1977లో చిత్తూరు కుట్రకేసులో, 1986లో రాంనగర్‌ కుట్ర కేసులో, 1992లో బెంగళూరు కుట్ర కేసులో సరిగ్గా ఇలాంటి ఆరోపణలే ఉన్నాయి. జనవరి 16, 1970 నాడు పార్వతీపురం తాలూకా, శ్రీకాకుళం జిల్లాలో నమోదయిన యఫ్‌.ఐ.ఆర్‌లో నూట నలభై ఎనిమిది మంది పేర్లు చేర్చబడినాయి. చారుమజుందార్‌, కాను సన్యాల్‌ల ప్రేరణతో వెంపటాపు సత్యం, చౌదరి తేజేశ్వరరావు వంటివారు ప్రభుత్వ అధికారులపై దాడికి సంకల్పించారనీ, ప్రభుత్వాన్ని హింసాత్మక
పద్ధతులలో పడగొట్టేందుకు ప్రయత్నిస్తు న్నారనే ఆరోపణలు. ఇవి ఇలా ఉండగానే, కేసు నడుస్తుండగానే, వెంకటాపు సత్యం, ఆదిబట్ల కైలాసం, డా|| చాగంటి భాస్కరరావు, సుబ్బారావు పాణిగ్రాహి, పంచాది కృష్ణమూర్తి, నిర్మల, గణపతి వంటి ఎందరో ”ఎన్‌కౌంటర్‌” పేరిట చనిపోయారు.
తాడ్వాయి కేసులో నిందితుల జాబితా పార్వతీపురం కుట్ర కేసులో సంఖ్య కంటే పెద్దది. కేసు 2022 లోనే నమోదయినా, ప్రస్తుతానికి డెమోక్లియస్‌ కత్తిలా అలా వేలాడబడి వుంది. ఎప్పుడు నిందితుల మెడల మీదికి దించాలో చెప్పాల్సిన రాజకీయ నిర్ణయం జరిగినట్లు లేదు. ఈ కేసు నమోదయిన తర్వాత నిందితులు ఒకర్ని ఒకరు పరిచయం చేసుకున్నారు. 42వ నిందితుడిని కన్వీనర్‌గా ప్రకటించుకున్నారు. ఇంతమంది నిందితుల్ని కలిపిన నేరం కచ్చితంగా తాడ్వాయి కేసుదే. అయితే అందర్నీ కలుసుకోలేరు వాళ్ళు, కొందరు ఇప్పటికే చనిపోయారని చెబుతున్నారు. సుధా భరద్వాజ్‌ లాంటి వాళ్ళు ఎల్గార్‌ పరిషత్‌ కేసులో, కండీషన్‌ బెయిల్‌పై ఉన్నారు కనుక ఇక్కడికి రాలేరు.
సైద్ధాంతిక భేదాభిప్రాయాలు ఉన్న వాళ్ళను కూడా ఒకే గ్రూపులోకి చేర్చడం కూడా ఈ కేసు మహిమే విమలక్క, సంధ్యలు వేర్వేరు. మావోయిస్టు సభ్యులు పూర్తిగా వేరు. చాలామంది న్యాయవాదులు పొద్దున లేస్తే న్యాయ దేవత ముందు హాజరు వేయించుకునే వారు. కన్నాభిరాన్‌ సజీవుడై ఉండి ఉంటే ఆయన తప్పకుండా ఈ కేసులో ఉండేవారు. ప్రాసిక్యూటర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూటర్స్‌గా పేరు గాంచిన కన్నాభిరాన్‌ పాత కుట్ర కేసులన్నిటినీ వాదించే అవకాశం, గెలిచే సులువు దొరికినాయి కానీ, ఇప్పుడైతే తాడ్వాయి కేసులో కచ్చితంగా ఆయన కూడా ఒక నంబర్‌ అయివుండే వాడనిపిస్తోంది. ఒకానొక కుట్ర కేసులో జస్టిస్‌ రావు, కన్నా భిరాన్‌తో ”రాజ్యంలో నమ్మకం లేని వాళ్ళు కోర్టులో ‘రిట్‌’ వేయటం ఎందుకని” ప్రశ్నించారు. దానికి కన్నాభిరాన్‌ బదులిస్తూ ‘ఇక్కడ, ఈ కోర్టులో వారి విలువలు గావు పరీక్షంపబడేది – మీ విలువులు పరీక్షకు గురవుతాయి’ అని ధైర్యంగా, బంతిని అవతలి కోర్టులోనికి నెట్టివేశారు. సిసిఫస్‌లా పోరాడుతూనే ఉన్నారు జీవితమంతా.
