– నెల్లూరు నరసింహారావు
బ్రిక్స్ : దేశాల(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) గ్రూప్ లోని మిగిలిన దేశాలు చైనాకు ‘సామంత రాజ్యాలు’గా మారే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయని, అవి పూర్తిగా చైనా ఆర్థిక ఆధిపత్య ప్రాబల్యానికి లోనుకానున్నాయని పశ్చిమ దేశాల నిష్ణాతులు వాదిస్తున్నారు. అమెరికాకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో ఈ దేశాలను చైనా పావులుగా ఉపయోగించనున్నదని ఇటీవల ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక ప్రచురించిన ఒక వ్యాసంలో వాదించటం జరిగింది. ‘సంపన్న ప్రపంచాన్ని’ ప్రతిఘటించటం కోసమే బ్రిక్స్ నిర్మాణం జరగుతున్నదని ఆ వ్యాస రచయిత పేర్కొన్నాడు.
ఇటువంటి వ్యాఖ్యానాలు, అవగాహన బ్రిక్స్ ని, దాని లక్ష్యాలను అర్థం చేసుకోవటంలో విఫలమౌతున్నాయి. తటస్థంగావున్న దేశాలను, పశ్చిమ దేశాలతో సత్సంబంధాలను కలిగిన దేశాలను చైనా తనకు అనుకూలంగా మార్చుకుంటుందనే ఆరోపణ అసలు విషయాన్ని మరుగుపరుస్తున్నాయి. గ్లోబల్ సౌత్ లోగల దేశాల అభివృద్ధి సంబంధిత ప్రయోజనాలను నెరవేర్చే వేదికగా బ్రిక్స్ రూపొందుతోంది. ఇది భావజాలపరమైన లేక సైనిక కూటమి కాదు. అయితే ఈ బ్రిక్స్ దేశాలు తమ అభివృద్ధి కోసం బహుళ ద్రువ వాతావరణంలో, పశ్చిమ దేశాల వ్యూహాత్మక నమూనాల పరిధిని అధిగమించి, భావజాల షరతులను పట్టించుకోకుండా ముందుకు సాగేందుకు కావలసిన రాజకీయ స్థలాన్ని సృష్టించుకునేందుకు చేయగలిగినంత చేస్తున్నాయి.
ఇది అర్థం కావాలంటే ఒక దేశం అభివృద్ధి సాదాసీదాగా ఉండదనే వాస్తవం తెలియాలి. ‘సోషలిజం విఫలమైంది’ అని, ‘గ్లోబల్ సౌత్ లోని కొన్ని దేశాలలో నెలకొన్న దారిద్య్రానికి ఆ దేశాలే బాధ్యతవహించాలి’ అని మితవాదులు చేసే విక్రుత వాదనలను వల్లెవేయటం చాలా తేలిక. వాస్తవం మరింత సంక్లిష్టంగా ఉంటుంది. అభివృద్ధి జరగాలంటే పెట్టుబడులు, మార్కెట్లు అవసరం. గత 400సంవత్సరాలుగా పెట్టుబడులపైన, మార్కెట్లపైన కొన్ని పశ్చిమ దేశాలు హింసాయుతంగాను, దోపిడీతోను ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. అలా పోగయిన సంపద వర్దమాన దేశాలకు ఏ కొంచమైనా అందుబాటులోకి రావాలంటే సంపన్న దేశాల షరతులను ఆమోదించాలి.
అంటే గ్లోబల్ సౌత్ లోని వర్దమాన దేశాలు అభివృద్ధి చెందాలంటే సంపద పున్ణపంపిణీకి ఏమాత్రం అవకాశం ఇవ్వని పశ్చిమ దేశాల రాజకీయ క్రమానికి(పొలిటికల్ ఆర్డర్), షరతులకు లోబడాలి. అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా తమ జాతీయ సార్వభౌమాధికారాన్ని, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని వదులుకోవటంవల్లనే దక్షిణ కొరియావంటి కొన్ని దేశాలు అభివృద్ధి చెందాయి. మరోవైపు పశ్చిమ దేశాల రాజకీయ ఆధిపత్యాన్ని ప్రతిఘటించే ఇరాన్ వంటి పెద్ద దేశాలకు కావలసిన పెట్టుబడులను, మార్కెట్లను అందుబాటులో లేకుండా చేయటం ద్వారా పశ్చిమ దేశాలు వాటి అభివృద్ధిని కుంటుపరుస్తున్నాయి.
కాబట్టి గ్లోబల్ సౌత్ దేశాల అభివృద్ధికి కావలసిన దారులన్నీ ప్రపంచ ఫైనాన్షియల్ వ్యవస్థపైన పశ్చిమ దేశాల ఆధిపత్యంవల్ల మూసుకుపోయాయి. అయితే ప్రపంచం మారుతోంది. స్వేచ్చా మార్కెట్ ఆర్థిక విధానాలను అనుసరిస్తే తనకు లోబడి వుంటుందనే ఉద్దేశంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా చైనాను భాగం చేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అలా భాగమైన చైనా అప్రతిహతంగా అనూహ్య అభివృద్ధిని సాధించటంతో వర్దమాన దేశాలకు పశ్చిమ దేశాల ఆర్థిక నమూనాలకు ఆవల తమ ఆర్థికాభివృద్ధిని సాధించటానికి కావలసిన వెసులుబాటు ఏర్పడింది. ప్రపంచంలో ఆవిర్బవిస్తున్న ఈ ప్రత్యామ్నాయాన్ని నిరోధించేందుకు, తన షరతులతో నిమిత్తం లేకుండా అభివృద్ధిని కాంక్షించే వర్దమాన దేశాలకు తనదైన శైలిలో పాఠం నేర్పేటందుకు చైనా ఎదుగుదలను అణచివేయటానికి అమెరికా పూనుకుంది.
ఇటువంటి భౌగోళిక రాజకీయ వాతావరణంలో పశ్చిమ దేశాల ఆధిపత్యానికి ఆవల వర్దమాన దేశాలు పరస్పర సహాకారంతో తమతమ ఆర్థిక వ్యవస్థలను అభివృద్ధి చేసుకునే లక్ష్యంతో ఏర్పడిన బ్రిక్స్ కు వ్యూహాత్మక ప్రాధాన్యత పెరిగింది. ఫైనాన్షియల్ టైమ్స్ రాసినట్టు ఇది చైనా నాయకత్వంలో ఏర్పడిన కూటమి కాదు. బ్రిక్స్ అలీన విధాన సంప్రదాయాలపై ఆధారపడి ఏర్పడిన గ్రూపు. బ్రెజిల్ ఎక్కువ వాణిజ్య సంబంధాలు కావాలని చూస్తున్నదని లేక ఇండియాకు చైనాతో సరిహద్దు తగాదా ఉన్నదని ఫైనాన్షియల్ టైమ్స్ రాయటం తప్పుత్రోవ పట్టించటానికే తప్ప మరొకటి కాదు. బ్రిక్స్ చేయవలసింది పశ్చిమ దేశాల ఆధిపత్యంలోని ఏకద్రువ ప్రపంచాన్ని అధిగమించి బహుళ ద్రువ వాతావరణాన్ని స్రుష్టించటమేతప్ప ‘ఈ దేశాన్నో, ఆ దేశాన్నో’ ఎంచుకోవటం కాదు. ఈ కారణం చేతనే అనేక దేశాలు బ్రిక్స్ లో చేరటానికి ఉత్సాహంగా ముందుకు వస్తున్నాయి.