వాయనాడ్‌ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలి

వాయనాడ్‌ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలి– లోక్‌సభలో రాహుల్‌ గాంధీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేరళ వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటిం చాలని ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ లోక్‌సభలో డిమాండ్‌ చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేటాయించిన పరిహారం పెంచాలని, సమగ్ర పునరావాస ప్యాకేజీని ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. వాయ నాడ్‌ విపత్తు అంశాలపై బుధవారం లోక్‌సభలో జీరో అవర్‌లో రాహుల్‌గాంధీ ప్రస్తావించారు. వాయనాడ్‌ బాధితులను ఆదుకునేందుకు వివిధ వర్గాలు ముందుకు రావడం హర్షణీయమన్నారు. ఇటీవల తన సోదరి ప్రియాంకా గాంధీతో కలిసి వాయనాడ్‌లో పర్యటించినట్టు తెలిపారు. అక్కడ భయంకరమైన విధ్వంసాన్ని, జనాల బాధలను కళ్లారా చూశామన్నారు. కొండచరియలు విరిగిపడి రెండుకిలోమీటర్ల వరకు రాళ్లకుప్పలే దర్శనమిచ్చాయని తెలిపారు. విపత్తులో 300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని, పెద్దసంఖ్యలో జనం గల్లంత య్యారని అన్నారు. సంఘటనా స్థలంలో సేవలందిస్తున్న రెస్క్యూ సిబ్బందిని అభినందించారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు అందిస్తున్న సహాయాన్ని సైతం ప్రశంసించారు. కొండచరియలు విరిగిపడడంతో ప్రధాన రహదారి తెగిపోయిందని, దాంతో ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవడంలో రెస్క్యూ బృందాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయన్నారు. అయితే ఈ విపత్తులో చాలా సందర్భాలలో కుటుంబంలోని ఒక సభ్యుడు మాత్రమే ప్రాణాలతో బయటపడడం చాలా బాధాకరమన్నారు.

Spread the love