నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని రైతులకు వరప్రసాదమైన లక్నవరం చెరువు నీటిమట్టం సోమవారానికి 15 అడుగులకు చేరింది. ఈ చెరువు పూర్తిస్థాయి నీటిమట్టం 33 అడుగులు కాగా ప్రస్తుతం 15 అడుగులకు చేరుకున్నట్లుగా నీటిపారుదల శాఖ అధికారులు తెలుపుతున్నారు. వర్షాలు ఇంకా కొనసాగుతున్నందున వరద ప్రవాహంతో నీటిమట్టం పెరిగే అవకాశాలు ఉన్నాయని రైతులు అంటున్నారు. మరో మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయి అన్న వాతావరణ శాఖ వార్తా ప్రకటనలతో మరింత నీరు చేరుతుందన్న ఆశాభావాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. మరో పది అడుగుల నీరు చేరితే వర్షాకాలం పంటకు డొకా ఉండదని రైతులు అభిప్రాయపడుతున్నారు. గత కొద్ది రోజుల క్రితం ఈసారి చెరువు నిండుతుందా నిండదా అన్న బెంగతో ఉన్న రైతులు ఇప్పుడు ఒకింత సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. వాతావరణం కూల్ గా ఉండడం దానికి తోడుగా వర్షాలు పడుతుండడంతో ఎలాగైనా చెరువులోకి నీరు వచ్చి చేరుతుందని వర్షాకాలం పండుతుంది అన్న ఆశతో రైతాంగం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దెయ్యాల వాగు గుండ్ల వాగు పరివాహక ప్రాంతాల్లో వాగులు ఒర్రెల వెంట బోరు బావుల వెంట రైతులు వరినాట్లను ప్రారంభించారు. ఈసారి కూడా చెరువు నిండుతుంది అన్న ధైర్యంతో రైతులు ఉన్నారు.