– మేడిగడ్డ కుంగిన ఫలితం
– ఆరు రోజుల్లో 73 టీఎంసీలు సముద్రంలోకి..
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి వరద ప్రవాహం భారీగా వచ్చి చేరుతున్నది. తెలంగాణతో పాటు మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎగువ ప్రాంతం నుంచి ఎక్కువగా వరద వస్తున్నది. మేడిగడ్డ బ్యారేజీలో ఏడో బ్లాక్‌లోని పిల్లర్లు గతేడాది అక్టోబర్‌లో కుంగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ప్రాజెక్టుకు ముప్పు ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) హెచ్చరించింది. ఈ బ్యారేజీ వద్ద నీటిని నిల్వ చేయకూడదని ఎన్డీఎస్‌ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని రెండు నెలల క్రితమే అప్రమత్తం చేసింది. బ్యారేజీలో నీటి నిల్వ చేయరాదని ఎన్డీఎస్‌ఏ చేసిన సూచనల మేరకు 85 గేట్లు ఎత్తి ఉంచారు. దీంతో వచ్చిన వరద నీరు వచ్చినట్టుగా మేడిగడ్డకు దిగువకు తరలిపోతున్నది. ప్రస్తుతానికి ఇక్కడ ఒక్క బొట్టు నీటిని కూడా నిల్వ చేసే పరిస్థితులు లేవు. ఈ బ్యారేజీ దెబ్బతిని ఇప్పటికే దాదాపు తొమ్మిది నెలలైంది. ఈ మధ్య వ్యవధిలో గోదావరిలో చెప్పుకోదగ్గ నీటి ప్రవాహం రాలేదు. గత ఐదు రోజులుగా భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద పోటెత్తింది. శుక్రవారం సాయంత్రానికి మేడిగడ్డ వద్ద ప్రవాహ ఉధృతి 3,10,080 క్యూసెక్కులకు చేరుకోగా, శనివారం ఉదయం 3,84,400 క్యూసెక్కులకు పెరిగింది. క్రమంగా శనివారం సాయంత్రానికి వరద కొంత మేరకు తగ్గుముఖం పట్టింది. మేడిగడ్డకు ఎగువన ఉన్న అన్నారం బ్యారేజీ వద్ద కూడా ప్రవాహం పెరిగింది. 12,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంటే.. అక్కడ కూడా నీటిని నిల్వ చేయరాదని ఎన్‌డీఎస్‌ఏ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అందుకే ఈ బ్యారేజీలోనే 66 గేట్లు ఎత్తి ఉంచారు. దీంతో వరద నీరు వచ్చినట్టు వచ్చి కిందికి తరలిపోతున్నది. ఈనెల 15 నుంచి శనివారం వరకు మేడిగడ్డ ప్రవాహం రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నది. అత్యధికంగా ఈనెల 18న 53,400 క్యూసెక్కుల వరద వచ్చింది. దాదాపు ఆరు రోజులుగా సుమారు 73 టీఎంసీలు సముద్రంలోకి కలిసిసోయాయి. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) సమాచారం ప్రకారం కాళేళ్వరం ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు రూ. లక్ష కోట్ల వరకు ఖర్చుపెట్టారు. ఇంకా రూ.47.4 వేల కోట్లు అవసరమని భావిస్తున్నారు. డీపీఆర్ ప్రకారం వాస్తవ ఖర్చు రూ.86,788.06 కోట్లు. ఇందులో రూ.55,807.86 కోట్లు బడ్జెటేతర నిధులు వ్యయం చేశారు. మిగతావన్నీ కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా వాణిజ్య బ్యాంకుల నుంచి నిధులను రుణాల రూపేణా సమకూర్చుకున్నారు. లక్ష కోట్లు కాళేశ్వరం నీళ్లల్లో కొట్టుకుపోయాయని నీటిపారుదలరంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. బీఆర్‌ఎస్ సర్కారు హయాంలో ప్రాజెక్టు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ, చిత్తశుద్ధి తో నిర్మించలేదనే చెబుతున్నారు. అవినీతి, అక్రమాల నేపథ్యంలోనే మేడిగడ్డ కుంగిపోయిందని అంటున్నారు.
మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు వేర్వేరు కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చారు. ఇందులో ప్రధాన పనులు చేసింది మాత్రం మేఘా ఇంజినీరింగ్ సంస్థనే. అలా కాంట్రాక్టులు దక్కించుకున్న బడా సంస్థలు సుమారు 56 చిన్న చిన్న కంపెనీలకు సబ్‌కాంట్రాక్టులు ఇచ్చినట్టు ఇటీవల న్యాయవిచారణ కమిషన్ తేల్చిన విషయమూ విదితమే. పనుల నాణ్యత దెబ్బతిందనే విమర్శలు గతం నుంచే ఉన్నాయి. అలాగే డీపీఆర్, డిజైన్ల స్థాయిలోనే అడ్డగోలు వ్యవహారం నడిచిందనే అరోపణలు వచ్చాయి. ఎన్‌డీఏస్‌ఏ చెప్పిన మేరకు తాత్కాలిక మరమ్మతులు చేసినా పెద్దగా ప్రయోజనం లేదు. దీనికి 73 టీఎంసీలు సముద్రం పాలు కావడమే ఇందుకు నిదర్శనం.