నవతెలంగాణ – వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత నివాసం పొందుతున్న గ్రీన్‌కార్డుదారులకు అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ పర్మనెంట్ రెసిడెంట్ కార్డుల వ్యాలిడిటీ కాలాన్ని మరింత పొడిగించింది. గతంలో గ్రీన్‌కార్డు గడువు తీరినప్పటికీ .. మరో 24 నెలల పాటు దాని వ్యాలిడిటీ పొడిగించేవారు. ఇప్పుడు దీన్ని 36 నెలలకు పెంచినట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ వెల్లడించింది. దీంతో గ్రీన్‌కార్డు రెన్యువల్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఊరట లభించినట్లైంది. సాధారణంగా అమెరికాలో గ్రీన్‌కార్డులు పొందినవారు ప్రతీ పదేళ్లకోసారి రెన్యువల్ చేసుకోవాలి. ఇందుకోసం కార్డు గడువు తీరిపోయే కాలానికి ఆరు నెలల ముందే ఐ-90 ఫామ్‌ను సమర్పించాలి. రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి కార్డు వ్యాలిడిటీని 24 నెలలు పొడిగిస్తూ రిసీట్ నోటీసు ఇస్తారు. దీంతో గ్రీన్‌కార్డు గడువు తీరిపోయినా.. ఈ నోటీసుతో వారికి చట్టబద్ధమైన నివాస హోదా కొనసాగుతుంది. కొత్త కార్డు జారీ అయ్యే వరకు ఉద్యోగాలు, ప్రయాణాల సమయంలో వారు దాన్ని లీగల్ స్టేటస్ ప్రూఫ్‌గా వినియోగించుకోవచ్చు.