సైన్యం ఆహ్వానం మేరకే మణిపూర్‌ పర్యటన

నవతెలంగాణ – న్యూఢిల్లీ : ప్రాంతీయ మీడియా ‘అనైతిక, పరోక్ష రిపోర్టింగ్‌’ను నిష్పక్షపాతంగా సమీక్షించడానికి సైన్యం సూచనపై తమ బృందం మణిపూర్‌లో పర్యటించించిందని ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా (ఇజిఐ) సోమవారం సుప్రీం కోర్టుకు తెలిపింది. ”మా అంతట మేముగా అక్కడకు వెళ్లలేదు. అక్కడ పర్యటించాల్సిందిగా సైన్యం మమ్మల్ని ఆహ్వానించింది. సైన్యం నుంచి మాకు లేఖ అందింది.” అని ఇజిఐ తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్‌ ముందు ఇజిఐ తరపున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ తన వాదనలు వినిపించారు. ఎడిటర్స్‌ గిల్డ్‌ మణిపూర్‌ వెళ్లాలని సైన్యం ఎందుకు కోరుకుంది? అంటూ ప్రధాన న్యాయమూర్తి విస్మయం వ్యక్తం చేశారు. ”క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోందో నిష్పక్షపాతంగా అంచనా వేయాల్సిందిగా వారు మమ్మల్ని కోరారు. మేం మా నివేదికను ఈ నెల 2న ప్రచురించాం. ఈ నెల 3వ తేదీ రాత్రి ఐపిసి కింద నమోదైన నేరాలకు మమ్మల్ని ప్రాసిక్యూట్‌ చేశారు. ముఖ్యమంత్రి కూడా మాకు వ్యతిరేకంగా ప్రకటన చేశారు. ఒక నివేదికను ప్రచురించినందుకు మమ్మల్ని ఎలా ప్రాసిక్యూట్‌ చేస్తారు?” అని సిబల్‌ కోర్టును ప్రశ్నించారు. ”ఎడిటర్స్‌ గిల్డ్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదైన కేసు ఇది. వారి అభిప్రాయం తెలియజేస్తూ నివేదికను మాత్రమే ఇచ్చారు. అంతేకానీ వారు నేరం చేయలేదు.” అంటూ మణిపూర్‌ ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాకు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ స్పష్టం చేశారు. ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేయాలని కోరుతూ మణిపూర్‌ హైకోర్టుకు బదులుగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడానికి ఇజిఐని అనుమతించాలని సిబల్‌ చేసిన అభ్యర్ధనను పరిశీలించాలని కూడా ప్రధాన న్యాయమూర్తి నిర్ణయించారు. దీనిపై ఈ నెల 15న విచారణకు కేసును వాయిదా వేశారు. ఆలోగా జర్నలిస్టులను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలంటూ ఈ నెల 6న ఇచ్చిన ఉత్తర్వులను పొడిగించారు. ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేయలేం కానీ ఢిల్లీ హైకోర్టు విచారించాలన్న పిటిషన్‌ను పరిశీలిస్తామని చంద్రచూడ్‌ చెప్పారు.

Spread the love