మహిళకు రెండోసారి గుండెలో రెండు వాల్వుల మార్పిడి

– ఎస్‌ఎల్‌జీ ఆస్పత్రిలో అత్యంత అరుదైన శస్త్ర చికిత్స
– విజయవంతంగా చేసిన డాక్టర్‌ సుధీర్‌ బృందం
నవతెలంగాణ-సిటీబ్యూరో
గతంలో ఒకసారి గుండెలో రెండు వాల్వుల మార్పిడి శస్త్రచికిత్స జరిగిన రోగికి.. ఆ రెండూ విఫలం (స్ట్రక్చరల్‌ వాల్వ్‌ డిటీరియరేషన్‌ -ఎస్‌వీడీ) కావడంతో మరోసారి శస్త్రచికిత్స చేసి ఆ రెండింటినీ మార్చిన అరుదైన ఘటన నగరంలోని ఎస్‌ఎల్‌జీ ఆస్పత్రిలో జరిగింది. ఈ కేసు వివరాలను ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్‌ కార్డియోథొరాసిక్‌ సర్జన్‌ డాక్టర్‌ జి.సుధీర్‌ తెలిపారు. ”వరంగల్‌ ప్రాంతానికి చెందిన మంజుల అనే 42 ఏండ్ల మహిళకు సుమారు దశాబ్దం క్రితం మైట్రల్‌ వాల్వ్‌, అయోటిక్‌ వాల్వ్‌ రెండింటినీ మార్చాల్సి వచ్చింది. అప్పట్లో ఆమెకు జంతువుల గుండె నుంచి తీసిన బయోప్రోస్థటిక్‌ వాల్వులను అమర్చారు. అప్పట్లో వీటి జీవితకాలం 10 నుంచి 15 ఏండ్లు మాత్రమే ఉండేది. ఈ మహిళలో పదేండ్లకే ఆ రెండూ పాడయ్యాయి. ఈ కారణంగా ఆమెకు ఆయాసం, గుండెదడ ఎక్కువగా వచ్చాయి. కాళ్ల వాపులు, ముఖం వాయడం, ఇతర సమస్యలూ ఉన్నాయి. ఈ లక్షణాలతో ఆమె 6 నెలలుగా బాధపడుతున్నారు. దాంతో ఆమెకు గతంలో అమర్చిన వాల్వులను రెండింటినీ మార్చాల్సి వచ్చింది. మొదటిసారి వాల్వులు వేసేటప్పుడు పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ వాటిని మార్చడం అనేది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ఒక్కో వాల్వుకు సుమారు 12 నుంచి 15 కుట్లు వేయాల్సి ఉంటుంది. అంటే రెండింటికీ కలిపి 30కి పైగా కుట్లు లోపల ఉంటాయి. వాటన్నింటినీ కత్తిరించి, పాడైన వాల్వులను తీసి, మళ్లీ కొత్త వాల్వులు పెట్టాలి. అలా పెట్టేటప్పుడు అక్కడే మళ్లీ కుట్లు వేయాలి. తీసే క్రమంలో కుట్లలో ఏ చిన్న నలక అయినా లోపల ఉండిపోతే, అది రక్తం ద్వారా మెదడులోకి వెళ్లి, పక్షవాతం సంభవించే ప్రమాదం ఉంటుంది. రక్తం ద్వారా మరే ఇతర అవయవయంలోకి అయినా వెళ్లచ్చు. మరికొన్ని సందర్భాల్లో రోగులు ఆపరేషన్‌ టేబుల్‌ మీదే మరణిస్తారు కూడా. ఇంత ప్రమాదం ఉండటంతో నగరంలోని కొన్ని ఆస్పత్రుల వారు ఈ కేసును తీసుకోవడానికి నిరాకరించారు. దాంతో ఆమె ఎస్‌ఎల్‌జీ ఆస్పత్రికి రాగా.. ఇక్కడ అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి, దాదాపు 10 గంటలకు పైగా శస్త్రచికిత్స చేసి, ఆమెకు సురక్షితంగా మెకానికల్‌ వాల్వులను అమర్చాం. ఈ శస్త్రచికిత్సలో కార్డియో థొరాసిక్‌ సర్జన్‌ డాక్టర్‌ సుధీర్‌, కార్డియాక్‌ అనెస్థటిస్టు డాక్టర్‌ మానస, కార్డియాలజిస్టు డాక్టర్‌ భాను, ఇంటెన్సివిస్టు డాక్టర్‌ శ్రీనివాస్‌, తదితరులు కూడా పాల్గొన్నారు.

Spread the love