ఇప్పుడు ప్రొ|| హరగోపాల్‌పై , పద్మజాషాపై, గడ్డంలక్ష్మణ్‌ల పై కేసులు ఎత్తివేశారని తెలిసింది. వీళ్ళ మీదనే ఎందుకు ఎత్తివేశారో తెలియదు. ఒక పోలీస్‌ ఆఫీసర్‌ చమత్కరించినట్లు ‘ఉపా’ కేసు మంత్రించి వదిలిన తర్వాత, తానే వెనక్కి తీసుకోలేని ఆదిపురుష్‌ బాణమా? ఇప్పటి వరకూ కుట్ర కేసులలో శిక్షలు పడటం చాలా అరుదు. కోర్టులకు వెళ్ళడం, న్యాయవాదుల ఖర్చులు ఉచ్ఛరించడం, ఇందుకోసం ఇల్లు, ఒళ్ళు గుల్ల చేసుకోవడం, ఇంకెప్పుడూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడకుండా ఉండటం, అంత సమయం మిగలకుండా ఉండటం – ఇవే నిందితులు ఎదుర్కొనే శిక్షలు. వీరిని చూసి మిగతా పౌరులు ” భద్రలోగ్‌ ” లాగా భయభక్తులతో బ్రతకడం జరిగి తీరాలి. అందునా ‘ఉపా’ కేసు మరింత కఠినతరం. బెయిల్‌ దొరక్కుండా సంవత్సరాలపాటు విచారణ ఖైదీలుగా గడపాల్సి వస్తుంది. పౌరులను ప్రజాస్వామ్య ప్రక్రియలో లేకుండా చేయడం ఇలా తేలిగ్గా సాధ్యమవుతుంది. అందుకేనేమో కేసును పూర్తిగా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు లేరు. మిగతా వారందరిపై కేసు నడవబోతున్నట్లే కన్పడుతోంది. చాలామంది కేంద్ర ప్రభుత్వం సంధించిన లక్ష్యమేమోనని మొదట్లో భావించారు. తీరా తెలంగాణ ప్రభుత్వందే ఈ పుణ్యమంతా అని తెలిసి చాలామంది నివ్వేరపోయారు. నిన్న గాక మొన్న ఆకాశమంత అంబేద్కర్‌ విగ్రహాన్ని నిలబెట్టాం. అంబేద్కర్‌ సెక్రటేరియట్‌ కట్టుకున్నాం. మన రాజ్యాంగానికి ప్రజాస్వామ్యం ఆక్సిజన్‌. ప్రజాస్వామ్యమంటే ప్రజలు చైతన్యవంతులుగా, తమ నిర్ణయాలు తాము తీసుకునే అధికారం ఉందని తెల్సిన వారిగా, ప్రజాస్వామ్య ప్రస్ధానంలో భాగం పంచుకోవటం. విభేదించడం, సంఘాలు నిర్మించుకోవడం, హక్కులుగా వాడుకోవడం. పౌర అభ్యసనం అంటే రాజ్యాంగ ప్రవేశికను నెమరు వేయటం కాదు గదా! ఎవరు సంకెళ్ళు వేసినా తెంచివేయడమే ప్రజాస్వామ్యం కదా!
కేంద్ర ప్రభుత్వ అసహనంపై, అప్రజా స్వామిక విధానాలపై పోరాటం సాగించే వారిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కేసును ఇంకా కొందరిపై నడపడం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. మినహాయింపులు లేకుండా కేసును మూసి వేయడం, ‘ఉపా, దేశ ద్రోహనేరం లాంటి చట్టాలను నా మ్యానిఫెస్టోలో చోటు లేదని’ తక్షణమే ప్రకటించటమే ప్రభుత్వానికి గౌరవం – అది బాధ్యత కూడా.
– ఐ.వి. రమణారావు, 9848809990

Spread the love