– అభ్యంతరాలు వ్యక్తం కాకుండా ఒప్పించాలి
– బిల్లు సజావుగా పాస్ అవ్వడానికి పార్టీలు సహకరించాలి : ఎమ్మెల్సీ కవిత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
లోకసభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టడం సంతోషంగా ఉందనీ, ఆ బిల్లుకు పార్లమెంట్‌లో అన్ని పార్టీలు సహకరించాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. దానికోసం అధికార పార్టీ మిగతా పార్టీలతో సంప్రదింపులు జరపాలని సూచించారు. ఆ బిల్లు ఆమోదం చెందితే పార్లమెంటులో మహిళా సభ్యుల సంఖ్య 181 కి చేరుతుందనీ, దేశ నిర్మాణానికి మరింత శక్తి చేకూరుతుందని స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అంబేద్కర్, కేసీఆర్ స్పూర్తితో మహిళా బిల్లు కోసం తాము ఉద్యమించామని తెలిపారు. గతంలో మాదిరిగానే ఈసారీ అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లు లేవని తెలిపారు. ఓబీసీ మహిళల అంశంతో పాటు జనగణన, డీలిమిటెషన్ వంటి వాటిపై సందేహాలున్నా యనీ, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత మోడీ సర్కారుపై ఉందని పేర్కొన్నారు. రాజ్యసభలో బిల్లు నెగ్గేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనీ, లేదంటే చరిత్ర పునరావృతమ వుతుందని హెచ్చరించారు. మహిళా బిల్లును ప్రవేశపెట్ట డానికి ఒత్తడి చేయాలని 47 పార్టీలకు లేఖ రాశానని గుర్తు చేశారు. దీనిపై నిరంతరంగా పోరాడామని తెలిపారు.
కవిత వల్లనే మహిళా బిల్లు సాకారం : సెర్ప్ జేఏసీ
ఎమ్మెల్సీ కవిత వల్లనే మహిళా బిల్లు సాకారమైందని సెర్ప్ ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర నాయకులు కుంట గంగాధర్ రెడ్డి ఏపూరి నర్సయ్య సుదర్శన్ మహేందర్ రెడ్డి, భారతి పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని సెర్ప్ కార్యాలయంలో కవిత చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కవిత పోరాటం వల్ల తెలంగాణలో 40 మంది మహిళలు శాసనసభ సభ్యులుగా ఎన్నికయ్యే అవకాశం ఏర్పడిందన్నారు.