న్యూఢిల్లీ: జీఎస్టీ ఎగవేతల విలువ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2.01 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇందుకు సంబంధించి 6,084 కేసులను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) గుర్తించింది. ఆన్‌లైన్ గేమింగ్, బీఎఫ్‌ఎస్‌ఐ, ఇనుము, రాగి, స్క్రాప్ విభాగాల్లో అత్యధిక ఎగవేతలు నమోదయ్యాయని డైరెక్టరేట్ వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 4,872 కేసులు నమోదు కాగా, ఎగవేతల విలువ రూ.1.01 లక్షల కోట్లుగా ఉంది. డీజీజీఐ వార్షిక నివేదిక ప్రకారం… పన్ను చెల్లించకపోవడానికి సంబంధించిన ఎగవేత కేసుల్లో 46 శాతం రహస్యంగా సరఫరా, తక్కువ మూల్యాంకనం, 20 శాతం నకిలీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌కు (ఐటీసీ) సంబంధించినవి కాగా 19 శాతం ఐటీసీని తప్పుగా పొందడం, రివర్సల్ చేయకపోవడం వంటివి ఉన్నాయి. 2023-24లో ఆన్‌లైన్ గేమింగ్ రంగంలో 78 కేసుల్లో గరిష్టంగా రూ.81,875 కోట్ల ఎగవేత జరిగింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగం 171 కేసుల్లో రూ.18,961 కోట్ల ఎగవేతలను నమోదు చేసింది.