రోడ్డుపైనే ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని నిలదీసిన కూతురు..వీడియో వైరల్

నవతెలంగాణ-హైదరాబాద్ : జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై ఆయన కుమార్తె భవాని ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సిద్దిపేట జిల్లా చేర్యాలలో తన పేరిట ఉన్న భూమిని తన తండ్రి ముత్తిరెడ్డి తన పేరు మీదికి మార్చుకున్నాడని , తన సంతకాన్ని ఫోర్జరీ చేశాడని ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే ఆ భూమి తన కూతురి పేరు పైనే ఉందని.. ఎటువంటి ఫోర్జరీ జరగలేదని ఆయన పేర్కొన్నారు. అయితే తాజాగా ముత్తిరెడ్డిని ఆయన కూతురు మరోసారి నిలదీశారు. సోమవారం జనగామ జిల్లా చీటకోడూరులో పర్యటిస్తున్న ఎమ్మెల్యే వద్దకు చేరుకున్న తుల్జా భవాని అందరి ముందే తన తండ్రితో వాగ్వాదానికి దిగింది. తనకు ఇచ్చిన ఆస్తులను అక్రమంగా తండ్రి లాక్కుంటున్నారంటూ ఆరోపించింది. దీంతో తండ్రి కూతుర్లు వాగ్వాదం చేసుకుంటున్నా వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ విషయంపై మరోసారి స్పందించారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి. తన కూతురిని రాజకీయ ప్రత్యర్థులు తప్పుదోవ పట్టించారని అన్నారు. తన కుటుంబ సమస్యలను ప్రత్యర్థులు పావుగా వాడుకుంటున్నారని విమర్శించారు. ఇంటి సమస్యను రాజకీయం చేయడం సరికాదని హితవు పలికారు.

Spread the love