లాటరీలో రూ.1 కోటి.. పోలీస్ స్టేషన్ కు పరుగెత్తిన కార్మికుడు

నవతెలంగాణ-హైదరాబాద్ : కేరళలో ప్రభుత్వం లాటరీలు నిర్వహిస్తుంటుంది. సాధారణ వ్యక్తులు సైతం కేరళలో లాటరీ గెలిచి కోటీశ్వరులయ్యారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన బిర్షు రాంబ అనే వలస కార్మికుడు కేరళ లాటరీ విజేతగా నిలిచాడు. రాంబ కేరళలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గత సోమవారం నాడు 50-50 అనే లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. ఆ టికెట్ నెంబరుకే కోటి రూపాయల ప్రైజ్ లభించింది. అయితే, అంత డబ్బు వచ్చేసరికి హడలిపోయిన రాంబ పోలీస్ స్టేషన్ కు పరుగెత్తాడు. అతడిలో భయాందోళన గమనించిన పోలీసులు, ఎవరైనా వెంట తరుముతున్నారేమోనని ఆరా తీశారు. అలాంటిదేమీ లేదని, అయితే తాను లాటరీ గెలిచానని, కోటి రూపాయల ప్రైజ్ కావడంతో తనకు భద్రత కావాలని పోలీసులను కోరాడు. తనకు లాటరీ డబ్బులు ఎలా తీసుకోవాలో తెలియదని, ఆ విషయంలో తన సహాయపడాలని రాంబ విజ్ఞప్తి చేశాడు. దాంతో అసలు విషయం తెలుసుకున్న పోలీసులు, అతడికి లాటరీ డబ్బులు ఇప్పించే చర్యలు చేపట్టారు. లాటరీ డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలని అతడికి చెప్పారు. సోషల్ మీడియాలో ఈ వ్యవహారం వైరల్ అవుతోంది.

Spread the love