కార్మికులు, రైతుల పక్షాన నిలిచే ఎర్రజెండాకే ఓటేయ్యాలి

– పేదల సంక్షేమాన్ని మరిచిన స్థానిక ఎమ్మెల్యే
– ఎన్నికల సమయంలో దర్శనమిచ్చిన మల్‌రెడ్డి రంగారెడ్డి
– కంపెనీల పేరుతో వందల ఎకరాల భూమిని గుంజుకున్నా ప్రభుత్వం
– బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒకే కోవకు చెందిన పార్టీలే..
– సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి పగడాల యాదయ్యను అధిక మెజార్టీతో గెలిపించాలి
– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బి. భూపాల్‌
నవతెలంగాణ-యాచారం
కార్మికులు, రైతులు, కర్షకుల పక్షాన నిలిచే ఎర్రజెండాకు ఓటేయ్యాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బి. భూపాల్‌ ఓటర్లను కోరారు. బుధవారం యాచారం మండల పరిధిలోని గడ్డమల్లయ్యగూడ, గున్‌గల్‌, చౌదర్పల్లి, యాచారం, మొగుళ్ళ వంపు, గాండ్లగూడ, తమ్మలోనిగూడ, మాల్‌, మంతన్‌గౌరెల్లి గ్రామాల్లో సీపీఐ(ఎం) అభ్యర్థి పగడాల యాదయ్యను అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్య ర్థించారు. చౌదర్పల్లిలో సీపీఐ(ఎం) అభ్యర్థికి ప్రజలంతా బొట్టుతో ఘన స్వాగతం పలికి మద్దతు తెలిపారు. అనంతరం గ్రామంలో ప్రచార రథంతో ర్యాలీ నిర్వహించి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకే ఓటే య్యాలని నాయకులు కోరారు. ఈ సందర్భంగా భూపాల్‌ మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నియోజక వర్గంలో గత పదిహేనేండ్లుగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి పేదల సంక్షేమాన్ని విస్మరించారని అన్నారు. పేదల భూములను గుంజుకుని పెద్ద ఎత్తున రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని కొనసాగించి కోట్ల రూపాయలకు పడగలెత్తారని అన్నారు. నిరుపేదలకు డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. పదేండ్ల కాలంలో కొత్తగా పెండ్లీలు అయిన జంటలకు రేషన్‌ కార్డు రాక, ఉండటానికి ఇల్లు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి ఎన్నికల సమ యంలో ప్రజలకు దర్శనమిస్తున్నారని విమర్శించారు. ధరణిలో ఈ ప్రాంత పేదల, మధ్యతరగతి రైతుల భూ సమస్యలు పరిష్కారం కాక రెవెన్యూ కార్యాలయంలో చుట్టూ తిరిగుతున్నప్పటికీ ఆ సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ఇబ్రహీంపట్నం ప్రాంతంలో సీపీఐ(ఎం) ఎమ్మెల్యేలు మూడుసార్లు గెలిచారని, వారు అందించిన ప్రజా సంక్షేమం గొప్పదన్నారు. యాచారం గ్రామంలో భూ సమస్యలు తీవ్రంగా ఉన్నాయనీ, వాటి పరిష్కా రానికి కృషి చేయడంలో స్థానిక ఎమ్మెల్యే పూర్తిగా విఫల మయ్యారని విమర్శించారు. ఓటర్లంతా ఆలోచించి పేదల పక్షాన నిలబడే సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి పగడాల యాదయ్యకు ఓట్లేసి, అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
పదేండ్ల కాలంలో ఇల్లు, రేషన్‌ కార్డు ఇవ్వని ప్రభుత్వం : సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి పగడాల యాదయ్య
తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, ఉద్యోగాల పేరుతో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్‌, స్థానిక ఎమ్మెల్యే పేదలందరికీ డబుల్‌ బెడ్రూం ఇండ్లు , రేషన్‌ కార్డులు ఇవ్వలేదని సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి పగడాల యాదయ్య అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో సీసీరోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రయినేజీ సమస్యలు నేటికీ పరిష్కారం కాలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక్కరోజు కూడా పట్టించుకోలేదనీ, నియోజకవర్గంలో ఏం మొఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. మూడు పర్యాయలుగా సీపీఐ(ఎం) ఎమ్మెల్యేలుగా కొండిగారి రాములు, మస్కు నర సింహలు నిరంతరం పేదల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని కొనియాడారు. వారి హాయాంలో నియోజకవర్గం ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. పేదలకు ఇండ్లు రావాలన్నా, రేషన్‌ కార్డు కావాలన్నా సీపీఐ(ఎం) నక్షత్రం గుర్తుకు అధిక ఓట్లు వేసి, తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని పగడాల యాదయ్య ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి. మధుసూదన్‌ రెడ్డి, చంద్రమోహన్‌, జిల్లా కమిటీ సభ్యులు దుబ్బాక రామచందర్‌, కందుకూరి జగన్‌, పి అంజయ్య, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఆలంపల్లి నరసింహ, మండల కమిటీ సభ్యులు పెండ్యాల బ్రహ్మయ్య, శ్రీమన్నారాయణ, ఆలంపల్లి జంగయ్య, అమీర్పేట మల్లేష్‌, ఎంజె. వినోద్‌ కుమార్‌, మస్కు అరుణ, ఉమా, పుష్ప, మస్కు చరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love