– బ్రిటీష్ కాలం నాటి కంటే ఎక్కువ అసమానతల
– మోడీ పాలనలో దారుణ పరిస్థితులు
– అగమ్యగోచరంగా పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలు
– ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు, సామాజికవేత్తల ఆందోళన
భారత్ స్వాతంత్య్రం సాధించి 75 ఏండ్లు గడిచింది. ప్రజల జీవితాల్లో మాత్రం ఆశించిన మార్పు రాలేదు. ముఖ్యంగా, కేంద్రంలో మోడీ సర్కారు 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో పరిస్థితులు దారుణంగా మారాయని ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు, సామాజికవేత్తలు అంటున్నారు. ఆర్థికాభివృద్ధి మేడిపండు చందంగా తయారైందని చెప్తున్నారు. సంపన్నులు మరింత సంపన్నులుగా అందనంత స్థాయికి ఎదుగుతున్నారనీ, పేదలు మాత్రం మరింత పేదరికంలోకి కూరుకుపోతున్నారని అంటున్నారు.
ఇక మధ్యతరగతి ప్రజల బాధలు ముందు నుయ్యి, వెనక గొయ్యిలా మారాయని వివరిస్తున్నారు. బ్రిటీషు కాలం నాటి పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుత భారతంలోనే అసమానతలు ఇంకా ఎక్కువగా ఉన్నాయంటూ పలు గణాంకాలు, నివేదికలను వారు ఉటంకిస్తున్నారు.
న్యూఢిల్లీ : ప్రపంచంలో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఐదో స్థానంలో ఉన్నదని మోడీ ప్రభుత్వం చెప్తున్నది. తమ పాలనలో భారత్ సాధించిన ఘనతగా దీనిని బీజేపీ ప్రచారం చేసుకుంటున్నది. అయితే, దేశంలో సంపద మాత్రం కొద్ది మంది చేతుల్లోనే పోగై ఉన్నదనీ, పేద, మధ్య తరగతి ప్రజలు ఇప్పటికీ ఆర్థిక అసమానతలను ఎదుర్కొంటున్నారని ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా, 2014లో కేంద్రంలో మోడీ సర్కారు కొలువైనప్పటి నుంచి పదేండ్లలో దేశంలో దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయని వారు చెప్తున్నారు. అంబానీలు, అదానీలు ఒకరితో ఒకరు పోటీపడి ప్రపంచ సంపన్నులుగా ఎదుగుతున్నారనీ, పేద, మధ్య తరగతి ప్రజలు మాత్రం కనీసం ఆదాయం లేక విలవిలలాడుతున్నారని అంటున్నారు. మోడీ పాలనలో పెరుగుతున్న ఆహార ద్రవ్యోల్బణం, ధరలు, నిరుద్యోగం వంటి అంశాలు సామాన్య ప్రజలకు శాపంగా మారాయని నిపుణులు, విశ్లేషకులు చెప్తున్నారు. ఇవన్నీ చూస్తే.. స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీషు కాలంలో ప్రజలు అనుభవించిన అసమానతల కంటే మోడీ పాలనలోనే అసమానతలు అధికంగా ఉన్నాయని వారు విశ్లేషిస్తున్నారు.
అవినీతిని రూపుమాపుతాననీ, నల్లధనాన్ని తీసుకొస్తాననీ, నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తానని హామీలు గుప్పించి 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ.. బడా వ్యాపారవేత్తలు, కార్పొరేట్లకు దాసోహమన్నారని చెప్తున్నారు. వారికి అనుకూలంగా చట్టాలు తేవటం, సవరణలు చేయటం, పాలసీలు ప్రవేశపెట్టటం జరుగుతున్నదని అంటున్నారు. మోడీ పదేండ్ల పాలనలో పరిస్థితులు ఏమీ మారలేదనీ, దేశంలో ధనిక, పేదల మధ్య అంతరం అధికంగా ఉన్నదని ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
భారత్‌లో ఆదాయం, సంపదల్లో అసమానతలు ప్రపంచంలోనే అత్యధికం. ఇది బ్రెజిల్, దక్షిణాఫ్రికా, యూఎస్‌ల కంటే అధ్వాన్నంగా ఉన్నదని ప్రపంచ అసమానత ల్యాబ్ (డబ్ల్యూఐఎల్)కొత్త అధ్యయనం వెల్లడించింది. ఇటీవల ప్రచురితమైన ‘ది రైజ్ ఆఫ్ ది బిలియనీర్ రాజ్’లోని పరిశోధన దేశంలో ఆదాయ అసమానత వాస్తవానికి బ్రిటిష్ వలస పాలనలో ఉన్నదానికంటే దారుణంగా ఉన్నదని చూపిస్తున్నది. భారత్‌లో పెరుగుతున్న సంపద అంతరం రాజకీయంగా చర్చకు దారి తీసింది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ.. మోడీ పాలనలో సాంప్రదాయకంగా వెనుకబడిన వర్గాలు ఎంతగా నష్టపోయాయో తెలియజేస్తూ కుల గణనను నిర్వహిస్తామని హామీ ఇచ్చిందని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
1930లలో చాలా వరకు బ్రిటిష్ వారు భారతదేశాన్ని పాలించినప్పుడు ధనవంతులైన 1 శాతం మంది.. జాతీయ ఆదాయంలో కేవలం 20 శాతం కంటే ఎక్కువ మాత్రమే కలిగి ఉన్నారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఆ వాటా పడిపోయింది. 1940లలో అది సుమారుగా 10 శాతానికి చేరుకున్నది. 1947లో భారత్ స్వాతంత్య్రం పొందినప్పుడు అది దాదాపు 12.5 శాతానికి చేరుకున్నది. ఇది 1960ల చివరి వరకు అలాగే కొనసాగింది. అప్పటి ప్రభుత్వాలు భారత్‌లో కొంతమేర సోషలిస్టు ఎత్తుగడలను అమలు చేయటంతో ఆర్థిక పరిస్థితులు కుదుటపడ్డాయి. అధికారిక రాచరిక రాజ్యాలకు చెల్లించే చెల్లింపులు రద్దయ్యాయి. బ్యాంకులు జాతీయం చేయబడ్డాయి. టాప్ 1 శాతం మంది ధనికుల్లో జాతీయ ఆదాయం వాటా 1982 నాటికి దాదాపు ఆరు శాతానికి పడిపోయింది.
1991లో భారత్ తన ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేయటంతో పరిస్థితులు మారడం ప్రారంభించాయి. 2000 ఏడాది చేరటానికి టాప్ 1 శాతం మంది.. భారతదేశ ఆదాయంలో 15 శాతానికి పైగా కలిగి ఉన్నారు. 2014లో మోడీ అధికారంలోకి వచ్చేసరికి 20 శాతం దాటటం గమనార్హం. 2022-2023 నాటికి, ఇది అధికంగా 22.6 శాతానికి చేరుకున్నదని ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఈ గణాంకాలు.. మోడీ సర్కారు సంపన్నుల కోసం ఎంత కష్టపడుతున్నదోనన్న దృగ్విషయాన్ని వెల్లడిస్తున్నదనీ, పేదలు, మధ్య తరగతి పట్ల ప్రభుత్వానికి ఉన్న ఉదాసీన వైఖరిని స్పష్టం చేస్తున్నదని విశ్లేషకులు చెప్తున్నారు. దీంతో, పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలు అగమ్య గోచరంగా మారాయని అంటున్నారు. రాబోయే ఎన్నికల్లోనైనా ప్రజలు ఆలోచించి ఓటు వేసి.. తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సామాజికవేత్తలు సూచిస్తున్నారు.