చెవి దుద్దులు కొనివ్వలేదని..భర్తకు నిప్పంటించిన భార్య

నవతెలంగాణ-ఖమ్మం : చెవి దుద్దులు కొనివ్వడం లేదని భర్తకు భార్య నిప్పంటించిన ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. గాయపడిన అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఆమెపై ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది. ఇన్‌స్పెక్టర్‌ ఉదయ్‌కుమార్‌ కథనం ప్రకారం.. ఖమ్మం నగరంలోని నిజాంపేటలో నివసించే షేక్‌ యాకూబ్‌పాషా, సమీనా దంపతులు కూలి పనులు చేసుకుని జీవిస్తున్నారు. తనకు చెవి దుద్దులు కొనివ్వాలని సమీనా భర్తతో తరచూ గొడవ పడుతోంది. ఈ విషయంపై శనివారం సాయంత్రం ఇద్దరి మధ్య మరోమారు గొడవ జరిగింది. తన వద్ద అంత డబ్బు లేదని.. కొనివ్వలేనని పాషా తేల్చిచెప్పారు. దీంతో క్షణికావేశానికి లోనైన సమీనా.. తన భర్తపై పెయింట్లకు సంబంధించిన రసాయనాన్ని పోసి నిప్పంటించింది. ఈ ఘటనలో అతను గాయపడ్డారు. పాషా తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

Spread the love