– పారామెడికల్ విద్యార్థిని జుట్టు పట్టుకుని దాడి
నవతెలంగాణ-సూర్యాపేట కలెక్టరేట్
బీసీ బాలికల సంక్షేమ వసతి గృహంలో ఓ విద్యార్థిని గుడ్ ఈవినింగ్ చెప్పలేదని.. సంక్షేమ శాఖ అధికారిణి విచాక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటన సూర్యాపేటలోని వసతి గృహంలో జరిగింది. శుక్రవారం సాయంత్రం బీసీ సంక్షేమ శాఖ అధికారి అనసూయ హాస్టల్ విజిట్‌కి వచ్చారు. ఆ సమయంలో పారామెడికల్ మొదటి సంవత్సరం విద్యార్థిని మొబైల్ చూస్తూ అధికారి వచ్చింది గమనించలేదు. దాంతో ఆగ్రహానికి గురైన అధికారిణి ‘నేను వచ్చినా చూడవా.. నమస్కారం పెట్టవా” అంటూ విద్యార్థిని జుట్టు పట్టుకొని విచక్షణారహితంగా చితకబాదారు. తోటి విద్యార్థులు వద్దని వారించారు. పక్కన రూమ్‌లో ఉన్న వార్డెన్ వచ్చి ఆ అధికారిణి అక్కడి నుంచి తీసుకెళ్లారు. గాయపడిన విద్యార్థినిని సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన చేపట్టాయి. విద్యార్థినిపై దాడి చేసిన బీసీ సంక్షేమ శాఖ అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.