నవతెలంగాణ – హైదరాబాద్
ఓ కాంట్రాక్టర్ నిర్మించిన తారు రోడ్డును గ్రామస్థులు ఉత్త చేతులతో కార్పెట్లా అమాంతంగా లేపేసి.. రోడ్డు నాణ్యత ఏపాటిదో కళ్లకు కట్టినట్టు అందరికీ చూపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను ఇప్పుడు ఊపేస్తుంది. మహారాష్ట్రలోని జల్నా జిల్లా అంబాద్ తాలూకాలోని కర్జాత్-హస్త్ పోఖరీలో ఈ రోడ్డును నిర్మించారు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎం రూరల్ రోడ్ స్కీమ్)లో భాగంగా ఈ రోడ్డును నిర్మించారు. రోడ్డును వేసింది స్థానిక కాంట్రాక్టర్ రాణా ఠాకూర్. వీడియో వైరల్ అయిన తర్వాత కాంట్రాక్టర్ స్పందించాడు. రోడ్డు నిర్మాణానికి జర్మన్ సాంకేతికతను ఉపయోగించినట్టు పేర్కొన్నాడు. రోడ్డును చేత్తో అమాంతం లేపేసిన గ్రామస్థులు ఈ నాసిరకం రోడ్డుకు అప్రూవల్ ఇచ్చిన ఇంజినీర్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.